అరెస్టు చేసిన బెంగాల్ పోలీసు బలగాలు
కొల్‌కతా : పశ్చిమ బెంగాల్ పోలీసు బృందాలు ఆదివారం సందేశ్‌ఖలీకి వెళ్లుతున్న నిజనిర్థారణ బృందం సభ్యులను అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టు అయిన వారిలో మాజీ ఉన్నతాధికారులు , ఓ మాజీ న్యాయమూర్తి ఉన్నారు. కొందరు స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు కూడా బృందంలో పాలుపంచుకుంటున్నారు. పోలీసులు సందేశ్‌ఖళీ నిజాలను దాచిపెడుతున్నారని ఈ నిజనిర్థారణ బృందం ఆరోపించింది. నిజాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు తాము అక్కడికి బయలుదేరామని వివరించారు.
అధికార టిఎంసికి చెందిన ఓ పలుకబడి గల వ్యక్తి ఆ ప్రాంతంలో అనేక రకాలుగా అరాచకాలకు , భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, లైంగిక అత్యాచారాలకు దిగుతున్నాడనే విషయంపై ఇక్కడ భారీ స్థాయిలో నిరసనలు వెలువడుతున్నాయి. తమను పోలీసులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నందుకు నిరసనగా ఈ నిజనిర్థారణ బృందం ఆరుబయట కూర్చుని ధర్నా సాగించారు. ఈ బృందంలో పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్ నరసింహ, మాజీ ఐపిఎస్ రాజ్‌పాల్ సింగ్ , జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యులు ఛారూవలీ ఖన్నా , న్యాయవాది భావనా బజాజ్ ఇతరులు ఉన్నారు.