దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్నట్టు తాజా పరిశోధనల్లో వెల్లడి
న్యూఢిల్లీ : కరోనా విలయ తాండవంలో వ్యాక్సిన్ల కొరత చాలా దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ సమస్యను నివారించడానికి అందుబాటులో ఉన్న రెండు వేర్వేరు టీకా డోసులను వేసుకోవచ్చా..? అన్న కోణంలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టారు. ఈ విధంగా రెండు వేర్వేరు టీకా డోసులను తీసుకునే వారిలో దుష్ప్రభావాలు ఎక్కువ గానే ఉన్నట్టు తాజా పరిశోధనల్లో వెల్లడైంది. తీవ్ర ప్రమాదం లేక పోయినప్పటికీ వేర్వేరు టీకా డోసులను తీసుకోక పోవడమే మేలని నిపుణులు స్పష్టం చేశారు. ది లాన్సెట్ జర్నల్‌లో వెలువడిన నివేదిక కూడా దుష్ప్రభావాలు వస్తున్నాయని వివరించింది. అయినా ఈ దుష్ప్రభావాలు త్వరగా సమసి పోతున్నాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు డాక్టర్ మాథ్యూ స్నేవ్ పేర్కొన్నారు. ఈమేరకు 830 మంది వాలంటీర్లకు 28 రోజుల వ్యవధిలో ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వేర్వేరు డోసులను ఇచ్చి ప్రయోగాలు చేశారు.
ఈ రెండు వ్యాక్సిన్లను నాలుగు కాంబినేషన్లలో ఇవ్వగా, రెండు వేర్వేరు డోసులు తీసుకున్న వారి లోనే దుష్ప్రయోగాలు ఎక్కువగా కనిపించాయి. ఆస్ట్రాజెనెకా తొలి డోసు, ఫైజర్ రెండో డోసు తీసుకున్న వారిలో 34 శాతం మందిలో జ్వరం వంటి దుష్ప్రభావాలు కనిపించగా, రెండు డోసులు ఆస్ట్రాజెనెకా తీసుకున్న వారిలో కేవలం 10 శాతం మందిలో మాత్రమే సైడ్ ఎఫెక్ట్ కనిపించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రాలు (సిడిసి) ఒకే వ్యాక్సిన్‌ను రెండు మోతాదుల్లో తీసుకోవాలని సూచిస్తున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) కూడా ఇదే విధంగా సూచిస్తోంది. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నవారు రెండో డోసు ఇతర రాష్రాల్లో లేదా జిల్లాల్లో తీసుకోవాల్సి వస్తే తప్పకుండా అదే వ్యాక్సిన్ డోసు తీసుకోవాలని భారత ఆరోగ్యశాఖ వివరించింది.