ముంబయి : దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర బిజెపి శాసనసభా పక్షం నేతగా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం విధాన్ భవన్‌లో నిర్వహించిన శాసనసభా పక్షం సమావేశంలో ఫడ్నవీస్ (54) బిజెపి శాసనసభా పక్షం నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి కేంద్ర పరిశీలకుడు విజయ్ రూపాని ప్రకటించారు.
ప్రజల ఆకాంక్షలు తీర్చడమే అసలు సవాల్: ఫడ్నవీస్
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలోనే అసలైన సమస్య ఉందని ఫడ్నవీస్ అన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఫడ్నవీస్ ధన్యవాదాలు తెలిపారు. ‘మా బాధ్యత పెరిగింది. మేము మరింత కష్టపడి పని చేయాలి. మా నుంచి ప్రజల ఆకాంక్షలను సాఫల్యం చేయడమే ముందు ఉన్న పోరాటం. దీనిని సాధించేందుకు మా మిత్ర పక్షాలతో కలసి మేము కృషి చేయాలి’ అని ఆయన చెప్పారు.
భారతీయ జనతా పార్టీ 2019లో ప్రజల తీర్పు సాధించిందని, కానీ ‘దానిని లాక్కున్నారు’ అని ముఖ్యమంత్రి పదవి గురించి బిజెపితో సంబంధాలను ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన తెంచుకుని, కాంగ్రెస్, అవిభాజ్య ఎన్‌సిపితో పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఫడ్నవీస్ పేర్కొన్నారు. ‘మొదటి రెండున్నర సంవత్సరాలు మేము ప్రతిపక్షం లక్ష్యానికి గురయ్యాం, కానీ ఒక్క ఎంఎల్‌ఎ కూడా మమ్మల్ని వదలి వెళ్లలేదు. మేము 2022లో అధికారంలోకి వచ్చాం, ఇప్పుడు, మేము ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాం’ అని ఫడ్నవీస్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీకి ఫడ్నవీస్ ధన్యవాదాలు తెలుపుతూ, ‘ఒక పార్టీ కార్యకర్తగా పని చేసిన నా వంటి వ్యక్తిని ఈ పదవిలో మూడు సార్లు సేవ చేయడానికి ఎంపిక చేసినందుకు ప్రధానికి కృతజ్ఞుడిని. ఏక్ హై తో సేఫ్ హై, ఔర్ మోడీ హైతో ముంకిన్ హై (సమైక్యంగా ఉంటే మనం భద్రంగా ఉంటాం, మోడీతో ప్రతిదీ సాధ్యమే)’ అని అన్నారు.