హైదరాబాద్ : రెజ్లర్ల పైన లైంగిక వేధింపులకు పాల్పడిన ఆలిండియా రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బిజెపి ఎంపి బిజ్ భూషణ్ సింగ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం డిమాండ్ చేశారు. రెజ్లర్లకు మద్దతుగా ఈ నెల 15న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతామని ఆయన వెల్లడించారు. రేజ్లర్లు మే 28వ తేదీన ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనం ముందు నిరనస తెలుపగా కేంద్రం అత్యంత పాశవికంగా వారిపై దాడి, లాఠీ ఛార్జిలు చేయించిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ నిర్బంధ కాండను నిరసిస్తూ జేఏసి ఆధ్వర్యంలో తాము ఈ నెల 15న నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఓయూ విద్యార్థి సంఘం నాయకులు డాక్టర్ సంజీవ్ నాయక్, వేములవాడ ప్రధాన అర్చకులు సురేష్ శర్మ, పూసల సంఘం నేత కోలా శ్రీనివాస్, గుంటి మంజులాదేవి, మేరు కులాల అధ్యక్షులు వాడపల్లి మాధవరావుతో కలిసి గజ్జల కాంతం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బిజ్ భూషణ్ సింగ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.