తాలిబన్ కీలక నేత ముల్లా నూరుద్దీన్
కాబూల్: మరోసారి అఫ్ఘానిస్థాన్‌లో అధికారం చేపట్టిన తాలిబన్లు ఈసారి తమ పాలనను సంస్కరించుకుంటారని ఆశిస్తున్నవారికి నిరాశ కలిగించేలా వారి కీలక నేత వ్యాఖ్యలున్నాయి. తాము త్వరలోనే ఉరిశిక్షలు, చేతుల నరికివేతలాంటి కఠిన శిక్షలు అమలులోకి తెస్తామని తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా నూరుద్దీన్ తురాబీ స్పష్టం చేశారు. అయితే, గతంలో వలె శిక్షల్ని బహిరంగంగా అమలు చేయాలనుకోవడంలేదని ఆయన అన్నారు. అంతా తమ కఠిన శిక్షల గురించే విమర్శిస్తున్నారు. కానీ, వాటికి సంబంధించిన తమ చట్టాల గురించి పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు.
తాము ఖురాన్ ఆధారంగా రూపొందించుకున్న ఇస్లామిక్ చట్టాలను అనుసరిస్తామని ఆయన తెలిపారు. అఫ్ఘన్‌లో ఇస్లామిక్ చట్టాల్ని అమలు చేయడంలో ముల్లా నూరుద్దీన్‌కు కీలక పాత్ర ఉంటుంది. తమ భద్రత కోసం తమ వ్యతిరేకుల చేతుల నరికివేత సరైందేనని ఆయన సమర్థించుకున్నారు. కఠిన శిక్షల్ని బహిరంగంగా అమలు చేయాలా..? లేదా అందుకు ఓ విధానాన్ని రూపొందించుకోవాలా..? అనే దానిపై కేబినెట్ అధ్యయనం చేస్తోందని ఆయన తెలిపారు. అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో నూరుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్తున్న క్రమంలోనే గత వారి పాలనను గుర్తు చేసుకున్న చాలామంది ఇప్పటికే ఆ దేశాన్ని వీడి పారిపోయారు. వెళ్లలేక అక్కడే మిగిలిపోయినవారు తమ జీవితాలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తాలిబన్లు తమ ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఐక్యరాజ్యసమితిలో తమకు ప్రాతినిథ్యం కల్పించాలని ఇటీవల వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఐరాస సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.