Wednesday, January 22, 2025

వంతెన ఫ్లోరింగ్ మార్చారు… తీగలు వదిలేశారు

- Advertisement -
- Advertisement -

 

Facts behind the Morbi bridge collapse incident

మోర్బీ వంతెన కూలిన దుర్ఘటన వెనుక వాస్తవాలు

మోర్బీ : గుజరాత్ లోని మోర్బీ నగరంలో తీగల వంతెన కూలిన దుర్ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. అనుభవం లేని కంపెనీకి ఈ తీగల వంతెన మరమ్మతుల పనులు అప్పగించడం … అధికారులు నిర్లక్షంగా వ్యవహరించడంతో ఈ పెను విషాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఆ పనిలో కనీస అర్హత లేదని తాజాగా ప్రాసిక్యూషన్ మోర్బీ కోర్టుకు తెలిపింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరపాలంటూ దాఖలైన పిటిషన్లపై మోర్బీ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ వాదిస్తూ “ మరమ్మతుల సమయంలో వంతెన ఫ్లోరింగ్‌ను మార్చారు. కానీ తీగలను మార్చకుండా వదిలేశారు. కొత్తగా వేసిన ఫ్లోరింగ్‌ను నాలుగు లేయర్ల అల్యూమినియం షీట్లతో చేశారు.

దీంతో పాత తీగలు ఈ బరువు మోయలేక తెగిపోయాయని ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తెలిసింది. ఇక ఈ మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఈ పనుల్లో ఎలాంటి అర్హత పత్రాలు లేవు. అయినప్పటికీ 2007 లో వీరికే కాంట్రాక్టు అప్పజెప్పారు. మళ్లీ 2022 లోనూ వీరినే పిలిపించి మరమ్మతులు చేయించారు. దీనివెనుక కారణాలు తెలుసుకోవాల్సి ఉంది” అని ప్రాసిక్యూటర్ హెచ్‌ఎస్ పంచాల్ కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో అరెస్టయిన 9 మంది నిందితుల్లో నలుగురిని పోలీస్ కస్టడీకి అప్పగించింది. వీరిలో ఒరెవా సంస్థకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారు. మిగతా ఐదుగురికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

పైపై మెరుగులే చేసి…

ఇక ఈ వంతెన నిర్వహణకు శాశ్వత కాంట్రాక్టు కావాలని ఒరెవా గ్రూప్ గతంలో అధికారులను డిమాండ్ చేసింది. అందుకు వారు అంగీకరించక పోవడంతో అప్పటివరకు తాత్కాలిక మరమ్మతులు చేసి వంతెనను తెరుస్తామని గతంలో ఓసారి ఆ సంస్థ మోర్బీ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసిందట. అందుకు సంబంధించిన లేఖ ఒకటి తాజాగా బయటికొచ్చింది. శాశ్వత కాంట్రాక్టు ఇవ్వనంతవరకు వంతెనకు తాత్కాలిక మరమ్మతు పనులు చేసి బ్రిడ్జిని తెరుస్తాం. అప్పటివరకు ఎలాంటి మెటీరియల్‌ను కూడా ఆర్డర్ చేయబోం. మా డిమాండ్లు నెరవేరితేనే వంతెన పనులను పూర్తి చేస్తాం. దీనిపై పునరాలోచన చేయండి ’ అని 2020లో ఒరెవా గ్రూప్ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత 2022లో ఒరెవా కంపెనీ , మోర్బీ మున్సిపల్ కార్పొరేషన్ మధ్య వంతెన నిర్వహణకు ఒప్పందం జరిగింది. 15 ఏళ్ల పాటుఅంటే 2037 వరకు ఈ బ్రిడ్జి నిర్వహణ బాధ్యతలను అధికారులు ఆ కంపెనీకి అప్పగించారు. అయితే ఈ మరమ్మతు పనులను కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేసి హడావుడిగా వంతెనను ప్రారంభించినట్టు తెలుస్తోంది. అధికారుల నుంచి ఎలాంటి సేఫ్టీ సర్టిఫికేట్లు తీసుకోకుండానే దీపావళి సయయంలో వంతెనను తిరిగి తెరిచారు. ఆ తర్వాత నాలుగు రోజులకే ఘోర విషాదం చోటు చేసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News