Saturday, November 23, 2024

గాంధీని చంపుతూనే ఉన్నారు

- Advertisement -
- Advertisement -

గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు? గుజరాత్ సంఘ్ విద్యా సంస్థ ‘సుఫలం శాల వికాస్ సంకుల్’ 12.10.19న 9వ తరగతి పరీక్షల్లో ప్రశ్న. గాంధీది హత్య కాదని సంఘ్ ఉవాచ. గాంధీ చావు తప్పుడు ప్రచారమే ఈ ప్రశ్న అంతరార్థమని గాంధేయవాది ధీమంత్ బధియా వాపోయారు. పెరిగిన సారా అమ్మకాల అక్రమ వ్యాపారులతో ఇబ్బందుల గురించి పోలీసు అధికారికి జాబు రాయమని 12వ తరగతి పరీక్ష ప్రశ్న. గుజరాత్ ఎన్నికల్లో సారా పారిందని చదివాం. సారా అమ్మకాలు పెరిగాయని, అక్రమ సారా వ్యాపారులు ప్రజలను ఇబ్బందిపెడుతున్నారని ఈ ప్రశ్న ధ్రువీకరిస్తోంది. ప్రశ్నాపత్రంలో మా పాత్ర లేదని విద్యాధికారి భరత్ వధేర్ అన్నారు. గుజరాత్ విద్యా వ్యవస్థ సంఘ్ అధీనమని, కార్పొరేట్ల బానిసని దీనర్థం. గాంధీ జన్మభూమిలో సారాపారకం గాంధీని మరోమారు చంపుతోంది. ముందు జాతీయవాదం తెలుసుకున్నాను. తర్వాత చరిత్ర అర్థం, అవగాహన నేర్చుకున్నాను. మీన్ కాంఫ్ (నా పోరాటం) స్వీయ కథలో హిట్లర్. మోడీ మొదటిదే నేర్చుకున్నారు. తన ఆధిక్యత స్థిరీకరణలో ఎదురుదెబ్బ తిన్నప్పుడు హిట్లర్ చరిత్రనే మార్చాడు. నవతరాన్ని తన వైపు తిప్పుకున్నాడు.

నిన్న గుజరాత్‌లో జరిగిందీ, కొనసాగుతున్నదీ, నేడు మొత్తం దేశంలో వ్యాపిస్తున్నది ఇదే. 25 ఏండ్ల క్రితమే మోడీ గుజరాత్‌లో గాంధీ ఆదర్శాల భూస్థాపిత కుట్ర మొదలైంది. గాంధీని చంపిన నథూరాం గోద్సేను సంఘ్ తప్పుబట్టలేదు. గుజరాత్‌లో గోద్సేకు గుడి కట్టారు. ఇది నాటి ముఖ్యమంత్రి మోడీ దృష్టికి రాలేదు! సావర్కర్, గోద్సేలను భారత రత్నతో సత్కరించగలరు. హిందు తాత్వికుడు, స్వదేశీ పరిమిత జ్ఞాని పటేల్‌ను కాకుండా నాస్తికుడు, సామ్యవాది, దార్శనికుడు, విశ్వవిజ్ఞాన ప్రజ్ఞాశాలి నెహ్రూను ప్రధానిగా ప్రతిపాదించారని గాంధీపైసంఘ్‌కి కోపం. పటేల్‌ను కాక తనను ప్రధానిగా ప్రకటించమని నెహ్రూ గాంధీని వత్తిడి చేశారు. సున్నిత మనస్క మహాత్ముడు బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. నెహ్రూయే గాంధీ హంతకుడు అని మోడీ, షా డప్పుకొట్టగలరు. పాఠ్యాంశాల్లో చేర్చగలరు. 30 జనవరి, 19 గాంధీ వర్ధంతి నాడు సంఘ్ స్త్రీలు గాంధీ బొమ్మపై గుండ్లు పేల్చారు. ఇది ప్రతి ఏడాది గాంధీ వర్ధంతి వేడుకని ప్రకటించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయబడింది. మోడీ, షాలతో సహా ఎవరూ దాన్ని వ్యతిరేకించ లేదు.

