Friday, November 22, 2024

పదిలమైన భూగర్భ రహస్యాలకు సమాధి కట్టి వదిలారు

- Advertisement -
- Advertisement -

సిమ్లా : రాదారులను నిర్మించే క్రమంలో సరైన శాస్త్రీయత, ఆయా ప్రాంతాలకు ఉండే భూగర్భశాస్త్ర ప్రాధాన్యతను పట్టించుకోకపోవడం ఉపద్రవాలకు దారితీస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని కల్కా సిమ్లా రాదారి విస్తరణ పనులను అశాస్త్రీయంగా నిర్వహించారని నిపుణులు విమర్శిస్తున్నారు. రహదారులపై వాహనాల రాకపోకలు మరింత తేలిక అనే ఒకే ఒక్క విధానాన్ని పాటించారు. ఈ ప్రాంతంలో మొత్తం జియాలాజిని సమాధి చేసేశారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కల్కా సిమ్లా హైవే వెంబడి పర్వానూ సొలాన్ దారి పొడుగునా చేపట్టిన పనులతో కలిగే నష్టం భౌగోళికంగా పూర్తిగా ఇప్పట్లో తీర్చలేనిదని విమర్శలు వెలువడ్డాయి. ఈ ప్రాంతంలో విస్తారితమైన భౌగోళిక చరిత్ర కోట్లాది సంవత్సరాలుగా ఉంటూ వచ్చింది. అయితే రోడ్ల విస్తరణ పనుల పేరిట ఇక్కడి పర్వత వాలులను నిర్మూలించడం వాటిని రోడ్ల కోసం చదును చేయడం వల్ల ఈ ప్రాంతంలో రాబోయే రోజులలో అనేక రకాలుగా ఉపద్రవాలకు దారితీస్తుందని జియాలిజిస్టులు, నిపుణులు హెచ్చరించారు. హిమాలయాలకు సంబంధించి ఈ ప్రాంతం అత్యంత విలువైన చరిత్రతో ఉంది.

ఇక్కడి పర్వత శ్రేణువులతో చెడుగుడు ఆడుకుంటే తరువాతి దశలో క్రమేపీ తలెత్తే పలు రకాలైన అసమతుల్యతలతో పరిస్థితి దిగజారుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో భారీ వర్షాలతో గతి తప్పుతున్న ఆకస్మిక వరదలతో కనివిని ఎరుగని ప్రాణనష్టం ఆస్తినష్టం సంభవిస్తున్న దశలో దీనిని మరింతగా విషమింపచేసే పరిణామాలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరించారు. ఇక్కడి రాళ్లను కేవలం సాధారణ రాళ్లుగా ఎంచుకోవడానికి వీల్లేదని, వీటితో భూగర్భ పరిణామానికి సంబంధించిన చరిత్రను తెలియపర్చడం జరుగుతుందని జియాలజిస్టులు తెలిపారు. ఈ పర్వత ప్రాంతాలకు తరచూ విద్యార్థులను తీసుకువెళ్లడం జరుగుతుంది. భూమి , పర్వతాలు, ప్రత్యేకించి ఇక్కడి హిమాలయ పంక్తులలో అంతర్గతంగా నెలకొని ఉన్న పలు సృష్టి సంబంధిత రహస్యాలు కీలక విషయాలన్నింటికి ఇప్పుడు తెరపడినట్లు అయింది. ఈ పర్వతాలకు అడ్డుగా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రాకారాలను కట్టారని, దీనితో అత్యంత విలువైన సృష్టి పరిణామక్రమపు సమాచారం, తగు సాక్షాలు చెరిపివేసినట్లు అయిందని ప్రముఖ జియాలజిస్టు, జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ సంచాలకులు ఓమ్ భార్గవ తెలిపారు.

ఈ ప్రాంతంలో ఒకానొక దశలో సముద్రం ఉండి ఉండేదని చెప్పేందుకు అవసరం అయిన సాక్షాలు ఇంతవరకూ కన్పించాయని, అయితే ఇప్పుడు వెర్రితనంగా సాగించిన పనులతో భావితరాలకు వీటి గురించి తెలియచేయలేని స్థితి ఏర్పడిందని నిపుణులు వాపోతున్నారు. అప్పట్లో ఇక్కడ తీత్యస్ సముద్రం ఉండేది. తరువాత ఇది అంతరించింది. తరువాతి క్రమంలో స్వచ్ఛమైన నీటి పరివాహక ప్రాంతంగా మారింది. పలు నదులు, ప్రవాహాలు, సరస్సులు తలెత్తాయి. ఈ మార్పులు సంభవించడానికి లక్షలాది సంవత్సరాలు పట్టింది. అయితే అత్యంత కీలకమైన భౌగోళిక పరిణామాల క్రమాన్ని పట్టించుకోకుండా ఇక్కడ సిమ్లా నుంచి ఇతర ప్రాంతాలకు అనుసంధానం అయ్యేలా నాలుగు లైన్ల రోడ్లు రాదారిని విస్తరించారు. ఇటీవలి భారీ వర్షాలతో ఇక్కడి 40 కిలోమీటర్ల పర్వానూ సోలాన్ దారి పొడవునా పలు రకాలుగా గండ్లు ఏర్పడ్డాయి. పలు పల్లపు ప్రాంతాలకు నష్టం వాటిల్లింది . సుబతూ , దగషా పర్వత సముదాయాల ఏర్పాటుకు సంబంధించిన అత్యంత కీలకమైన

సమాచారం దీని వెనుక కోటి సంవత్సరాలుగా ఉన్న లోగుట్టు తెలుసుకునే పరిశోధనలకు ఇప్పుడు విఘాతం ఏర్పడింది. ఈ ప్రాంతంలో అశాస్త్రీయ రీతిలో మైలుదూరం నిర్మాణ లేదా విస్తరణ పనులు జరిగినా ఇవి తరువాతి తరాలకు మనం ఎటువంటి కీలక సమాచారం అందించలేని స్తితికి తీసుకువస్తాయి. అంతేకాకుండా మనకు తీవ్రస్థాయిలో ప్రకృతి వైపరీత్యాలను కల్పించినట్లు అవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News