Wednesday, January 22, 2025

మసకబారుతున్న మోడీ ప్రతిష్ఠ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నిత్యావసర వస్తువుల ఎగుమతి, దిగుమతులకు సంబంధించి కేంద్రం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు అభివృద్ధికి అనుకూలుడిగా ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ఇమేజిపై ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి ముఖ్యమైన అంశాలపై ప్రధాని సొంతంగా తమ వైఖరిని మార్చుకున్నారా, లేక మార్చుకోవలసిందిగా అధికారులు ఆయనపై ఒత్తిడి తెచ్చారా అనేది తెలియదు కానీ తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వ విధానం దిశలో మార్పు వచ్చిందనే విషయాన్ని మాత్రం కచ్చితంగా సూచిస్తోంది.

ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధిని సాధించడానికి వీలుగా నరేంద్ర మోడీ 2014లో ప్రధాని పదవిని చేపట్టినప్పటినుంచి ఆర్థిక రంగంలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పారదర్శకత లేకపోవడం,1970, 80 దశకాల నాటి లైసెన్స్ పర్మిట్‌రాజ్‌లను ఆయన విమర్శించారు కూడా. అప్పట్లో మనం ఒక ఫోన్ కనెక్షన్ లేదా గ్యాస్ కనెక్షన్ పొందాలన్నా, ఓ టూవీలర్ కొనాలన్నా ఏళ్ల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఆ రోజుల్లో విదేశీ కారు కలిగి ఉండడమనేది ఓ పగటి కలగానే ఉండేది.

సోషలిజం లక్షాలను సాధించడానికి లేదా స్థానిక పరిశ్రమలను, వ్యాపారాలను కాపాడాలనే పేరుతో ఇదంతా చేశారు. అయితే పివి నరసింహారావు హయాంలో 1991లో తీసుకువచ్చిన సరళీకరణ విధానాలు దేశానికి ప్రజలకు ఎంతో మేలు చేశాయి. బిజెపి ఆర్థిక సిద్ధాంతం స్వేచ్ఛా మార్కెట్లు, బహిరంగ వాణిజ్య విధానాలకు వ్యతిరేకం. నరేంద్ర మోడీ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు కనిపించారు. అయితే బాగా పాతుకు పోయిన రెడ్ టేపిజం తాను ఇంకా బతికే ఉన్నానని చెప్పడానికి అప్పుడప్పుడు తన తలను ఎగరేస్తూనే ఉంది.

అనాలోచిత నిర్ణయాలు
బాస్మతేతర బియ్యం ఎగుమతుల నిషేధం, అలాగే ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులను పరిమితం చేస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు దిగ్భ్రాంతికి మించి వాణిజ్య, పరిశ్రమల రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దేశంలో ఆహార ధరలను అదుపులో ఉంచాలనే పేరుతో బియ్యం ఎగుమతులను నిషేధించారు. ఇక ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై పరిమితులు విధించడానికి ప్రధానంగా వ్యవస్థల భద్రత, దేశీయ వస్తువులను ప్రోత్సహించడం, ఈ రంగంలో పెద్దన్నగా ఉన్న చైనాతో వాణిజ్య అసమ తుల్యతను తగ్గించడం అనే మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ముందుగా బియ్యం ఎగుమతి విషయాన్ని చూద్దాం.

గత కొన్నేళ్లుగా భారత్ పెద్ద మొత్తంలో ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తోంది. దానికి అనేక కారణాలున్నాయి. ఈ అధిక ఉత్పత్తిని సాధించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి. దీంతో మన వ్యాపారులు దాదాపుగా 60 దేశాలకు సుమారుగా 4550 మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతి చేయడం ప్రారంభించారు. ఈ ఎగుమతులు వ్యాపారులకే కాకుండా రైతులకు కూడా మంచిఆదాయాన్ని తెచ్చి పెట్టాయి. అయితే హటాత్తుగా బియ్యం ఎగుమతులను నిషేధించడం ఈ రంగానికి మంచి రాబడులు రాకుండా చేయడమే కాకుండా నమ్మకమైన సరఫరాదారుగా భారత్ పట్ల ఇప్పటివరకు బియ్యాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసింది. మాజీ ఐఎఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్ లాంటి ప్రభుత్వ మద్దతుదారులు సైతం ఈ నిషేధం పట్ల తమ నిరసనను తెలియజేశారు. దేశంలోని ప్రభుత్వ గోడౌన్లలో నిర్దేశిత 1.50 కోట్ల టన్నులకు మించి దాదాపు 2.59 కోట్ల టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ నిషేధం ఏ విధంగా చూసినా సమర్థనీయం కాదు.

ఇక ల్యాప్‌టాప్‌లు, వ్యక్తిగత కంప్యూటర్లు, ట్యాబ్‌లపై ఆంక్షల విషయం చూద్దాం. ఈ పరికరాలు మన జీవితంలో భాగమైనాయనే విషయం మనందరికీ తెలుసు. విద్యార్థులనుంచి ఉద్యోగుల వరకు, వ్యాపారులనుంచి రైతుల దాకా అందరికీ ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు అత్యంత అవసరం. వీటిని దిగుమతి చేసుకోవడానికి లైసెన్సులు తీసుకోవాలని ఈ కంపెనీలను హటాత్తుగా ఆదేశించడం వల్ల ఈ సరఫరాలపై కచ్చితంగా ప్రభావం చూపించడంతో పాటుగా వాటి ధరలు కూడా పెరుగుతాయి. దేశ ఆర్థిక పురోగతి సైతం దెబ్బతింటుంది. పరిశ్రమతో కానీ, పార్లమెంటులో కానీ సరయిన చర్చ లేకుండా హటాత్తుగా ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో మనకు తెలియదు. ఈ ప్రభుత్వంలోని కొన్ని వర్గాలు తమ విధానాలకన్నా కూడా ఎదుటి వారి ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయేమోననిపిస్తుంది.

మరో వైపు ఈ నిర్ణయాలకు సంబంధించి ప్రభుత్వ వర్గాలనుంచి సరయిన వివరణ కూడా లేదు. 2016లో వెయ్యి, రూ.500 నోట్ల రద్దు, ఇప్పుడు రూ.2 వేల నోట్లను వాళ్లు ఎందుకు రద్దు చేశారో మనం ఇప్పటికీ గుర్తించలేం. ఒక్కటి మాత్రం సుస్పష్టం. మార్పులు కోరుకునే వ్యక్తిగా, ఈజ్ ఆఫ్ డూయింగ్‌కు కట్టుబడిన వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోడీకున్న ఇమేజి మాత్రం ప్రమాదంలో పడింది. జనాల్లో ఆయనకున్న ఇమేజీకి తగ్గట్టుగా ఈ నిర్ణయాలు మాత్రం లేవు. ప్రభుత్వంపై భారతీయ, విదేశీ మీడియాలు నెగెటివ్ కథనాలను ప్రచురించాయి. ప్రభుత్వం గురించి జనం కూడా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. ఈ ఆంక్షలు మంచి ఉద్దేశంతో తీసుకున్నామని కేంద్ర ఐటి శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అంత బాగా లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News