మోడీ,-షా స్ఫూర్తితో ఈ ప్రక్రియ పెరిగింది. గోద్సేను దేశభక్తుడని కీర్తించిన సాధ్వి ప్రజ్ఞ సంఘ్ పార్లమెంటు సభ్యురాలు. ఏ దేశం కోసం జీవితాన్ని అర్పించారో ఆ దేశవాసుల చేతిలో గాంధీ హత్య నాటి నమ్మలేని నిజం. నేటి పాలకుల అసూయ ద్వేషాలతో గాంధీ చరిత్ర మారటం, ఆత్మహత్య గుణహీనతకు గురికావటం ఊహించని వాస్తవాలు. గాంధీ నిరాడంబరత, సత్యవాక్కు నీతి నిజాయితీలు, మానవత్వం మరువరానివి. గాంధీ జీవితంతో ప్రపంచ నాయకులు స్ఫూర్తి పొందారు. గాంధీని చంపిన సంఘ్ ఆయన వారసత్వానికి తూట్లు పొడిచింది. గాంధీని చరిత్ర నుండి తొలగించటం, ఆ మహత్తర వ్యక్తిత్వానికి మసిపూయటం భవిష్య భారతానికి చేటు.మహాత్ముని మరణ వాస్తవాలు చరిత్రలో ఉన్నాయి. ‘38 ఏళ్ళ నథురాం వినాయక్ గోద్సే 30-01 48 సాయంత్రం 5- 12కు మూడడుగుల దూరం నుండి గాంధీ గుండెలో, కడుపులో 3 గుండ్లు పేల్చాడు. మహాత్ముడు మరణించాడు. ‘31-01 -48న ప్రపంచ పత్రికల వార్త. గోద్సే హిందు మహాసభ మరాఠీ దినపత్రిక ‘హిందురాష్ట్ర’ సంపాదకుడు. హిందు జాతీయవాద సంస్థలు సంఘ్, హిందు మహాసభల్లో క్రియాశీలక పాత్రధారి.

సంఘ్ కల్పించిన విషపూరిత వాతావరణంతోనే ఇంతటి భయంకర, విషాద హత్య సాధ్యపడిందని తీర్మానించి నాటి గృహ మంత్రి వల్లభ్ పటేల్ సంఘ్‌ను నిషేధించారు. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టడానికి బిజెపి పటేల్‌ను నెత్తికెత్తుకుంది. గాంధీ హత్యకు వెళుతున్నప్పుడు విజయులై తిరిగిరండని ఆప్టే, గోద్సేలను సావర్కర్ దీవించారని హిందు మహాసభ సభ్యుడు, గాంధీ హత్యాపథక భాగస్వామి దిగంబర్ బడ్గె కోర్టులో చెప్పారు. హత్యకు ముందు ఆప్టే, గోద్సేలు సావర్కర్‌ను పలుమార్లు సంప్రదించి, సలహాలు తీసుకున్నారని న్యాయమూర్తి జీవన్ లాల్ కపూర్ నిర్ధారించారు. ప్రజాస్వామ్య పద్ధతులను గాఢంగా విశ్వసించే గాంధీ అభిప్రాయ భేదాల పరిష్కరణకు గోద్సేను చాలా సార్లు చర్చలకు పిలిచారు. గోద్సే రాలేదు. పారదర్శక, ప్రజాస్వామ్య పద్ధతులను నమ్మని గోద్సే, తాము వ్యతిరేకించే వారిని చంపే ఫాసిస్టు విధానాలనే పాటించాడు. రాజ్యాంగ అధికరణ 19 (2) భావప్రకటన దురుపయోగాన్ని నిషేధించింది. కానీ ‘మీ నథురాం గోద్సే బోల్తోయ్ (గోద్సేను మాట్లాడుతున్నాను)’ నాటకకర్త ప్రదీప్ దాల్వి, హిందుత్వ తీవ్రవాదులు, తమను అంగీకరించని వారిపై హింసాద్వేష ప్రచారం, వారి హత్య, ప్రత్యర్థి హత్య మత త్యాగమని చాటుకునే హక్కులు కావాలని వాదించారు.

