ఆసుపత్రి లోపలా, బయటా రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. నివారణ చర్యలు కాదు గదా, చికిత్స అందించడానికే తబ్బిబ్బులు పడుతున్నారు. ప్రపంచంలో చాలా దేశాలలో ఇదే పరిస్థితి వుంది. కరోనా పాండమిక్‌లో అనేక దేశాల ఆరోగ్య వ్యవస్థలోని డొల్లతనం వెల్లడి అయింది. నిరంతర ఆర్థిక ఇబ్బందులు, నిర్వహణ లోపాలు, అసమర్థత ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తల కొరత పెరుగుతున్నది. ఆరోగ్య సంరక్షణ సమస్యలను పరిష్కరించడంతో పాటు నిర్వహణను, పని తీరును మెరుగుపరిచే సాంకేతిక పరిజ్ఞానం కోసం ఆరోగ్య సంరక్షణ సంస్థలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. ఈ వెతుకులాటలో భాగంగా కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) అనేవి అభివృద్ధి చెందుతున్నాయి. ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధస్సు (ఎఐ)ను రోగ నిర్ధారణ నుండి చికిత్సా విధానాల ఎంపిక వరకు వివిధ మార్గాల్లో ఉపయోగించవచ్చు.
కృత్రిమ మేధస్సు సాధనాలు చురుకైన, తెలివైన, సూక్ష్మదృష్టితో పరిశీలిస్తాయి కనుక ఇవి మెరుగైన రోగ నిర్ధారణకు, కచ్చితమైన చికిత్స అనుసరించడానికి వైద్యులకు సహాయపడతాయి. దీర్ఘకాలిక రోగులలో తలెత్తే ప్రమాదాలను గుర్తించడానికి, వాటిని నివారించడానికి, నివారణ- సంరక్షణలో లోపాలను సవరించడానికి, పూరించడానికి సులువు అవుతుంది. జనాభాలో సామూహికంగాను, ఒక ప్రత్యేక వ్యక్తి క్లినికల్ పరిస్థితి, జన్యు పరమైన అంశాలు, ప్రవర్తన సంబంధితాలు, పర్యావరణ కారకాల మధ్య గల పరస్పర ప్రభావాన్ని, చర్య,- ప్రతి చర్యలను బాగాఅర్థం చేసుకోవడానికి ఆరోగ్య సంరక్షణ సంస్థల నుండి సేకరించిన డేటాను ఎఐ తో విశ్లేషించవచ్చు. రోగ నిర్ధారణ సమాచారం, పరీక్ష ఫలితాలు, నిర్మాణాత్మక కథన డేటాను ఉపయోగించడం ద్వారా రోగి ఆరోగ్యం, సమగ్ర చిత్రాన్ని పొందడం సాధ్యమవుతుంది. ఎఐ ఆధారిత సాధనాలు ఉపయోగించడం ద్వారా అనారోగ్య ప్రమాద కారకాలను ప్రారంభ దశలో గుర్తించడానికి సాధ్యమవుతుంది. ఈ పరిజ్ఞానంతో,
ఆరోగ్య సంరక్షణ సంస్థలు వనరుల వినియోగాన్ని సక్రమంగా, సముచితంగా కేటాయించి మరింత అనుకూలమైన, చికిత్సను అందించగలవు. ఫలితంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆరోగ్య సేవల స్థాయి పెరుగుతుంది. రోగులను మరింత త్వరగా గుర్తించడానికి, చికిత్స చేయడానికి, కృత్రిమ మేధస్సును కొన్ని ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలలో ఉపయోగించవచ్చు. దీని వల్ల వైద్య నిపుణులు వేగంగా స్పందించి మరింత మంది ప్రాణాలను కాపాడవచ్చు. సంప్రదాయ కార్యకలాపాలతో పోలిస్తే ఎఐ వ్యవస్థలు ప్రమాదాన్ని గుర్తించ గల వేగం, నేర్పు, ఖచ్చితత్వం అబ్బురపరుస్తాయి, రోగ నిర్ధారణను వేగవంతం చేయటమే కాదు రోగ నిర్ధారణ దోషాలను తగ్గించవచ్చు,.
