బ్రిస్టల్ యూనివర్శిటీ పరిశోధకుల హెచ్చరిక
బ్రిస్టల్ (అమెరికా) : అమెరికా లోని యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్ కు చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచం లోని అత్యంత అసాధారణ ఉష్ణతరంగాలను కనుగొన్నారు. కొన్ని ఇదివరకే ఎవరి దృష్టికి రాకుండా పోయాయి. గత ఏడాది ఉత్తర అమెరికాలో ఉష్ణతరంగం 121.3 డిగ్రీల ఫారన్ హీట్‌తో చెలరేగింది. అయితే అది ఇప్పటివరకు వెలుగు లోకి వచ్చిన అత్యంత అసాధారణ ఉష్ణతరంగాల్లో ఆరోదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత ఏడాది జూన్ 29 న బ్రిటిష్ కొలంబియా లోని లిట్టన్‌లోఈ ఉష్ణతరంగాన్ని గమనించారు. వాతావరణ పరిస్థితులు మరింత అధ్వాన్నమైతే ఉష్ణతరంగాలు మరింత వేడెక్కి వ్యాపిస్తాయని హెచ్చరించారు. ఇప్పటివరకు అత్యంత ఉష్ణతరంగాల వ్యాప్తి గురించి అధ్యయనం చేయగా 1998 ఏప్రిల్‌లో ఆగ్నేయాసియా, 1985 నవంబర్‌లో దక్షిణ బ్రెజిల్, 1980 జులైలో దక్షిణ అమెరికాలో, 2016 జనవరిలో పెరు నైరుతి ప్రాంతంలో, 2019 జులైలో అలస్కాలో, 2021 జూన్‌లో ఉత్తర అమెరికాలో అత్యధిక ఉష్ణతరంగాలు వ్యాపించాయి. ఈ ఏడాది మొదట్లో వాతావరణ కేంద్రం అత్యధిక ఉష్ణతరంగాల నమూనాలను రూపొందించి ఎనిమిది దేశాల్లో సమీక్షించింది.
ప్రస్తుత వాతావరణానికి తగినట్టు వాటి ఆ నమూనాల స్థాయిలను పెంచింది. ఇటీవల కెనడా, అమెరికా దేశాల్లో ఉష్ణతరంగా ప్రపంచాన్నే కలవర పరిచిందని బ్రిస్టల్ యూనివర్శిటీకి చెందిన వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ విక్కీ థాంప్సన్ వివరించారు. గత కొన్ని దశాబ్దాల్లో కొన్ని విపరీతాలు సంభవించాయని తమకు తెలుసని పేర్కొన్నారు. వాతావరణ నమూనాలను ఉపయోగించి సమీక్షించగా, రానున్న శతాబ్దంలో అత్యంత అసాధారణ ఉష్ణతరంగాలు మరింత గరిష్ఠస్థాయిలో వేడెక్కుతాయని తెలుస్తోందని చెప్పారు. 2021 లో ఉత్తర అమెరికాలో సంభవించిన అసాధారణ ఉష్ణతరంగ ప్రభావంతో కెనడాలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఉదహరించారు.అడవుల్లో కార్చిచ్చులకు ఇవి దోహదం చేస్తాయని, మౌలిక సౌకర్యాలు విధ్వసం అయి పంటలు దెబ్బతింటాయని హెచ్చరించారు. స్థానికంగా ఉష్ణోగ్రతల స్థాయిలో ఈ అసాధారణ ఉష్ణోగ్రతల స్థాయిని పోల్చి సమీక్షించ వలసిన అవసరం ఉందని, దీనికి మానవులతోపాటు ప్రకృతి పర్యావరణం కూడా భరించవలసి ఉంటుందని సూచించారు.