Saturday, November 23, 2024

ఫలించని భూ సంస్కరణలు

- Advertisement -
- Advertisement -

భూమికి పేదరికానికి, పేదరికానికి భూమికి ఉన్న సంబంధం పైన, భూమి కేంద్రీకరణ, సమగ్ర భూ సంస్కరణల ఎడల భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధ భూస్వామ్య విధానం, భూ కేంద్రీకరణ దేశంలో కొనసాగుతున్నదని, దాన్ని బద్దలుకొట్టి పేదలకు భూములు పంపిణీ చేయాలని చెప్పే పార్టీలు, వ్యక్తులు, భూస్వామ్య విధానం, భూ కేంద్రీకరణ లేదని ప్రభుత్వాలు భూ సంస్కరణల అమలు జరిపాయని చెప్పే కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు మాట్లాడుతున్నారు. భారత దేశంలో సుదీర్ఘ కాలం ఫ్యూడలిజం కొనసాగింది. వలస పాలనలో కూడా అనేక ప్రాంతాల్లో రాజరిక వ్యవస్థ పాలన సాగింది. ఈ వ్యవస్థలో జమీందార్ల, జాగీర్దార్ల ఆధీనంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. అధికార మార్పిడి తర్వాత కూడా సంస్థానాలు కొంత కాలం కొనసాగాయి. భూస్వామ్య వ్యవస్థ రద్దుకు అధికారం చేపట్టిన భారత పాలకులు మౌలికమైన విధానాలు అమలు జరపలేదు.

బ్రిటిష్ వలస పాలన కాలంలోనే ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా భూ పోరాటాలు అనేక ప్రాంతాల్లో ప్రారంభమైనాయి. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన సాగిన తెలంగాణ పోరాటం సాయుధ ప్రతిఘటనా పోరాట స్థాయికి చేరింది. 10 లక్షల ఎకరాలను ప్రజలకు పంపి ణీ చేయటం జరిగింది. ప్రపుల్ల వాయలర్ రైతాంగం కూడా భూముల ఆక్రమణ ప్రారంభించారు. ఇంకా ఇలాంటి పోరాటాలే అనేక ప్రాంతాలకు విస్తరించాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫ్యూడల్ వ్యవస్థ పునాదులనే కదిలించి వేసింది. నెహ్రూ ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్టించింది. సంస్థానాలను యూనియన్‌లో కలపకపోతే పోరాటాలను ఆపటం కష్టమని భావించింది. బయపెట్టి సంస్థానాలను భారత యూనియన్‌లో కలుపుకుంది. రైతాంగ పోరాటాలు ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూసంస్కరణల ఎజెండాను ముందుకు తెచ్చింది. దేశంలో భూసంస్కరణల తీసుకు రావాల్సిన అవసరాన్ని

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 తెలియచేస్తున్నది. రాష్ట్ర శాసన సభలకు మాత్రమే భూ సంస్కరణల చట్టాలు రూపొందించి అమలు జరిపే అధికారం ఉంటుందని కూడా చెప్పింది. రైతాంగ పోరాటాల ఫలితంగా 1961- 62 నాటికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భూ సీలింగ్ చట్టాలు ఆమోదించాయి. సీలింగ్ పరిమితిలో రాష్ట్రానికి-రాష్ట్రానికి మధ్య తేడాలు వున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాల్లో ఒకే విధంగా సీలింగ్ తీసుకుని రావడానికి 1972లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో కొత్త సీలింగ్ విధానాన్ని రూపొందించారు. భూమి రకం, దాని ఉత్పాదక, ఇతర కారణాలపై ఆధాపడి ప్రాంతాన్ని బట్టి భూ సీలింగ్ పరిమితులకు జాతీయ మార్గ దర్శకాలు జారీ చేయబడ్డాయి. మొదటి రకం భూమి 10-18 ఎకరాలు, రెండవ రకం భూమి 18 -27 ఎకరాలు, కొండ, ఎడారి ప్రాంతాల్లో 27- 54 ఎకరాలు సీలింగ్ గా ప్రకటించారు.

