కీవ్ : ఎట్టకేలకు ఉక్రెయిన్ నుంచి సముద్ర మార్గం ద్వారా ఆహార ధాన్యాల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఆహార ధాన్యాల ఎగుమతుల పునః ప్రారంభానికి ఇటీవల కుదిరిన ఒప్పందం మేరకు మొదటి రవాణానౌక సోమవారం ఒడెస్సా నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. తుర్కియే రక్షణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. రజోని ఓడ ఒడెస్సా నౌకాశ్రయం నుంచి లెబనాన్ లోని ట్రిపోలీకి బయలుదేరింది. ఇది ఆగస్టు 2 నాటికి ఇస్తాంబుల్‌కు చేరుకుంటుంది. ఇక్కడ తనిఖీల అనంతరం తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని తెలిపింది. ఈ నౌకలో 26 వేల టన్నుల మొక్కజొన్న రవాణా చేస్తున్నట్టు ఉక్రెయిన్ మౌలిక సదుపాయాల మంత్రి ఒలెక్సాండర్ కుబ్రకోవ్ తెలిపారు. సైనిక చర్య పేరిట ఉక్రెయిన్‌పై దాడులకు దిగిన రష్యా ఫిబ్రవరి నుంచి అక్కడి ఓడరేవులను దిగ్బంధించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లకు లక్షలాది టన్నుల ఆహార ధాన్యాల ఎగుమతులు నిల్చిపోయాయి. ఈ నేపథ్యంలో గత నెల 22న ఆహార ధాన్యాలు , ఎరువుల ఎగుమతుల పునః ప్రారంభానికి రష్యా ఉక్రెయిన్లు, ఐరాస, తుర్కియేలతో వేర్వేరుగా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రెండు దేశాల నుంచి ఎగుమతుల పర్యవేక్షణకు ఇస్తాంబుల్ కేంద్రంగా ఉమ్మడి సమన్వయ కేంద్రం ఏర్పాటు చేశారు. తాజాగా ఉక్రెయిన్ నుంచి మొదటి నౌక బయలుదేరింది.