Thursday, January 23, 2025

పక్షుల పాటల అన్వేషణ

- Advertisement -
- Advertisement -

జీవకళల పాటకోసం పక్షులు తపిస్తాయి. ఈపక్షుల పాటలకోసం మనిషి కనీసం ఓ క్షణమైనా ఆలోచించాలి. మనిషి ఎప్పుడూ పిల్లాళ్ల మనస్తత్వంతో ఉంటే లోకానికి సుభిక్షం, కక్షలు కార్ఫణ్యాలు, కల్లోలాలు గల్ఫ్‌యుద్ధాలు ఉక్రెయిన్ తండ్లాటలు లేని స్థితి నెలకొంటుంది. సహస్రచంద్రర్శన భాగ్యం సంతరించుకున్న విశ్రాంత, అవిశ్రాంత ఆచార్యులు ఒద్దిరాజు మురళీధర రావు పిల్లల కోసం సామాన్య సగటు కుటుంబీకుని మాదిరిగా స్పందించి అందించిన పుస్తక నేస్తం ఈ పాడే పక్షులు. పేరుకు ఇది అనువాదమే, అయితే ఇంతకు మించిన జీవనవేదం, అంతరాత్మ ఆవేదనం ఇందులో ఇమిడి ఉంది. తన వృక్ష శాస్త్ర అధ్యయన అనుభవాన్ని రంగరించుకుని, బాటనీ ప్రొఫెసర్‌గా తన అన్వేషణకు పదును పెడుతూ మనిషి జీవితానికి వయస్సు కాదు ప్రధానం సరికొత్తగా ఆలోచించి మననుమనను మరింత నిత్యనూతనంగా ఉంచుకోవాలనుకునే తత్వం ఆయనది. ఇది తొలి తెనుగు పత్రికలవారసత్వపు క్రమం సాధించుకున్న ఒద్దిరాజు సోదరుల వంశపారంపర్యపు ఆలోచనల క్రమం అయింది. పిల్లలకు పెద్దలు తరతరాల పాటు ఆదర్శంగా ఉండేలా ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకం కథగా సాగుతుంది.

కథనం బాగుంటుంది. పిల్లలకు ఇప్పటి నిత్య జీవిత పరివర్తన గమనంలో తల్లిదండ్రుల నుంచి చివరికి గురువుల నుంచి కూడా దక్కని సరైన మార్గదర్శకత్వం సరళమైన భాషలో సాక్షాత్కరిస్తుంది. ఓ పక్షికి పాడాలనే తపన తన పాట పదికాలాలు చెట్టుమీద వాడని పువ్వుగా రాలని పండుగా విలసిల్లాలనే తపన. ఇందులో తన స్వార్థం లేనేలేదు. పాటల్లోని తీపిని పది మందికి పంచాలనే తపన తప్ప. యోజనాల దూరం రెక్కలు వాల్చుకుంటూ పక్షి సాగుతుంది. లోయలు కొండలు కోనలు దాటుతుంది. ఎక్కడో ఓ చోట వేలాది మందిని కదిలించే పదికాలాల పాటు పదిలమైన రీతిలో ఉండే రాగం సమ్మిళిత పాటను తాను ఎందుకు సంతరించుకోలేననే తపన అంతకు మించిన ఆత్మవిశ్వాసం ఈ పక్షిలో జీవలక్షణంగా ఉంటుంది. ఈ తపించే తత్వం ఈ ప్రాణిని దూర ప్రాంతాలకు తీసుకువెళ్లుతుంది.

అక్కడ ఓ ముని కన్పిస్తాడు. పక్షి ఇంతదూరం వచ్చిన వైనాన్ని చెప్పడం వంటివి లేకుండానే పక్షి స్వరూపాన్ని బట్టి గ్రహిస్తాడు. ఇన్ని వేల మైళ్ల దూరం నువ్వు కష్టాలను భరించి వచ్చినందునే నీలోని పట్టుదల తెలుసుకోవచ్చు. అయితే ఓ అత్యద్భుతమైన పాటను రంగరించుకుని రెక్కల్లో కాదు గుండెల్లో దాచుకుని పదిమంది కోసంనీ కోసం వేచి ఉన్న వారికోసం తిరిగి వెళ్లాలనే సంకల్పబలంచాలా గొప్పది. దీనికి ప్రతిగా మంచి పాటను అందిస్తాను. అయితే ఓ ముళ్ల చెట్టు ఉంటుంది. దీనిపై కూర్చునిబాధలు పెట్టే వేల లక్షల ముళ్లను భరిస్తూ నవ్వుతూకూనిరాగాలు తీయి. అప్పుడు నీకు నువ్వే తాన్‌సేన్‌ను మించిన గాంధర్వగానవంతురాలివి అవుతావని ఈ ముని దీవించాడు. చెప్పిందే తడవుగా పక్షి తన మార్గం వెంబడి వెళ్లుతుంది. ముళ్ల చెట్టుపై వాలుతుంది.

శరీరమంతా చిద్రమవుతుంది. అయితే బాధను ఓర్చుకుంటూ , కష్టాన్ని ఆనందంగా మల్చుకుంటూ స్వరకల్పనకు రంగం సిద్ధం చేసుకునే క్రమంలో జీవనసత్యాల ఓ పాట ఈ పక్షి సొంతమవుతుంది. ముని ఆ పక్షికి నయం చేసి లోకకళ్యాణం చేయాలనే పక్షి ఆలోచనల వైపు పంపిస్తాడు.ఈ పుస్తకంలోని తొలి కథ పాడే పక్షులు ఆణిముత్యమే. పిల్లలకు టీచర్లల లాగా కాకుండా ఓ నేస్తంగా కష్టపడి పనిచేసే తత్వాన్ని పదిమందికి తాను సాధించుకునే ఫలాన్ని పంచాలనే తత్వాన్ని తెలియచేస్తుంది. ఇక మరో కథ తెలివైన రామచిలుకలో ఆలోచనలు లేకుండా అధికారం చలాయించే రాజు తత్వాన్ని బోధిస్తుంది. విచారణలు లేకుండా అనుకున్నదే తడవుగా మనిషిని శిక్షించే వారికి చెంపపెట్టుగా నిలుస్తుంది.

కథలోని క్రమంలోరాజు చివరికి రామచిలుకను చంపినందుకు చింతించి తన రాజరికంలో ఇకపై ఎక్కడా ఎప్పుడూ విచారణలు లేకుండా ఎవరిని శిక్షించరాదనే శాసనం తీసుకువస్తాడు. కథల్లో ఎక్కడా సుద్ధులు చెప్పకుండా కేవలం కథను చెప్పి. నిజాలు గ్రహించండి పిల్లలు అని సెలవు తీసుకుంటారు ఈ రచయిత. మరో విశేషం ఈ పుస్తక కథలు చదువుతూ ఉంటే మదిలో సన్నివేశాల చిత్రీకరణ సహజంగా జరిగిపోతూ ఉంటుంది. ఈ పుస్తకం ప్రాతిపదికన పిల్లలకు ఓ కారికేచర్ల లేదా దృశ్యభరిత వీడియోలు రూపొందించవచ్చు. పిల్లలకు సరైన పుస్తకనేస్తం లేని దశలో ఇది ఏడారిలో ఓయాసిస్సు. చీకటి చీల్చే ఉషస్సు…. సెల్‌ఫోనైతే కానేకాదు…
పుస్తకం : పాడే పక్షులు. రచయిత : ఒద్దిరాజు మురళీధర్ రావు, ప్రతులకు : పాలపిట్ట బుక్స్, హైదరాబాద్, 9848787284.

యర్రవల్లి జగన్మోహన రావు- 9848447631

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News