Saturday, November 16, 2024

విరివిగా మొబైల్ యాప్‌ల వినియోగం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : సమస్త ప్రపంచాన్ని అరచేతిలో చూపే మొబైల్ సాంకేతికతను ఎన్నికల సంఘం సమర్ధవంతంగా వినియోగించుకుంటోంది. సాంకేతిక మొబైల్ యాప్‌లను రాష్ట్ర ఎన్నికల సంఘం దేశంలోనే తొలిసారిగా విప్లవాత్మకంగా వినియోగంలోకి తెచ్చింది. సాంకేతికలను వినియోగించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఓటింగ్ శాతం పెరుగుదల, పారదర్శక ఎన్నికలు, ఓటర్లకు సులువైన మార్గాలతో ఇసి అనేక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఓటర్ ఫ్రెండ్లీగా ఉంటూనే దివ్యాంగులు మొదలు, మహిళలు, సాఫ్టవేర్ నిపుణులను ఓటింగ్ వైపు మొగ్గు చూపేలా చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం చేసేలా యోచిస్తోంది. గతంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను ఫిర్యాదు చేయాలంటే అక్షరాస్యులకు కూడా అనేక సమస్యలెదురయ్యేవి. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక మిన్నకుండిపోవడంతో ఉల్లంఘనలకు అడ్డులేకుండా పోయే పరిస్థితులు తెలిసిందే. ఇప్పుడు వీటికి సి- విజిల్ యాప్‌తో ఎన్నికల సంఘం చెక్ పెట్టింది.
యాప్‌లో అనుమతులు,ఫిర్యాదులు..
కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు రాష్ట్ర శాసనసభా ఎన్నికల్లో మొబైల్ యాప్ల వినియోగం అధికారికంగా పెరిగింది. పారదర్శక, ప్రశాంత ఎన్నికలను సజావుగా నిర్వహించే లక్ష్యంతో ఓటర్లు, సిబ్బంది, దివ్యాంగులు, ఇసి తన సేవలను యాప్‌ల ద్వారా అందిస్తోంది. వీటన్నింటినీ ప్లే స్టోర్ లేదా యాప్స్, లేదా ఇసిఐ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రజలు, ఓటర్లు, రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేసేందుకు సమాధాన్ యాప్ ఉపయోగపడుతుంది. ఫోటోలు, వీడియోలు ఆధారంగా పంపొచ్చు. తర్వాత అధికారులు తీసుకున్న చర్యల కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సువిధ యాప్ ద్వారా సభలు, సమావేశాలు, ర్యాలీలకు అభ్యర్ధులు, రాజకీయ పార్టీలు ఈ యాప్ ద్వారా అనుమతులు కోరవచ్చు. వాహనాలు, లౌడ్ స్పీకర్లు, పార్టీ కార్యాలయాలు, హెలీకాఫ్టర్ల వినియోగం, తదితర అంశాలకు సరైన పత్రాలిచ్చి ఆన్లైన్లో ఏకీకృత అనుమతులు పొందొచ్చు. తనకొచ్చిన 24 గంటల్లోగా ఇసి పరిష్కారం చూపుతుంది. ఎలక్టోరల్ సెర్చ్ ద్వారా ఓటరు జాబితాలో ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. తమ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాన్ని, మ్యాప్ రూట్‌ను తెలుసుకునే వెసులుబాటుంది. ఎన్నికల నిర్వహణలో వినియోగించే ప్రైవేటు వాహన వ్యవహారాలు పర్యవేక్షణకు సుగమ్ యాప్ కీలకంగా పనిచేస్తోంది. వాహన యజమానులు, డ్రైవర్లు, వారికి చెల్లింపుల వివరాలు ఇందులో ప్రత్యక్షమవుతాయి.
ఐదు రాష్ట్రాల్లో అమలు..
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల సంఘం యాప్ సాంకేతికతను ఉపయోగిస్తూ అధికారుల కోసం ఈ-ఎస్‌ఎంఎస్, పౌరుల కోసం సి- విజిల్ యాప్లను ప్రవేశపెట్టింది. ఈ ఎస్‌ఎంఎస్ అంటే ఎలక్షన్స్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్ ద్వారా తనిఖీలలో దొరికే నగదు, మద్యం,డ్రగ్స్, బహుమతులను ఎప్పటికప్పుడు ఆయా సంస్థలకు అప్పగించడానికి డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి, ఐటి శాఖను సకాలంలో అప్రమత్తం చేయడానికి వినియోగిస్తారు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనేటువంటి అధికారులందరూ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని, ఎప్పటికప్పుడు వివరాలను ఈ యాప్ లో పొందుపరచాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో దొరికిన నగదు, మద్యం, డ్రగ్స్ వంటి వివరాలను సరైన సమయంలో నమోదు చేయలేకపోవడం వల్ల కొంత దుర్వినియోగం జరిగినట్టు కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ- ఎస్‌ఎంఎస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘించినా కూడా ఆ ఘటనలను ఈ యాప్ ద్వారా తెలియజేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News