ముంబయి: మరాఠా కోటా ఉద్యమ నేత మనోజ్ జరాంగే ఆదివారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు ఫడ్నవీస్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన జరాంగే తాను ముంబయికి పాదయాత్ర చేసి, ఆయన నివాసం వెలుపల నిరసన వ్యక్తం చేస్తానని ప్రకటించారు. జల్నాలోని అంతర్‌వాలి సరటిలో గంట పైగా చేసిన ప్రసంగం చివర్లో జరాంగే ఈ ప్రకటన చేశారు. ఫడ్నవీస్‌పై జరాంగే పలు ఆరోపణలు చేయడం ఆయన మద్దతుదారులకు విస్మయం కలిగించింది. జరాంగే ప్రకటనలపై ఆ తరువాత ప్రశ్నించినప్పుడు ‘ఆయన ఏమి మాట్లాడారో నేను వినలేదు’ అని మాత్రమే సమాధానం ఇచ్చారు.
‘కొందరు వ్యక్తులను మభ్యపెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేసేలా ఒత్తిడి చేస్తున్నారు. ఈ కుట్రల వెనుక ఫడ్నవీస్ ఉన్నారు. నన్ను చంపాలని ఆయన కోరుకుంటున్నారు. సాగర్ బంగళా (ముంబయి మలబార్ హిల్‌లో ఫడ్నవీస్ అధికార నివాసం)కు నేరుగా పాదయాత్ర చేసేందుకు నేను సిద్ధం’ అని జరాంగే చెప్పారు. జరాంగే ప్రకటన ఆ ప్రాంతంలో అలజడి రేపింది. ఆయన మద్దతుదారులు అధిక సంఖ్యలో అక్కడికి చేరారు. వారిలో కొంత మంది ఆయన మైక్రోఫోన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించగా, తాను ఒక్కడినే ముంబయికి పాదయాత్ర చేస్తానని, తనకు కావలసింది దన్నుగా ఒక కర్ర అని జరాంగే చెప్పారు. ఈ నెల 20న మహారాష్ట్ర అసెంబ్లీలో మరాఠా కోటా బిల్లు ఆమోదం పొందిన తరువాత తనపై ఆరోపణలు చేశారని ఆయన తెలిపారు.
‘ఈ వ్యక్తులు నా పొరపాట్లను ఇప్పుడే ఎలా గ్రహించి, వాటి గురించి మాట్లాడసాగారు’ అని జరాంగే ప్రశ్నించారు. ఫడ్నవీస్ ‘బ్రాహ్మణత్వ ఎత్తుగడల’ గురించి కూడా మాట్లాడిన జరాంగే తన ఆరోపణలు ‘అందరు బ్రాహ్మణుల’పై కాదని స్పష్టం చేశారు.‘తన కన్నా జనాదరణ ఎక్కువ ఉన్న ఎవరినీ ఫడ్నవీస్ ఇష్టపడరు. మరాఠా ఉద్యమ కార్యకర్తలు శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేసినా ఫడ్నవీస్ కారణంగానే వారిపై పోలీస్ ఫిర్యాదులు దాఖలయ్యాయి. శాంతియుత నిరసనకు కోర్టు అనుమతి ఇచ్చింది. మరి పోలీస్ ఫిర్యాదులు ఎందుకు దాఖలయ్యాయి’ అని జరాంగే ఒక ప్రాంతీయ వార్తా చానెల్‌తో అన్నారు.