ఆప్‌కు ఎన్‌సిపి సూచన
న్యూఢిల్లీ: ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో బిజెపి నాయకులు చేసిన బేరసారాలకు సంబంధించిన సాక్ష్యాలను విడుదల చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బిజెపి చేసిన కుట్రలను బట్టబయలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీకిఇ శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సిపి కోరింది. తాను గనక బిజెపిలో చేరితే తనపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరించడంతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా చేస్తామంటూ బిజెపిఇ తనతో బేరసారాలు ఆడిందంటూ సిసోడియా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఎన్‌సిపి ప్రతినిధి క్లైడ్ క్రాస్టో మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ బిజెపి అటువంటి ప్రయత్నాలు చేసింది నిజమైతే.. అది దేశంలో ప్రజాస్వామ్యానికి పెనుముప్పని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో కూడా ఎమ్మెల్యేలకు ఇటువంటి తాయిలాలే ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని, పర్యవసానంగా మహారాష్ట్ర వికాస్ అఘాడి ప్రభుత్వం పతనమైందని ఆయన చెప్పారు. సిసోడియాతో బిజెపి నేతలు జరిపిన బేరసారాలపై రికార్డింగులు ఉన్నాయని ఆప్ చెబుతోందని, మరి ఆలస్యం చేయకుండా వాటిని విడుదల చేసి బిజెపి నిజస్వరూపాన్ని బట్టబయలు చేయాలని ఆయన కోరారు.