మయన్మార్ : ఫిబ్రవరి 1న మయన్మార్ సైన్యం తిరుగుబాటు చేసి ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసిన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి సూకీసహా పలువురు రాజకీయ నేతలు నిర్బంధంలో కొనసాగుతున్నారు. మయన్మార్ లో కొనసాగుతున్న హింసాత్మక పరిస్థితులపై ఫేస్ బుక్ తీవ్రంగా స్పందించింది. మాండలే నగరంలో శనివారం జరిగిన పౌర నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఆ దేశ మిలిటరీకి సంబంధించిన అధికారిక పేజీని ఫేస్బుక్ తొలగించింది. హింసాత్మక విధానాలతో తమ సంస్థ నిబంధనలను మిలిటరీ పదేపదే ఉల్లంఘిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ సంస్థ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించగా, 40 మంది గాయాల పాలయ్యారు. మా అంతర్జాతీయ విధానాలకు మేం కట్టుబడి ఉన్నాం. హింసను ప్రేరేపిస్తూ మా కమ్యూనిటీ ప్రమాణాలను పదేపదే ఉల్లంఘిస్తున్నందున.. టాట్మడా ట్రూ న్యూస్ ఇన్ఫర్మేషన్ టీం అనే పేరుతో ఉన్న మిలిటరీ పేజీని ఫేస్ బుక్ నుంచి తొలగిస్తున్నాం అని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు.