Sunday, December 22, 2024

రియాక్టర్ పేలి ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హత్నూర: సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలంలోని ఎస్ బి ఆర్గానిక్ రసాయన పరిశ్రమలో బుధవారం బాయిలర్ ఆయిల్ రియాక్టర్ పేలి సంస్థ డైరెక్టర్‌తో సహా ఆరుగురు మృతి చెందారు. మరో 30- మందికిపైగా కార్మికులు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. చందాపూర్ గ్రామ శివారులో గల ఎస్‌బి ఆర్గానిక్స్ రసాయన పరిశ్రమలో బాయిలర్ ఆయిల్ రియాక్టర్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటలు ఆగకపోవడంతో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పరిశ్రమ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. రియాక్టర్ పేలిన ఘటనలో సంస్థ డైరెక్టర్ రవివర్మ, ప్రొడక్షన్ ఇన్‌ఛార్జి సుబ్రమణ్యం, దయానంద్, మెయింటెనెన్స్ ఇన్‌ఛార్జి సురేష్ పాల్, చాకలి విష్ణుతోపాటు మరో కార్మికుడు మృతి చెందినట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో ఉన్న కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు.

నిర్జీవంగా పడిపోయిన కార్మికులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని అక్కడే పనిచేస్తున్న ఒక కార్మికుడు తెలిపారు. రియాక్టర్ పేలడంతో అక్కడికి అక్కడే డైరెక్టర్‌తో పాటు ఐదుగురు కార్మికులు మృతి చెందారని, తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా ఎస్‌పి రూపేష్ పరిశ్రమకు చేరుకొని పరిశీలించారు. ప్రమాదంలో గాయపడ్డ కార్మిక కుటుంబ సభ్యులు పరిశ్రమకు చేరుకోవడంతో వారిని ఆందోళన చెందవద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. డిఎస్‌పి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిఐ సుధీర్‌కుమార్, ఎస్‌ఐ సుభాష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

కాగా, పరిశ్రమలో ఐదుగురు కార్మికులు మృతి పట్ల అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి అగ్ని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు హాస్పటల్ కు తరలించామని, వారు కోలుకునేంతవరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎంఎల్‌ఎ సునీత లక్ష్మారెడ్డి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని కార్మిక కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. మెదక్ బిజెపి ఎంపి అభ్యర్థి రఘునందన్ రావు ప్రమాద స్థలానికి చేరుకొని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తీవ్ర గాయాల పాలైన కార్మికులను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. పరిశ్రమ నిర్లక్ష్యానికి కార్మికులు బలి అవుతున్నారని మండిపడ్డారు. మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

సహాయక చర్యలకు సిఎం ఆదేశాలు
ఎస్‌బి ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై సిఎం ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేసి, మంటలు అదువులోకి తీసుకురావాలని అగ్నిమాపక శాఖ అధికారులను సిఎం రేవంత్ ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని సిఎం రేవంత్ జిల్లా అధికారులకు సూచించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిఎం రేవంత్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
కెసిఆర్ దిగ్భ్రాంతి
సంగారెడ్డి జిల్లా పరిశ్రమలో పేలుడు వల్ల జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు కార్మికులు మరణించడం పట్ల బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందుతూ సంతాపం ప్రకటించారు. మరిణించిన వారి కుటుంబ సభ్యులకు కెసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

బాధితులను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హుటాహుటిన అక్కడికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఘటన జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని అన్నారు. అగ్నిప్రమాద ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News