Sunday, December 22, 2024

రేపటి నుంచి కసరత్తు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఏడాదిలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు బిఆర్‌ఎస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇ టీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు పునరావృతం కాకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవలే తుంటి మార్పిడి సర్జరీ చేయించుకుని నె మ్మదిగా కోలుకుంటున్నారు. మరికొన్ని రోజులలో కెసిఆర్ పార్టీ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గులాబీ బాస్ పార్లమెంట్ ఎన్నికల పై దృష్టి సారించనున్నారు. లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన, ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్నికల ప్రణాళిక ఏంటి, ఎలాంటి వారిని బరిలో దింపాలి అనే అంశాలపై కెసిఆర్ దృష్టి సారించనున్నట్లు సమాచారం. అందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి బిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది.

బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ  భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీశ్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్‌లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో… ఈ జనవరి 13 నుంచి 15 వరకు మధ్యలో మూడురోజుల విరామమిచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనున్నది.
1.85 శాతం ఓట్లతో అధికారానికి దూరం
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో ఆ నియోజకవర్గాలపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించనున్నారు. 2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ కేవలం 1.85 శాతం ఓట్లతోనే అధికారానికి దూరమయ్యింది. దాదాపు ఏడెనిమిది సీట్లు నాలుగైదు వేల ఓట్ల మెజారిటీతో పోయాయని ఇటీవల కెటిఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో స్వల్ప తేడాతో ఓటమి పోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించి పార్లమెంట్ ఎన్నికల సమయానికి ఆయా నియోజకవర్గాలలో తమ బలాన్ని పెంచుకునేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లు తెలిసింది. రాష్ట్ర శాసనసభల్లో ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు జిల్లాల్లో సీట్లు తక్కువగా వచ్చినప్పటికీ హైదరాబాద్‌లో మాత్రం విజయధుంధుబి మోగించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ పార్టీకి ఉన్న పట్టు సడలకుండా బిఆర్‌ఎస్ అధిష్టానం గ్రేటర్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. బిఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సేవలను విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ తమ పట్టు నిలుపుకునేందుకు పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ బిఆర్‌ఎస్ పటిష్టంగా ఉన్నదని, 2 శాతం కంటే తక్కువ ఓట్లతోనే అధికారం కోల్పోయిన విషయాన్ని పార్టీ కేడర్‌కు వివరిస్తూ అధినాయకత్వం పార్టీ కేడర్‌ను ఉత్సాహపరుస్తోంది. రానున్న పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగిరేసేందుకు అందరము కలిసికట్టుగా పనిచేద్దామని బిఆర్‌ఎస్ అధిష్టానం పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ప్రణాళికలు
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు బిఆర్‌ఎస్ అధిష్టానం ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. జిల్లాలవారీగా పార్టీ పరిస్థితులను సమీక్షించి అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు వ్యూహాలను సిద్దం చేసుకున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంతో పనిచేసినప్పటికీ పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో కేడర్ ఏమాత్రం నిరుత్సాహ పడకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్సాహం పనిచేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయనున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News