Saturday, December 21, 2024

వ్యవ‘సాయం’పై కసరత్తు

- Advertisement -
- Advertisement -

రైతుబంధు నిధుల పెంపుపై ప్రత్యేక దృష్టి

సేంద్రియ సాగుకు ప్రాధాన్యం

చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం
పంటలకు మెరుగైన బీమా పథకం

కర్నాటక తరహాలో ‘కృషిభాగ్య’

కన్నడ బాటలోనే ‘రైతు సురక్ష’ పథకాలు

మన తెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ గడ్డపై వ్యవసాయరంగంలో వినూత్న మార్పులకు బీజాలు పడుతున్నాయి. రైతులకు గట్టి మేలు తలపెట్టేలా పథకాలకు రూపకల్పన జరుగుతోంది. దశాబ్దకాలం తరువాత తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల్లో రైతాంగానికి హామీలు ఇచ్చినట్టుగానే వాటిని అమలు చేసేందుకు అవసరమైన ప్రాథమిక ప్రణాళికల రూపకల్పనపై అధికార యంత్రాగం దృష్టి సారించింది. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారే కావటంతో వ్యవసాయరంగం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్‌పార్టీ పరంగా చేసిన వాగ్ధానాలు కూడా అధికంగా వ్యవసాయరంగంతో ముడిపడినవే కావటంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవసాయరంగంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

ప్రతిపక్ష పార్టీలనుంచి, ప్రత్యేకించి ప్రధానప్రతిపక్ష పార్టీగాఉన్న బిఆర్‌ఎస్ పార్టీ నుంచి అపుడే డిమాండ్లు కూడా మొదలయ్యాయి. వ్యవసాయరంగానికి కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన వాగ్ధానం మేరకు రైతుబంధు పథకం నిధులు పెంచి ఎప్పటి నుంచి నిధులు జ మ చేస్తున్నారో స్పష్టంగా ప్రకటించాలని, క్వింటాలుకు రూ.500బోనస్ అమలు చేయాలని బిఆర్‌ఎస్‌పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావు శనివారం శాసనసభ ఆవరణంలోనే కొత్త ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం కూడా ఎక్కువగా సమయం తీసుకోకుండా రైతుబంధు పథకం కింద నిధుల జమపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. ఆర్థ్ధిక మల్లుభట్టి విక్రమార్క పదవీబాధ్యతలు చేపట్టిన వెంటనే క్షణం కూడా జాప్యం లేకుండా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం విజయవంతంగా ముందుకు నడవాలంటే అర్థికశాఖ యం త్రాంగమే కీలకం అంటూ వ్యాఖ్యానించి రైతుబం ధు నిధుల జమకు సంబంధించి ఆర్థికశాఖపై ఉన్న తక్షణ కర్తవ్యాన్ని మంత్రి ఆ శాఖ ఉన్నతాధికారులకు గుర్తు చేశారు. తెలంగాణకు పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలు వాటి ఫలితాలపై రేవంత్ సర్కారు దృష్టి సారించింది.

కర్ణాటకలో కృషి భాగ్య, కర్నాటక రైతు సురక్ష, ముఖ్యమంత్రి రైతు విద్యానిధి, సాగు, పంటల ప్రోత్సాహక పథకం, మైక్రో ఇరిగేషన్, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్,తదితర పథకాలు వాటి అమలు తీరును త్వరలోనే సమీక్షించే అవకాశాలు ఉన్నట్టు అధికారు వర్గాలు పేర్కొన్నా యి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయశాఖను నాగేశ్వరావుకు అప్పగించారు. తుమ్మల సీనియర్ నేత కావడం, గతంలో పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో ఎంతో కీలకమైన వ్యవసాయశాఖను తుమ్మలచేతిలో పెట్టారు. మంత్రి తుమ్మల కూడా బాధ్యతలు చేపట్టిన వెంటనే శాఖపరమైన సమీక్షను వెంటనే ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నారు. తనపై ఎంతో నమ్మకంతో కీలకమైన వ్యవసాయశాఖను అప్పగించినందున సిఎం నమ్మకాన్ని వమ్ము చేయకుండా తుమ్మల వ్యవసాయశాఖను ప్ర గతి పథంలో నడిపించాలన్న పట్టుదలతో ఉన్నారు.

గత ప్రభుత్వంలో పంటల బీమా పథకం అమలులో లేకపోవడంతో అతివృష్టి అనావృష్టి తదితర ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు నష్టపో తూ వచ్చారు. రాష్ట్రస్థాయిలోనే పంటల బీమా పథకం రూపొందిస్తున్న తరుణంలోనే ప్రభుత్వాలు మారిపోయాయి. కర్ణాటకలో ఇప్పటికే పిఎం ఫసల్ బీమా పథకం అమల్లో ఉంది. అదే పథకాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలా లేక కొత్త పథకాన్ని సిద్ధం చేయాలా అన్నది కూడా కొత్త ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News