అంతకు మించి కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం భారీ పరిమాణంలో క్లినికల్ డేటాను సమీకరించగలదు, జల్లెడ పట్టగలదు. రోగుల సమూహాల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులకు మరింత పూర్తి చిత్రాన్ని అందించగలదు. డేటా సేకరణ, విశ్లేషణను ఆటోమేట్ చేయడం ద్వారా మొత్తం ఆరోగ్య సంరక్షణ బృందం అత్యున్నత స్థాయి సామర్థ్యంతో పని చేయడం సాధ్యమవుతుంది. శస్త్ర చికిత్సకు కూడా రోబోటిక్స్ వినియోగించడం అత్యంత అత్యాధునిక ఎఐ ఉపయోగాలలో ఒకటి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ పరిపక్వత ఫలితంగా చిన్న కదలికలను కూడా స్వల్ప లోపం కూడా లేని కచ్చితత్వంతో పని చేసే శస్త్ర చికిత్సా పరికరాలు ఆవిర్భవించాయి. తత్ఫలితంగా, ప్రక్రియల కోసం నిరీక్షణ సమయం, ప్రమాదం జరిగే అవకాశం, అధిక రక్తస్రావం, శస్త్ర చికిత్స జరపటంలో కలిగే సమస్యలను, ఆపరేషన్ల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. అదనంగా శస్త్రచికిత్సా విధానాలను సులభతరం చేయడంలో మెషిన్ లెర్నింగ్ పాత్ర పోషిస్తుంది. సర్జన్లు, ఇతర వైద్య నిపుణులకు శస్త్ర చికిత్సలకు ముందు,
తరువాత సాధ్యమైనంత ఉత్తమ ఫలితాలను నిర్ధారించడానికి తోడ్పడుతుంది. అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం, ఉపయోగించడంలో ఆలస్యం చేయడం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒక ప్రధాన సమస్య. ఈ ప్రాంతాల్లో వైద్య నిపుణులు, సకల సౌకర్యాలున్న ఆస్పత్రుల కొరతతో వైద్య సేవలకు మరింత ఆటం కం కలుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లక్షణాల నిర్ధారణను వేగవంతంచేస్తుంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. తక్కువ వనరులు గల ప్రదేశాలలో వీటిని ప్రవేశపెడితే సిబ్బంది కొరతను అధిగమించడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, ఎక్స్-కిరణాలు, సిటి స్కాను, ఎంఆర్‌ఐ చిత్రాలు వంటి రోగనిర్ధారణ అధ్యయనాలను విశ్లేషించడానికి ఎంఎల్‌ను ఉపయోగించడం వేగవంతమైన రోగ నిర్ధారణకు వీలు కల్పిస్తుంది. విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు, సహచరులకు శిక్షణను మెరుగుపరచడానికి విద్యా సంస్థలకు ఈ సాధనాలు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. నేటి ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో అనేక పరస్పర ఆధారిత వ్యవస్థలు, ప్రక్రియలు ఉన్నాయి.
వీటిని అందించడంలో రోగి నిరీక్షణ సమయాన్ని, ఖర్చునీ సమతుల్యం చేయడం చాలా సవాలుగా ఉన్నది.ఈ పనులను ఆటోమేట్ చేయడం ద్వారా వనరుల లభ్యత ఆధారంగా సేవలకు ప్రాధాన్యత ఇవ్వడం, సౌకర్యాలను సమర్థవంతంగా ఉపయోగించడం జరుగుతుంది.ఈ మధ్య ప్రజలు చాట్ జిపిటి గురించి ప్రతి చోటా మాట్లాడుతున్నారు.అనేక రంగాలలో దాన్ని ఉపయోగించటానికి ప్రయత్నిస్తు న్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) నుండి ఉద్భవించిన భాషా నమూనాల సాధనాలు (ఎల్‌ఎల్‌ఎంలు) రోజురోజుకూ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు ప్రాబల్యం పెరుగుతున్నది. పరిశోధన స్థాయిలోనేకాక వినియోగ స్థాయిలో కూడా విస్తరిస్తున్నది. అయితే, ఆరోగ్య సంబంధమైన ప్రయోజనాల కోసం ఈ టెక్నాలజీని ఉపయోగించేటప్పుడు, జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) మే 16, -2023న జారీ చేసిన హెచ్చరికలో పేర్కొంది. కృత్రిమ మేధస్సును సురక్షితమైన, ప్రభావవంతమైన, నీతివంతమైన మార్గాల్లో ఉపయోగిస్తున్నారని నిర్ధారించడానికి కఠినమైన పర్యవేక్షణ అవసరం అని తేల్చి చెప్పింది.
ఆరోగ్య నిపుణులు, రోగులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలకు మద్ద తు ఇవ్వడానికి ఎల్‌ఎల్‌ఎంలతో సహా సాంకేతిక పరిజ్ఞానాన్ని తగిన విధంగా ఉపయోగించడం గురించి డబ్ల్యుహెచ్‌ఒ ఉత్సాహంగా ఉన్నప్పటికీ, ఏదైనా కొత్త సాంకేతికత విషయంలో సాధారణంగా తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా ఎల్‌ఎల్‌ఎంల విషయంలో సవ్యంగా పాటించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ‘పరీక్షించబడని విధానాలను త్వరపడి స్వీకరించడమని చెప్పిం ది. ఇది ‘ఆరోగ్య కార్యకర్తలు తప్పులు చేయడానికి దారి తీస్తుంది, రోగులకు హాని కలిగిస్తుంది, అసలు కృత్రిమ మేధపై నమ్మకాన్నే వమ్ము చేస్తుంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి సాంకేతికతలను ఉపయోగించటానికి ఆలస్యం అవుతుంది. అది దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది. డబ్యుహెచ్‌ఒ, ఎఐ గురించి అనేక అంశాలలో ఆందోళన వెలిబుచ్చింది. మొదటిది ఎఐకి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే డేటాను గురించి, డేటా పక్షపాతంగా ఉండవచ్చు.
