ఈఓడబ్లూ అధికారులతో సమీక్ష
నిర్వహించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
హైదరాబాద్: ఆర్థిక నేరాల దర్యాప్తులో నిపుణుల సలహాలు తీసుకోవాలని, దీని వల్ల కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేయగలమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. ఆర్థిక నేరాల విభాగం పోలీస్ అధికారులతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ ఈఓడబ్లూ అధికారులు పనిని విభజించుకోవాలని అన్నారు. అన్ని స్థాయిల్లో పనిని విభజించుకుంటే కేసులను త్వరగా పరిష్కరించగలమని అన్నారు. ముఖ్యమైన కేసుల గురించి చర్చించారు, దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పలు సూచనలు ఇచ్చారు.
ఆర్థిక నేరాల రూపు మారిందని, నేరస్థులు వివిధ రకాలుగా అమాయకులను దోచుకుంటున్నారని అన్నారు. కంపెనీలు, బ్యాలెన్స్‌షీట్, ఫండ్ ఫ్లో, స్టాక్ ఎక్సెంజ్‌లు, స్టాక్ బ్రోకింగ్, బ్యాంక్ స్టేట్‌మెంట్ తదితరాలను అద్యయనం చేయాలని అన్నారు. ఆర్థిక నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, దానికి అనుగుణంగా ఫొటోలు, వీడియోలు, వివిధ రకాల పద్దతుల ద్వారా పబ్లిసిటీ చేయాలని అన్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలని చాలామంది మల్టీలెవల్ మార్కెటింగ్ వైపు ఆకర్షితులు అవుతున్నారని అన్నారు. భూఆక్రమణలు, ఫోర్జరీ,బ్యాంక్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సమావేశంలో డిసిపిలు రోహిణిప్రియదర్శిని, కవిత, ఇందిరా పాల్గొన్నారు.