ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు
ఇదద్రి పరిస్థితి విషమం
మదురై: తమిళనాడులోని శివకాశి వద్ద గురువారం ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విరుద్‌నగర్ జిల్లా శివకాశి సమీపంలోని కాళైయ్యర్‌కురుచ్చిలో ఉన్న ఓ ప్రైవేటు బాణసంచా తయారీ కేంద్రం ఫ్యాన్సీరకం టపాసులు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అక్కడ భారీ పేలుడు సంభవించడంతో తయారీ కేంద్రంలోని పది షెడ్లు నేలమట్టమయ్యాయి. పేలుడు ధాటికి అక్కడ పని చేస్తున్న ఆరుగురు కూలీలు మృతిచెందగా, మరో 14 మంది గాయపడ్డారు. శరీరాలు బాగా కాలిపోవడంతో మృతులను గుర్తించడం కష్టంగా మారింది. వరస పేలుళ్ల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది.
క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా శివకాశి పరిసరాల్లో గత రెండు వారాల్లో పేలుళ్లు జరగడం ఇది మూడోసారి.ఈ నెల 12న అచ్చంకుళంలోని ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో పేటుడు సంభవించి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో బాణసంచా పరిశ్రమల క్రమబద్ధీకరించడానికి తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం గురువారం మధ్యాహ్నం ఆదేశించడం గమనార్హం.