దేశంలో 1961 -72 మధ్యలో మిగులు భూమి 23 లక్షలగా ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఒకే సీలింగ్ విధానం రూపొందించిన తర్వాత 67 లక్షల ఎకరాలుగా మిగులు భూమిని ప్రకటించారు. ప్రభుత్వ విధానాలు, పాలసీపై పరిశోధన, శిక్షణల నిమిత్తం ఏర్పాటైన లాల్ బహుదూర్ శాస్త్రీ జాతీయ అకాడమి ఆఫ్ ఎడ్మినిస్ట్రేషన్ అంచనా ప్రకారం సీలింగ్‌లో పోగా దేశం మొత్తం మీద మిగులు భూమి రమారమీ 5 కోట్ల 20 లక్షల ఎకరాలు ఉంటాయని అంచనా వేసింది. పాలకులు ప్రకటించిన 67 లక్షల ఎకరాల్లో 20 లక్షల 33 వేల ఎకరాలను స్వాధీనం చేసుకుని 10 లక్షల 90 వేల ఎకరాలను 50 లక్షల కుటుంబాలకు పంపిణీ చేసినట్లు జాతీయ భూ సంస్కరణల కౌన్నిల్ 2008 జనవరిలో పేర్కొన్నది. దీన్ని గమనిస్తే ప్రకటించిన మిగులు భూమిలో 11 లక్షల ఎకరాల లోపు మాత్రమే పేదలకు పంపిణీ చేయబడింది. దేశంలో 15 కోట్ల 50 లక్షల సాగు భూములు ఉంటే 67 లక్షలు మాత్రమే మిగులు భూమి ప్రకటించటం, అందులోను 11 లక్షల ఎకరాలు మాత్రమే పంపిణీ జరిగిందంటే భూ సంస్కరణలు ఎంత భూటకంగా మారాయో అర్ధమవుతుంది. అందుకు కారణం శాసన సభల్లో భూస్వామ్య వర్గ ప్రతినిధులు ఎక్కువగా ఉండడం,

ప్రభుత్వాలు కూడా భూస్వామ్యవర్గ ప్రయోజనాలు కాపాడేవి కావడమే. పంపిణీ అయిన దాంట్లో కూడా సేద్యానికి నిరుపయోగమైన భూములే ఎక్కువగా ఉన్నాయి. జమ్మూ -కశ్మీర్‌లో పూర్తిగా భూ సంస్కరణలు అమలు జరగగా, పశ్చిమ బెంగాల్, కేరళ కొంత మేర భూ పంపిణీ జరిగింది. భూ సంస్కరణల చట్టాలేవి భూస్వామ్య వ్యవస్థలో మౌలికమైన మార్పులు తీసు కురాలేకపోయాయి. ఫలితంగా భూ కేంద్రీకరణ కొనసాగుతూనే ఉన్నది. 2020 జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం 84% ఉన్న సన్నకారు రైతులు హెక్టారు కంటే తక్కువ భూమి కలిగి వున్నారు. వీరి చేతుల్లో ఉన్న మొత్తం భూమి 47.3% ఉంది. 13.8% ఉన్న ధనిక రైతాంగం పంట భూమిలో 47% పైగా కలిగి ఉన్నారు. రాష్ట్రాల వారీగాను తేడాలు ఉన్నాయి. పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో 10%గా ఉన్న భూస్వాముల వద్ద 80% భూమి ఉంది. తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో 55% భూమి 10% ఉన్న భూకామందుల వద్ద వుంది. దేశంలో కేవలం 4.9% ఉన్న ధనిక రైతాంగం 32% భూమిని నియంత్రిస్తున్నారు. భారత దేశంలో ఒక పెద్ద భూకామందు ఒక సన్నకారు రైతు కంటే 45 రెట్లు భూమి కలిగి ఉన్నాడు. సెజ్‌ల పేరుతో ప్రభుత్వం కొత్తగా భూ ఎస్టేట్ దారులను సృష్టించింది. రైతుల భూములను వీరికి కట్టబెడుతున్నది. ఫలితంగా భూ పంపిణీ తిరోగమనంలో సాగుతున్నది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం అమలు 1973లో అమల్లోకి వచ్చింది. చట్ట ప్రకారం మొదట 18 లక్షల ఎకరాలు మిగుల భూమిగా ప్రకటించింది ప్రభుత్వం. దాన్ని సవరించి 7.9 లక్షల ఎకరాలకు కుదించారు. అందులో కూడా 6.47 లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకుని, 5.82 లక్షల ఎకరాలను లక్షా 79 వేల మందికి పంపిణీ చేసినట్లు పాలకులు ప్రకటించారు. సీలింగ్ కింద స్వాధీనం చేసుకున్న భూస్వాముల భూములు వేళ్ళ మీద లెక్కించవచ్చు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని తమ భూములను భూస్వాములు కాపాడుకున్నారు. కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు చెబుతున్నట్లుగా భూ కేంద్రీకరణ తగ్గలేదని, అది కొనసాగుతూనే ఉందని, అర్ధ భూస్వామ్య విధానం గ్రామీణ జీవితాన్ని శాసిస్తున్నదని ప్రభుత్వ సంస్థలే వెల్లడిస్తున్నాయి. దేశంలో పేదరికానికి భూమి లేకపోవడం కారణంగా ఉందని

