జైడస్ వ్యాక్సిన్‌కు కమిటీ ఓకె
అనుమతికి డిసిజిఐకి సిఫార్సు
సూది లేకుండా వాడే మూడు డోసుల మందు
న్యూఢిల్లీ: దేశంలో మరో కొవిడ్ వ్యాక్సిన్ రాకకు అవకాశం ఏర్పడింది. మూడు డోసుల పరిమాణపు జైడస్ క్యాడిలా (జై కోవ్‌డి) అత్యవసర వాడకపు అనుమతికి కేంద్ర ఔషధ మండలి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. తమ వ్యాక్సిన్ వాడకానికి అనుమతికి సంబంధించి జైడస్ సంస్థ సమర్పించిన దరఖాస్తును కేంద్రీయ ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ (సిడిఎస్‌సిఒ) గురువారం క్షుణ్ణంగా పరిశీలించింది. నిపుణుల బృందం ఈ టీకా పనితీరుపై సంతృప్తి చెంది, ఓకె పలికి తరువాత దీనికి అత్యవసర వాడకానికి సిఫారును డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) పరిశీలనకు పంపించింది. అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న జైడస్ కంపెనీ తమ టీకా అత్యవసర వాడకపు దరఖాస్తును జులై 1వ తేదీన డిజిజిఐకి పంపించింది. ఇప్పటికే ఈ కంపెనీ 50 కేంద్రాలలో అతి భారీ స్థాయిలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ వ్యాక్సిన్ వాడకానికి అనుమతి దక్కితే ఇదే ప్రపంచ స్థాయిలో కరోనా నియంత్రణకు వాడే తొలి డిఎన్‌ఎ టీకా అవుతుంది. ఇక భారతీయ కంపెనీ తయారీ అయిన ఈ వ్యాక్సిన్ దేశంలో ఆరవ వ్యాక్సిన్ అవుతుంది.
ఇప్పటివరకూ సీరం ఇనిస్టూట్ నుంచి వచ్చిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్, రష్యా టీకా స్ఫుత్నిక్, అమెరికా తయారీ అయిన మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాల సరసన చేరుతుంది. ఈ మూడు డోసుల టీకాను తొలిసారి తీసుకున్న తరువాత 28 రోజులకు తరువాత 56 రోజులకు తీసుకోవాలి. ఈ విధంగా 02856 రోజుల లెక్కలో వాడాల్సి ఉంటుంది. 12 ఏళ్లు దాటిన వారికి తమ టీకా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. తొట్టతొలి డిఎన్‌ఎ ప్రాతిపదిక ఈ ప్లాస్మిడ్ టీకాను చర్మం మధ్య కండరాలలోకి నీడిల్ రహిత ఇంజక్షన్ ప్రక్రియలో పంపిస్తారు. తమ కంపెనీ టీకాను వాడకంలోకి తీసుకువస్తే ఇది కేవలం పెద్దలకే కాకుండా 12 నుంచి 18 సంవత్సరాల లోపు వారిపై కూడా బాగా ప్రభావం చూపుతుందని కంపెనీఅనుబంధపు హెల్త్ కేర్‌సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ శర్విల్ పటేల్ తెలిపారు. తాము రూపొందించే రెండు డోసుల టీకాకు సంబంధించి మరింత పరిశీలనకు అవసరం అయిన ఇతర పత్రాలు సమర్పించాలని డిసిజిఐ సూచించిందని వివరించారు.