మహరాష్ట్ర ప్రభుత్వానికి నిపుణుల సూచన
అప్రమత్తంగా ఉండాలని అధికారులకు థాక్రే ఆదేశం
ముంబయి: ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌తో సతమతమవుతున్న మహారాష్ట్ర ఇంకా కుదుటపడకముందే, థర్డ్ వేవ్‌ను కూడా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణులు సూచించారు. జులై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ వేవ్ మొదలవుతుందని వారు సలహా ఇచ్చారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ ఈ సూచన చేసింది. టాస్క్‌ఫోర్స్‌లో వైద్య నిపుణులున్నారు. వీరి సూచనతో అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఉద్ధవ్‌థాక్రే ఆదేశించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న సెకండ్‌వేవ్ వల్ల పెరుగుతున్న కేసుల గ్రాఫ్ మే చివరి వారానికి పడిపోవడం ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేశారు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధం అవుతున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి రాజేశ్‌తోపే తెలిపారు. ప్రస్తుతం తమ రాష్ట్రం ఆక్సిజన్ సరఫరాలో స్వయం సమృద్ధిని సాధించేదిశగా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. ఆక్సిజన్ కొరతకు కారణాలు వెతికే పరిస్థితి లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ సూచించారని ఆయన అన్నారు. శుక్రవారం కూడా మహారాష్ట్రలో అత్యధికంగా 66,159 కేసులు, 771 మరణాలు నమోదయ్యాయి.