నేడు ఇవే జరుగుతున్నాయి. గాంధీ హంతకులు గాంధీకి భావజాల శత్రువులు. సంఘ్ వీరి మెదళ్ళలో విషం నింపింది. గాంధీ దేశానికి నష్టమని, దేశభక్త గోద్సే అర్జునుని వలె గాంధీని చంపాడని సంఘ్ అభిప్రాయం. గాంధీని జాతి పిత అనరాదని హిందు మతమే జాతీయతని 1961లో సావర్కర్ ఉద్బోధించారు. వాహ్ శరణార్థ శిబిరంలో సంఘ్ సేవల ప్రస్తావనకు స్పందిస్తూ, గాంధీ, నియంతలు హిట్లర్, ముసోలినీల నాజీలు, ఫాసిస్టులు ఇదే చేశారన్నారు. సంఘ్ మతోన్మాద, నియంతృత్వ సంస్థ అన్నారు. దశాబ్దాల మేధోవక్రీకరణ ఫలితమే గాంధీ హత్య. 1934లో మొదలైన గాంధీ వ్యతిరేకత 6 హత్యా యత్నాలతో 30-01-1948న గోద్సే గాంధీని చంపడానికి దారి తీసింది. ఖాది గ్రామోద్యోగ సంస్థ, 2017 క్యాలెండర్, డైరీలపై గాంధీకి బదులు మోడీని ముద్రించారు. గాంధీ జయంతిని ‘స్వచ్ఛ భారత్ దివస్’ చేశారు. ఆ రోజును చెత్తతో నింపారు. గాంధీ వ్యతిరేకి, గాంధీ హంతకునికి గుడి కట్టిన సంఘ్ చనిపోయిన గాంధీపై కూడా ప్రతీకారం తీర్చుకుంటోంది. నియంతలు గత కాలపు ఘనతలను రూపుమాపి వాటి స్థానంలో కొత్త గుర్తులను ప్రతిష్టిస్తారు. చరిత్రను తమకు అనుకూలంగా పునర్లిఖిస్తారు. వర్తమానాన్ని తమ తాత్విక ప్రచారానికి, పాలన తోడ్పాటుకు వాడుకుంటారు.

ఇందుకు నాజీ నియంత హిట్లర్ పాలన, ఆయన రుద్దిన స్వస్తిక్ గుర్తు ఉదాహరణలు. మోడీయం నాజీయిజాన్ని మించిపోతున్నది. మందబుద్ధి వందిమాగద మిత్రులు క్షుద్ర శత్రువులతో సమానమని ఆంగ్ల కవి, నవలా రచయిత నికొలాస్ బ్రెటన్ వ్యాఖ్య. నోట్లపై గాంధీ బొమ్మను తీసేయాలని హిందు మహాసభ మీరట్ అధ్యక్షుడు భరత్ రాజ్పూతో కోరాడు. ‘గాంధీ పేరు ఖాదీ అమ్మకాలను తగ్గించింది. గాంధీని తీసి మోడీని పెట్టడం మంచిదయింది. గాంధీ బొమ్మతో రూపాయి విలువ తగ్గింది. గాంధీని మించిన గుర్తింపు మోడీ పొందారు. ‘హర్యానా బిజెపి మంత్రి అనిల్ విజ్ సమర్థించారు. తాను ఇందిర, నెహ్రూలను మించినవాన్నని, గాంధీని తలదన్నే జాతిపితనని మోడీ నమ్మకం. పాకిస్తాన్ మత భావాలతో మరణించింది. భారత్‌కూ ఆగతే పట్టబోతోంది. పాకిస్తాన్ ప్రముఖ పాత్రికేయుడు ఖలేద్ అహ్మద్ రాశారు. గాంధీ నుండి నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ ప్రేరణ పొందారు. విశ్వమంతా గాంధీని చదివి, అనుసరించి లబ్ధి పొందింది. విశ్వకవి రవీంద్రుడు మహాత్మా అన్న మహానేత గాంధీ. ఆ మహాత్ముని ఘన వారసత్వాన్ని ఆచరించటమే ఆ మహా మనిషికి అసలైన నివాళి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News