న్యాయవ్యవస్థకు ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వేళ జీవించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లుగానే అందరికీ సమాన న్యాయం లభించేందుకు అనుకూలమైన పరిస్థితులు కల్పించడం కూడా అంతే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వివిధ జైళ్లలో సంవత్సరాల తరబడి మగ్గుతున్న అండర్‌ట్రయల్ ఖైదీల విడుదలను వేగవంతం చేయాలని ఆయన న్యాయవ్యవస్థకు విజ్ఞప్తి చేశారు. శనివారం నాడిక్కడ అఖిల భారత జిల్లా న్యాయ సేవా సంస్థల తొలి సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తూ న్యాయవ్యవస్థ పట్ల ప్రజలలో అచంచల విశ్వాసం ఉందని చెప్పారు.
సమాజంలోని అన్ని వర్గాలకు సమానమైన న్యాయం అందాలని, అందుకు అందరికీ అందుబాటులో న్యాయవ్యవస్థ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఇది ఆజాదీ కే అమృత్ కాల్ సమయమని, రానున్న 25 సంవత్సరాలలో దేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చే తీర్మానాలను చేయాల్సిన తరుణమని ఆయన అన్నారు. వ్యాపారానికి అనుకూలమైన పరిస్థితులు, జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించినట్లుగానే దేశ అమృత్ యాత్రలో ప్రజలందరికీ సమానమైన న్యాయం లభించేందుకు అనుకూలమైన పరిస్థితులు కల్పించడం కూడా ఎంతో ముఖ్యమని ప్రధాని అన్నారు. అండర్‌ట్రయల్ రివ్యూ కమిటీల చైర్‌పర్సన్లుగా జిల్లా జడ్జీలు అండర్‌ట్రయల్ ఖైదీల విడుదలను వేగవంతం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ కూడా పాల్గొన్నారు.
==