ఆరోగ్యం, సమానత్వం సమ్మిళితత్వాలకి నష్టం కలిగించే, తప్పుదోవపట్టించే లేదా సరైనది కాని సమాచారాన్ని సృష్టించవచ్చు. ‘రెండోది ఎల్‌ఎల్‌ఎంలకు ప్రతిస్పందనల గురించి. ‘తుది వినియోగదారుకు అవి అధికారికమైనవి, నమ్మదగినవి అని అనిపించినప్పటికీ, అవి ‘పూర్తిగా తప్పు కావచ్చు లేదా తీవ్రమైన దోషాలను కలిగి ఉండవచ్చు’. ఎఐ సాధనాల ద్వారా వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడం వ్యక్తుల గోప్యత, సమ్మతి గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఎందుకంటే ‘అటువంటి ఉపయోగం కోసం గతంలో సమ్మతించని డేటాపై కూడా ఎల్‌ఎల్ ఎమ్‌లకు శిక్షణ ఇవ్వవచ్చు. ఒక వినియోగదారు అందించే సున్నితమైన డేటాను (ఆరోగ్య డేటాతో సహా) ఎల్‌ఎల్‌ఎమ్‌లు సంరక్షించలేకపోవచ్చు.‘ఎల్‌ఎల్‌ఎంలు ‘టెక్ట్ ఆడియో లేదా వీడియో కంటెంట్ రూపంలో అత్యంత నమ్మదగినదనిపించే తప్పుడు సమాచారాన్ని సృష్టించడానికి, వ్యాప్తి చేయడానికి, దుర్వినియోగం చేయబడే అవకాశం చాలావుంది. నిజంగా విశ్వసనీయమైన సమాచారం నుండి ఈ కల్పిత సమాచారాన్ని విడగొట్టి చూడటం ప్రజలకు కష్టం.
మే 16 హెచ్చరికలో ఆరోగ్య సంస్థ మరో ముఖ్యమైన విషయాన్ని ఎత్తి చూపింది. సాంకేతిక సంస్థలు- ఎల్‌ఎల్‌ఎంలను వాణిజ్యీకరించడానికి పని చేస్తాయి. కనుక విధానకర్తలు రోగి భద్రత, రక్షణలకు ప్రాధాన్యత నిచ్చే విధానాలు నిర్ధారించాలని డబ్ల్యుహెచ్‌ఒ సిఫార్సు చేసింది. ఈ హెచ్చరిక విడుదల కావడానికి చాలా ముందు, ఈ సాధనాలు ప్రజాదరణ పొందడానికి సంవత్సరం ముందు, ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ హెల్త్: డబ్ల్యుహెచ్‌ఒ గైడెన్స్ ప్రచురించబడింది. ఈ 2021 నివేదిక కృత్రిమ మేధ అనియంత్రిత ఉపయోగానికి సంబంధించిన ప్రమాదాలను ఎత్తిచూపింది. -రోగుల, సమాజాల హక్కులు ఆసక్తులకూ;
సాంకేతిక సంస్థల శక్తివంతమైన వాణిజ్య ప్రయోజనాలకూ మధ్య ఏర్పడే వైరుధ్యం; నిఘా, సామాజిక నియంత్రణలో ప్రభుత్వాల ప్రయోజనాలకు లోబడి వుండే ప్రమాదాలు వస్తాయని హెచ్చరించింది. ఆరోగ్య సంరక్షణ నిపుణులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించారు. ఎందుకంటే ఇది క్లినికల్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొత్త సాంకేతికతలను ఉపయోగించడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉందని నిర్ధారిస్తుంది. గత ఆరు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన యూజర్ ఫ్రెండ్లీ, ఇంట్యూటివ్ ఎఐ ప్లాట్ఫామ్ల సంఖ్యను పరిశీలిస్తే, ఈ సాధనాలను క్లినికల్ ప్రాక్టీస్ లో చేర్చే మార్గాల గురించి చాలా మంది మాట్లాడటంలో ఆశ్చ ర్యం లేదు. ఏ సాంకేతికతనయినా లాభాపేక్షతో వ్యాపారాత్మకంగా వాడితే హానికరం, అదే మానవీయతతో, మానవాళి ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని వాడితే అది కళ్యాణ దాయకం.