మంథని: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, మానేరు నదులు ఉదృతంగా ప్రవహిస్తూ మంథనికి వరద ముంపు పొంచి ఉండటంతో మున్సిపల్ చైర్మెన్ పుట్ట శైలజ అప్రమత్తంగా వ్యవహరించారు. గురువారం ప్రాజెఉక్ట ద్వారా నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతుందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో మున్సిపల్ చైర్మెన్ పుట్ట శైలజ తనదైన శైలిలో పట్టణంలోని ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ధైర్యం చెప్పారు.
ఎల్లంపల్లి, సుందిల్ల బ్యారేజీలతోపాటు మానేరు డ్యాం నుండి భారీగా నీరు విడుదల చేశారు. గురువారం రాత్రి వరకు మంథని గోదావరినదిలోకి ఈరు చేరి వరదలు వచ్చే అవకాశం ఉందనే సమాచారంతో ప్రజలను అప్రమత్తం చేయడంలో మంథని ఆడబిడ్డగా పుట్ట శైలజ ఆలుపెరగకుండా ఆరాటపడ్డారు. ఉదయం నుంచే ఆయా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు అర్థరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు కంటి మీద కునుకు లేకుండా పర్యటించారు.
ప్రజలను పునరావాస కేంద్రాలకు స్వయంగా దగ్గరుండి తరలించారు. అంతేకాకుండా అనుక్షణం గోదావరి నది, బొక్కల వాగు వరద ఉదృతిని తెలుసుకోవడంతోపాటు స్వయంగా వెళ్లి పరిశీలించారు. మహిళా ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా అర్థరాత్రి సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని, ముంపు ప్రాంతాల్లోని పేద ప్రజలు ఇబ్బందులకు గురి కావద్దని గొప్పగా ఆలోచన చేసిన మున్సిపల్ చైర్మెన్ పుట్ట శైలజను పలువురు అభినందిస్తున్నారు.
అలాగే పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాల యోగక్షేమాలను తెలుసుకుంటూనే ఉదయం తానే స్వయంగా టీ, టిఫిన్‌లు తీసుకెళ్లి అందజేశారు. ఒక రాజకీయ నాయకురాలిగా కాకుండా ప్రజల మనిషిగా వ్యవహరించిన తీరు అందరిని అబ్బురపరిచింది. ముంపు ప్రమాదం లేదని నిర్దారించుకున్న తర్వాత మున్సిపల్ చైర్మెన్ ఊపిరి పీల్చుకున్నారు.