ఆశించిన స్థాయిలో కనిపించని
స్పందన గడువు పొడిగింపు
దిశగా సర్కార్ యోచన 2,3
రోజుల్లో అధికారిక ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అ నధికార లే అవుట్‌లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కు ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రా యితీ గడువు సోమవారంతో ముగిసింది. అ యితే ప్లాట్ల యాజమానుల నుంచి ఆశించిన స్థాయి స్పందన రాకపోవడంతో ఎల్‌ఆర్‌ఎస్ గడువును పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై రెండు మూడు రోజు ల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్)లో భాగంగా సర్కారు 25 శాతం రాయితీతో కూడిన
వన్‌టైమ్ సెటిల్‌మెంట్(ఒటిఎస్) ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ వద్ద ఉన్న దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం మొత్తం 20,00,493 మందికి ఫీజు చెల్లించాలంటూ డిమాండు నోటీసును జారీ చేసింది. అంటే వీరంతా రాయితీ పోను మిగతా ఫీజును చెల్లించి తమ స్థలాలు క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. అయితే శనివారం సాయంత్రం వరకు దాదాపు 4 లక్షల మంది మాత్రమే ఫీజును చెల్లించారు. చివరి రోజైన సోమవారం మరో లక్ష మంది వరకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించినట్లు సమాచారం. అయినప్పటికీ ఇంకా 15 లక్షల దరఖాస్తులు మిగిలిపోతాయి.
వాస్తవానికి మార్చి మొదటి వారంలోనే ఒటిఎస్‌ను(వన్‌టైమ్ సెటిల్‌మెంట్) అందుబాటులోకి తెచ్చినప్పటికీ మొదట్లో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లింపునకు పలు ఆటంకాలు ఎదురుకావడం, ఒక్కోసారి పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో పాటు ఫీజు చెల్లింపులో కూడా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తరువాత అధికారులు క్రమంగా ఒక్కో సమస్యను పరిష్కరించారు. గత 7 రోజులుగా అంతా సాఫీగా సాగుతోంది. అందుకే ఇప్పటి వరకు పూర్తయిన ఫీజు చెల్లింపుల్లో సగం గత వారం రోజుల్లోనే జరిగాయి. ఆదివారం ఉగాది పర్వదినం కాగా సోమవారం రంజాన్ పర్వదినం. అయితే సెలవు రోజులైనప్పటికీ ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, పండగ రోజుల్లో డబ్బులు సర్దుబాటు చేసుకోవడం కష్టమని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరో నెల రోజులైనా ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ గడువు పొడిగించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.