50 శాతం సిబ్బందికి వర్క్ ఫ్రం హోం : కేంద్రమంత్రి జితేంద్రసింగ్
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో గర్భిణులు, దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భౌతికహాజరీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్రసిబ్బంది,శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ(డిఒపిటి) సహాయమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. వారు ఇంటి నుంచే పని చేయుటకు(వర్క్ ఫ్రం హోంకు) వీలు కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్‌ల్లోని సిబ్బందికి కూడా ఈ అవకాశం కల్పిస్తున్నామన్నారు. పని వేళల మధ్య వ్యవధి ఉండేలా ఉదయం 9 నుంచి సాయంత్రం 530కి, ఉదయం 10 నుంచి సాయంత్రం 630కి మార్చుతున్నట్టు సింగ్ తెలిపారు. దీంతో, ఆఫీసులకు వచ్చేటపుడు, పోయేటపుడు గుంపులుగా చేరకుండా నిరోధించవచ్చునని తెలిపారు.
కార్యదర్శిస్థాయికన్నా కింది ఉద్యోగుల్లో 50 శాతం భౌతికంగా హాజరవుతూ, మిగతా 50 శాతం ఇంటి నుంచే పని చేయాలని కూడా డిఒపిటి ఆదేశించింది. ఇంటి నుంచి పని చేసే సిబ్బంది ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ సమాచార వ్యవస్థల ద్వారా అందుబాటులో ఉండాలని కూడా ఆదేశించింది. కార్యాలయాల్లో పని చేసే సిబ్బంది కొవిడ్ నియంత్రణ నిబంధనలను పాటించాలని ఆదేశించింది. అధికారులు, సిబ్బంది తమ సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నిర్వహించుకోవాలని ఆదేశించింది. తప్పనిసరి అయితే మినహా సందర్శకులనెవరినీ కార్యాలయాలకు అనుమతించొద్దని కూడా ఆదేశించింది. ఆదివారం ఒక్కరోజే 1,59,632 కేసులు, 327 మరణాలు నమోదైన నేపథ్యంలో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది.