ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదా?, అసోం మినహా మిగతా నాలుగింట నిరాశే!
హోరాహోరీ ప.బెంగాల్‌లో మళ్లీ మమతదే అధికారం
తమిళనాడులో డిఎంకెకు పట్టం, కేరళలో తిరిగి వామపక్ష కూటమిదే విజయం
ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ అంచనాల వెల్లడి, మే 2న కౌంటింగ్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బే పడేలా కనిపిస్తోంది. ఒక్క అస్సాంలో తప్ప మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీకి అధికారం దక్కే అవకాశాలే లేవని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఎంతో ఆసక్తి రేపిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అధికారం మరోసారి మమతా బెనర్జీకే దక్కనున్నట్లు తేలింది. అదే జరిగితే మమత సీఎం పీఠం ఎక్కడం వరుసగా మూడోసారి అవుతుంది. మరోవైపు తమిళనాడులో డీఎంకే, మిత్రపక్షాలు స్వీప్ చేయనుండగా.. కేరళలో మరోసారి ఎల్డీఎఫ్ అధికారంలోకి రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
ఏబీపీ న్యూస్ సీఓటర్, ఎన్డీటీవీ సర్వేలన్నీ పశ్చిమ బెంగాల్లో మమతకే పట్టం కట్టాయి. ఏబీపీ న్యూస్ సీఓటర్ సర్వే ప్రకారం బెంగాల్లోని మొత్తం 294 స్థానాలకు గాను తృణమూల్ కాంగ్రెస్ 152-164 స్థానాల్లో గెలవనుండగా.. బీజేపీ 109-121 స్థానాలకు పరిమితం కానుంది. లెఫ్ట్, ఇతరులు మరో 11-21 స్థానాల్లో గెలవనున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఇక ఎన్డీటీవీ ప్రకారం.. బెంగాల్లో తృణమూల్కు 156 స్థానాలు రానున్నాయి. రిపబ్లిక్-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. తృణమూల్కు 126-136, బీజేపీ, మిత్రపక్షాలకు 138-148 సీట్లు రానున్నాయి.
టైమ్స్నౌ సీఓటర్, ఏబీపీ సీఓటర్, ఈటీజీ రీసెర్చ్, పీ-మార్క్ ఎగ్జిట్ పోల్స్ వెస్ట్ బెంగాల్లో తృణమూల్ అధికారంలోకి వస్తుందని చెబుతుండగా.. జన్కీ బాత్, రిపబ్లిక్ సీఎన్‌ఎక్స్ మాత్రం బీజేపీకి ఎక్కువ స్థానాలు రానున్నట్లు అంచనా వేశాయి.
అస్సాంలో బీజేపీదే అధికారం అని ఈ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీటీవీ ప్రకారం మొత్తం 126 స్థానాల్లో బీజేపీకి 76 స్థానాలు రానున్నాయి. అటు ఇండియా టుడే కూడా బీజేపీకి 75-85 స్థానాలు రానున్నట్లు అంచనా వేసింది. ఆజ్తక్-యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి 75-85 మధ్య స్థానాలు వస్తాయని చెబుతోంది.
కేరళలో మరోసారి లెఫ్ట్ కూటమికే ప్రజలు పట్టం కట్టనున్నట్లు ఎన్డీటీవీ, ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇండియా టుడే ప్రకారం.. కేరళలో మొత్తం 140 స్థానాలకు గాను ఎల్డీఎఫ్ కూటమికి 104-120 స్థానాలు రానున్నాయి. అదే ఎన్డీటీవీ మాత్రం ఎల్డీఎఫ్కు 76 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
ఇక తమిళనాడు విషయానికి వస్తే అన్ని ఎగ్జిట్ పోల్స్ డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశాయి. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 234 స్థానాలు ఉన్న తమిళనాడులో డీఎంకేకు 160-170 స్థానాలు రానుండగా.. అన్నాడీఎంకే 58-68 స్థానాలకు పరిమితం కానుంది. అటు ఎన్డీటీవీ కూడా అన్నాడీఎంకేకు 58 స్థానాలకు మించి రావని తేల్చేసింది.
తమిళనాడు విషయానికి వస్తే రిపబ్లిక్ సీఎన్‌ఎక్స్, టుడేస్ చాణక్య, పీ-మార్క్ అన్నీ డీఎంకే కూటమికే అధికారం పక్కా అని తేల్చేశాయి. అంతేకాదు డీఎంకేకు 160కి పైనే స్థానాలు వస్తాయని అన్ని ఎగ్జిట్పోల్స్ తేల్చడం గమనార్హం.
Exit Polls 2021: Close Fight between TMC and BJP in Bengal