Monday, January 20, 2025

మళ్లీ తెరపైకి గ్యాంగ్‌స్టర్ నయీం కేసు

- Advertisement -
- Advertisement -

మళ్లీ తెరపైకి గ్యాంగ్ స్టర్ నయీం కేసు రానుంది. నయీం కేసును రీ-ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధ మవుతున్నట్లు సమాచారం. నయీం డైరీలోని అంశాల ద్వారా నిజానిజాలను వెలికితీసే అవకాశం ఉంది. ఎనిమిదేండ్ల క్రితం (2016లో) జరిగిన ఎన్‌కౌంటర్, దానికి కొనసాగింపుగా జరిగిన దర్యాప్తు వివరాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కేసు రీ ఇన్విస్టిగేషన్ ద్వారా స్వాధీనమైన సొమ్ము ఎంత? అప్పటి అధికార పార్టీ నేతలకు ఏమైనా చేరిందా? నయీంతో సంబంధాలున్న పోలీస్ ఆఫీసర్లు ఎవరు? పొలిటీషి యన్లతో ఉన్న లింకులేంటి? ఇలాంటి అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో కొద్దిమంది పోలీసు అధికారులు, బిఆర్‌ఎస్ నేతల్లో గుబులు పట్టుకున్నది. అచ్చంపేట ఎంఎల్‌ఎ డాక్టర్ వంశీకృష్ణ ఇటీవల ఈ అంశాన్ని ప్రస్తావించారు. సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని అసెంబ్లీ వేదికగానే ప్రభుత్వానికి రిక్వెస్టు చేస్తానని వెల్లడించారు. దీంతో ఎనిమిదేండ్లుగా సైలెంట్‌గా ఉన్న ఈ కేసులో రానున్న రోజుల్లో కదలిక తప్పదనే సంకేతం వెలువడినట్లయింది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు బిఆర్‌ఎస్ నేతలకు నయీంతో లోపాయికారి సంబంధాలు ఉండేవని, వందల ఎకరాల భూములు వీరి అజమాయిషీలో ఉన్నాయని, బినామీల పేర్లతో వీరి స్వాధీనంలోకి వచ్చాయన్నది బహిరంగ రహస్యం.

నయీం ఎన్‌కౌం టర్ తర్వాత దర్యాప్తు కోసం అప్పటి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినా కొన్ని కారణాలు, ఒత్తిడి మేరకు ఆశించిన స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరి ఒత్తిడి ఉన్నది? దానికి కారణాలేంటి? అప్పటి అధికార పార్టీకి ఉండే ప్రయోజనాలేంటి? ఏయే లీడర్లకు ఎలాంటి సంబధాలున్నాయి? ఇవన్నీ ఆసక్తికర అంశాలు.నయీం నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలోని అంశాలను ఇప్పుడు పరిశీలిస్తే లోతైన ఆధారాలు దొరుకుతాయన్నది పోలీసుల అభిప్రాయంగా ఉంది. అప్పట్లో దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు ఇప్పటివరకూ వివరాలను బహిర్గతం చేయలేదు. రాష్ట్రం మొత్తం మీద దాదాపు 200 కేసులు నయీంకు వ్యతిరేకంగా నమోద య్యాయి. సుమారు 125 మందిని పోలీసులు అప్పట్లో అరెస్టు చేశారు. నయీంతో సంబంధాలున్నాయని, సెటిల్‌మెంట్ల పేరుతో భూములు ఆక్రమించారన్నది ప్రధాన ఆరోపణ. పోలీసులు సుమారు రూ. 100 కోట్ల మేర ఆస్తుల్ని సీజ్ చేసినట్లు అప్పట్లో చెప్పినా, దానికి చాలా ఎక్కువ మొత్తంలోనే దొరికిందని, అది లెక్కల్లోకి రాకుండా పోయిందని, ఎవరి చేతుల్లోకి వెళ్లాయోననే అనుమానాలు దీర్ఘకాలంగా ఉన్నాయి.

బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఈ కేసు విషయాన్ని ప్రస్తావించడానికి ఎవరూ సాహసం చేయలేకపోయారు. నయీంకు సంబంధించిన కేసుల్లో 18 చార్జిషీట్లు కోర్టుల్లో దాఖలయ్యాయి. దాదాపు 800 మందికిపైగా సాక్షులను పోలీసులు విచారించారు. ఇందులో వంద మందికి పైగా కస్టడీలోకి తీసుకుని ప్రశ్నలవర్షం కురిపించి వివరాలను పోలీసులు రాబట్టారు. నయీంతో ప్రత్యక్షంగా సంబంధాలున్న 18 మందిని అప్పట్లోనే అరెస్టు చేసి, పిడియాక్టు కింద కేసులు నమోదు చేశారు. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత కొన్ని వారాల పాటు పోలీసు దర్యాప్తులో హడావిడి కనిపించినా, ఆ తర్వాత చడీ చప్పుడు లేకుండా సైలెంట్ కావడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ కేసు గురించి ఓపెన్‌గా మాట్లాడుకోడాని కి కూడా చాలా మందికి ధైర్యం చాలలేదు. అటు పోలీసులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడానికి నిరాకరించారు. అప్పటి ప్రభుత్వం ఈ కేసు వివరాలు తెలిసిన కొద్దిమంది పోలీసుల్ని లూప్‌లైన్‌లోకి నెట్టేసింది. నయీంకు పోలీసు ఆఫీసర్లతోపాటు అప్పటి ప్రభుత్వం నుంచి ఉన్న అండదండలతో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని భువనగిరి జిల్లాల్లో తనదైన సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్నారు.

దందాలు చేయడం, సెటిల్‌మెంట్ల పేరుతో భూముల ఆక్రమణ, పేదలను బెదిరించడం, ఇలాంటి అనేక అరాచకాలకు పాల్పడ్డాడు. ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీలోని అంశాలు బయటకు పొక్కలేదు. నయీం నుంచి స్వాధీనం చేసుకున్న వందల కోట్ల రూపాయల ఆస్తులు, భూముల పత్రాలు ఏమై పోయాయో మిస్టరీగానే ఉండిపోయింది. నయీంకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అనేక పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఎన్‌కౌంటర్ తర్వాత ఆయనతో సంబంధాలున్న అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు.ఇప్పుడు హఠాత్తుగా అచ్చంపేట ఎమ్మెల్యే నయీం కేసు రీ-ఇన్వెస్టిగేషన్ డిమాండ్‌ను తెరపైకి తేవడంతో ప్రభుత్వం ఈ దిశగా రానున్న రోజుల్లో అడుగులు వేయనున్న దనే సంకేతం వెలువడినట్లయింది. అచ్చంపేట మాజీ ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజుకు నయీంతో సంబంధాలున్నాయని, ఈ వ్యవహారం బహి ర్గతం కావాలంటే ఆ కేసును ప్రభుత్వం మరోసారి దర్యాప్తు చేయడం అవసరమని డాక్టర్ వంశీకృష్ణ ఇటీవల మీడియాతో వ్యాఖ్యానించారు. నయీం కేసును తిరిగి దర్యాప్తు చేయడం ద్వారా బిఆర్‌ఎస్ నేతలకు ఎలాంటి సంబంధాలున్నాయన్నది తేటతెల్లమవుతుందని, అందువల్లనే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతానని నొక్కిచెప్పారు. త్వరలోనే సిఎం రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తానని, పోలీసు దర్యాప్తుకు ఆదేశించి పూర్తి వివరాలను వెలికి తీయాలని కోరుతానని డాక్టర్ వంశీకృష్ణ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News