Monday, December 23, 2024

అసెంబ్లీలోనే బండారం బయటపెడతాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : నల్లగొండ జిల్లా ప్రజలకు కెసిఆర్, హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి తీరని ద్రోహం చేశారని, నల్లగొండ జిల్లా ప్రజలకు కెసిఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయ న నల్లగొండ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. సిఎం రేవంత్ రెడ్డిపై కెసిఆర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అంటూనే ‘కెసిఆర్ నీవు అసెంబ్లీకి రా… అసెంబ్లీ వేదికగా నీవు చేసిన మోసాలు బయటపెట్టి, నీ సంగతేంటో తేలుస్తాం’ అని సవాల్ విసిరారు.

కెసిఆర్ హయాంలో మాజీ సిఎస్ సోమేశ్‌కుమార్ 5 వేల ఎకరాలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. కెసిఆర్, ఆయన తొత్తులు కలిసి అక్రమంగా సంపాదించిన సొమ్మంతా అణా పైసాతో సహా కక్కించడం ఖాయమన్నారు. జిల్లాలో రెండు వేల కోట్లు ఇస్తే పూర్తయ్యే ప్రాజెక్టులకు కూడా పదేండ్లు ఒక్క రూపాయి ఇవ్వకుండా పక్కకి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశంలో 811 టిఎంసిల కృష్ణా నీటిలో తెలంగాణకు 299 టిఎంసిలు.. ఆంధ్రప్రదేశ్ వాటా 512 టిఎంసిల చొప్పున పంచుకోవాలని 2015 జూన్ 18, 19 తేదీలలో జరిగిన సమావేశంలో ఒప్పందంపై సంతకం పెట్టిన విషయం వాస్తవం కాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కెసిఆర్ కుటుంబం లిక్కర్ కేసులు మాఫీ చేయించుకోవడం కోసం నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల ప్రయోజనాల్ని ఫణంగా పెట్టారని అయన మండిపడ్డారు.

కెసిఆర్ అనే వ్యక్తి 2 లక్షల మందితో నల్లగొండ లో సభపెట్టి కృష్ణా నది నీళ్ల గురించి మాట్లాడతానని అనడం హాస్యాస్పదమన్నారు. కృష్ణా ప్రాజెక్టు నీళ్ల కోసం తెలంగాణ రైతుల్ని ఆంధ్రా పోలీస్‌లు కొడుతుంటే.. జగన్‌ను ఇంటికి పిలిచి హైదరాబాద్ బిర్యానీ తినిపించి పంపించిన దుర్మార్గుడు కెసిఆర్ అని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టులన్నీ జగన్ మనుషులకే ఆయన ఇచ్చారని తీవ్రంగా ఆరోపించారు. కెసిఆర్, జగన్ ఇద్దరు కలిసి కుమ్మక్కై తెలంగాణను నిండా ముంచారని విమర్శించారు.

కెసిఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం గురివింద గింజ సామెత చందంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి అప్పగించారని చెప్పడానికి కెసిఆర్ కు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2015లో తెలంగాణ అధికారులు కృష్ణా నీటి పంపకాల ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టిన పేపర్లు స్పష్టంగా కనిపిస్తుంటే… కెసిఆర్ సిఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కూడా పూర్తి కాలేదని అంటూనే.. దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకుండా ఎడారిగా మార్చింది నిజం కాదా అని అంటూనే ఉత్తర తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులన్నింటిలో నాణ్యతకు తిలోదకాలిచ్చి కమీషన్లు దండుకొని, నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిర్మాణ దశలోనే కూలిపోతున్న మాట వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు ఇప్పటికే నెర్రెలు బారాయని.. రేపో మాపో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.

కెసిఆర్ చేసిన తప్పులన్నీ ప్రక్కకి పెట్టి నల్లగొండకు వచ్చి మీటింగ్ పెట్టి ఏం చేస్తావని ఆయన ఎద్దేవా చేశారు. చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా రెండు వేల మెజార్టీతో గెలిచిన సూర్యాపేట ఎంఎల్‌ఎ జగదీశ్‌రెడ్డి.. సిఎం రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతుండు అంటూనే తాను పదవి చేపట్టిన రెండు నెలల్లోనే ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ పనులకు 1500 కోట్ల రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయించానని తెలిపారు. ఎఎంఆర్ మెయిన్ కెనాల్ పనుల కోసం 525 కోట్ల రూపాయల ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపించామని అన్నారు. ఇతర కాలువల పనుల కోసం మరో 500 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి వెల్లడించారు. డిండి ప్రాజెక్టు కోసం జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తాను కలిసి నిరంతరం పని చేస్తున్నామని అయన చెప్పారు. జిల్లాలో ఒక్కటి మినహా అన్ని నియోజకవర్గాల్లో యాభై వేల పైచిలుకు మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా ఇంకా బిఆర్‌ఎస్ నాయకులకు సిగ్గు రాలేదని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో నల్లగొండ ప్రజలు రెండింటికి రెండు పార్లమెంట్ స్థానాల్లో బిఆర్‌ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కకుండా చేయడం ఖాయమన్నారు. కృష్ణా నది నీటి వాటా గురించి బిఆర్‌ఎస్ నాయకుల మోసాలు ఆధారాలతో సహా సుస్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఇంకా బుకాయించడం ఏంటని అంటూనే కేసుల నుంచి బయట పడేందుకు కెసిఆర్ తెలంగాణ ప్రజల నీటి హక్కులని ఫణంగా పెట్టారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News