Sunday, April 20, 2025

ఎందుకు ప్రారంభించారు, ఎందుకు ఆపివేశారు…?

- Advertisement -
- Advertisement -

‘మంత్రులతో ముఖాముఖీ’ని ఆపివేయడంపై కాంగ్రెస్ శ్రేణుల అభ్యంతరం
ఈ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించాలని
పిసిసి అధ్యక్షుడికి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజల విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్: గాంధీభవన్‌లో గతంలో నిర్వహించిన ‘మంత్రులతో ముఖాముఖీ’ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించాలని కాంగ్రెస్ శ్రేణులు విజ్ఞప్తి చేస్తున్నాయి. కొన్ని వారాలుగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. దీంతో తమ సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల పథకం, పింఛన్‌లు, పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాము ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని అధికారులు పట్టించుకోవడం లేదని వారు పిసిసి అధ్యక్షుడి దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలిసింది. గతంలో ‘మంత్రులతో ముఖాముఖీ’ కార్యక్రమాన్ని గాంధీభవన్‌లో నిర్వహించినప్పుడు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా భారీ సంఖ్యలో పాల్గొనేవారు. వారు సచివాలయం లోపలికి వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌లు అవసరం కావడంతో గాంధీభవన్‌లో నిర్వహించిన ‘మంత్రులతో ముఖాముఖీ’ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరయ్యే వారు. ప్రస్తుతం ఆర్ధంతరంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు.

కాంగ్రెస్ శ్రేణుల ఆశ్చర్యం

అసలు మంత్రుల షెడ్యూల్లో మార్పులు ఎందుకు వచ్చాయి? మళ్లీ గాంధీభవన్‌కు మంత్రుల వస్తారా? లేదా అన్న దానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజా పాలనలో ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలకు దగ్గర కావాలి, ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో వారానికి ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌లో అందుబాటులో ఉండేలా కాంగ్రెస్ పార్టీ ‘మంత్రులతో ముఖాముఖీ’ షెడ్యూల్‌ను రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా సిఎంకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఇలా ఈ కార్యక్రమం కొన్ని వారాల పాటు విజయవంతంగా కొనసాగినా అర్ధంతరంగా ప్రస్తుతం నిలిచిపోవడంపై కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

వారంలో ప్రతి బుధవారం, శుక్రవారం

వారంలో ప్రతి బుధవారం, శుక్రవారం గాంధీభవన్‌లో మంత్రులు అందుబాటులో ఉండేలా పిసిసి ఛీఫ్ ఈ షెడ్యూల్ ఖరారు చేశారు. దానికి తగ్గట్టుగానే ఆరంభంలో కొన్ని వారాలు (వారానికి) ఇద్దరు చొప్పున మంత్రులు వచ్చారు. వారు ప్రజల సమస్యలను విన్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించారు. దీంతోపాటు సంబంధిత అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఇలా కొన్ని వారాల పాటు విజయవంతంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మొదట్లో వారానికి ఇద్దరు మంత్రులు వచ్చేవారు. ఆ తర్వాత వారానికి ఒకే మంత్రి వచ్చారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని అర్ధంతరంగా ఆపివేశారు. మంత్రులు వచ్చినప్పుడు గాంధీభవన్‌కు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకొని తమ ఇబ్బందులు చెప్పుకునేవారు. మంత్రులు సైతం వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవడంతో గాంధీభవన్‌కు వెళితే సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది.ఈ నమ్మకం ప్రస్తుతం కోల్పోయామని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పేర్కొంటున్నారు.

మంత్రుల సిబ్బంది తమను కలవనీయకుండా….

తీరా చూస్తే కొన్ని వారాల నుంచి మంత్రులు గాంధీభవన్‌కు రావడం లేదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెడితే కొద్ది కాలంగా మంత్రులు గాంధీభవన్‌కు రాకపోవడంపై ప్రజలు కూడా అటు వైపు రావడం మానేస్తున్నారు. ఇక సమస్యలు చెప్పుకుందామని సచివాలయానికి వెళితే తమ శాఖల పనుల మీద మంత్రులు బిజీగా ఉంటున్నారని, సచివాలయంల లోపలికి వెళ్లడం కూడా కష్టంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. కొన్ని సందర్భాల్లో మంత్రులు ఉన్నా మంత్రుల సిబ్బంది తమను కలవనీయకుండా అడ్డుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చొరవ తీసుకొని రెగ్యులర్‌గా ఈ కార్యక్రమం జరిగేలా చూడాలని ప్రజలు, కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News