భార్య, పిల్లలను కాల్చిచంపి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్‌మన్
ఆన్‌లైన్ గేమ్‌లు ఆడి లక్షల్లో అప్పుల పాలైన కానిస్టేబుల్ ఘాతుకం
సిద్దిపేట జిల్లా రామునిపట్లలో విషాదం
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట పరిధిలోని రామునిపట్లలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ ప్ర శాంత్ జీవన్ పాటిల్‌కు గన్‌మెన్‌గా పనిచేస్తున్న ఆకుల నరేష్ తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపి, తాను కూడా కా ల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..రామునిపట్ల గ్రామానికి చెందిన ఆకుల నరేశ్ (35) ఎఆర్ కానిస్టేబుల్ జిల్లా కలెక్టర్‌కు గన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా కలెక్టర్ వద్దకు వచ్చి తిరిగి ఇంటికి వె ళ్తున్న క్రమంలో సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తమ కుమారుడు ఆకుల రేవంత్ (6), కూతురు ఆకుల రిషిత (5)లను తన వాహనంపై ఎక్కించుకొని గ్రామానికి తీసుకువెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న సర్వీస్ రివాల్వర్‌తో భార్య ఆకుల చైతన్య (30)తో పాటు తన ఇద్దరు పిల్లలను కాల్చి చంపాడు. అదే రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తుపాకీ కాల్చిన చప్పుడు రావడంతో చుట్టుపక్కలవారు చూడడంతో రక్తం మడుగులో నలుగురు మృతి చెంది ఉన్నారు. కాగా, నరేష్ ఆన్‌లైన్‌లో గేమ్‌లు ఆడడంతోనే సుమారు 80 లక్షల అప్పు అయిందని, దీంతోనే ఆత్మహత్యకు పాల్ప డి ఉంటాడని గ్రామస్థులు చర్చించుకుంటున్నా రు. విషయం తెలుసుకున్న సిపి శ్వేత, ఎసిపి సురేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమి త్తం మార్చురీకి తరలించారు. ఒకే కుటుంబంలోని నలుగురి అకాల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా సిపి శ్వేత మాట్లాడుతూ.. కలెక్టర్ వద్ద గన్‌మెన్‌గా ఆకుల నరేష్ విధి నిర్వహణలో భాగంగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాడని అన్నారు. కలెక్టర్ సెలవులో ఉండడంతో అక్కడే ఆఫీస్‌లో ఉండకుండా ఇంటికి వచ్చాడని, అనంతరం భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపి తాను సైతం ఆదే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు ఆర్థ్ధిక ఇబ్బందులు ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి వివరాలు తెలియజేస్తామని అన్నారు.