న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్‌ల పదవీకాలాన్ని ఐదేళ్లకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారణకు చేపట్టింది. ఈ పిటిషన్లపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) నేతృత్వం లోని ధర్మాసనం తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ చీఫ్‌ల పదవీకాలాన్ని ఐదేళ్లకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నవంబరు 15ప ఆర్డినెన్సు జారీ చేసింది. ఈ ఆర్డినెన్సు ద్వారా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టులను సవరించింది. సీబీఐ , ఈడీ చీఫ్‌ల నియామకాల నిబంధనలను సవరించింది. ఈడీ డైరెక్టర్ నియామకం, పదవీకాలాలకు వర్తించే సీవీసీ చట్టం లోని సెక్షన్ 25 ను సవరించింది. కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జీవాలా, టీఎంసీ నేతలు మహువా మొయిత్రా , సాకేత్ గోఖలే తదితరులు ఈ ఆర్డినెన్సును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.