అనేకసూచికలు తెలియచేస్తున్నాయి. భారత దేశంలో గ్రామీణ ప్రాంతంలో పేదరికం 25.7% ఉండగా, పట్టణ ప్రాంతంలో 13.7% ఉన్నట్లు ప్రభుత్వ సర్వేలు వెల్లడిస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే పేదరికం ఇంకా పెరుగుతున్నది. పొలిటికల్ టైమ్స్ ఆఫ్ ఇండియా (2008) కథనం ప్రకారం భారత దేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో గ్రామీణ పేదలు భూమిలేని కుటుంబాలు కలిగి ఉంది. గ్రామీణ ప్రాంతం లో పేదలకు భూమి లేకపోవడం వలన భూకామందుల వద్ద భూమిని కౌలుకు తీసుకుంటున్నారు. కౌలు చట్టాలు రాక ముందు పాలు కౌలు, నికర కౌలు అమల్లో ఉంది. భూస్వాముల దయాదాక్షిణ్యాలపై కౌలు రైతుల మనుగడ ఉండేది. తీవ్రమైన దోపిడీకి గురయారు.

ఇలాంటి పరిస్థితుల మధ్య తమకు రక్షణ కల్పించాలని పెద్ద ఎత్తున కౌలు రైతులు ఆందోళన ప్రారంభించారు. ఫలితంగా అన్ని రాష్ట్రాల్ల్లో కౌలుదారీ చట్టాలు ఏర్పడ్డాయి. 1950లో తెలంగాణ కౌలు దారీ చట్టం, 1956 ఆంధ్రా కౌలుదారీ చట్టం అందులో భాగమే. ఈ రెండు చట్టాలు కౌలు రైతులకు కొన్ని హక్కులు కల్పిస్తూనే వాటిని హరించే వాటిని కూడా ఆ చట్టాల్లో చేర్చింది. ఆంధ్రప్రదేశ్‌లో చేసిన ఏ కౌలుదారీ చట్టం కౌలు రైతులకు భూమిపై కౌలు హక్కులు కల్పించలేక పోయింది. రైతు అనుమతి తప్పనిసరి చేయడంతో కౌలు రైతులకు పంట రుణాలు, నష్ట పరిహారాలు, బీమా సౌకర్యం పథకాలు వర్తించడం లేదు. అనేక ప్రాంతాల్లో కౌలు డబ్బు రూపంలోకి మారటం, కౌలు రేటు ఎక్కువ ఉండడం కౌలుదారులకు భారంగా మారింది. కేరళ, జమ్మూ కశ్మీర్, మణిపూర్ రాష్ట్రాల్లో కౌలుపై పూర్తి నిషేధం ఉంది.

దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది కౌలు రైతు ఉండగా, ఆ తర్వాత స్థానం తెలంగాణది. కౌలు చట్టాల వలన దేశం వ్యాప్తంగా కోటి 24 లక్షల మంది (గ్రామీణ కుటుంబాల్లో 8%) కౌలు రైతులకు కోటి 56 లక్షల ఎకరాల భూమి (దేశ వ్యవసాయ భూమిలో 4% )పై కౌలు హక్కులు కల్పించినట్లు ప్రభుత్వాల లెక్కలు తెలియచేస్తున్నాయి. అదే సమయంలో దేశంలోని దాదాపు 35% వ్యవసాయ భూముల నుంచి కౌలు రైతులను తొలగించారు. వాస్తవాలను పరిశీలించి నప్పుడు భూ సంస్కరణల వల్ల పేదలకు భూములు లభించలేదని, భూ కేంద్రీకరణలో మౌలిక మార్పు రాలేదని, కౌలుదారీ చట్టాల వలన కౌలు హక్కులు లభించక పోగా అత్యధిక మంది కౌలుదారులు భూమి నుండి తొలగించబడ్డారని వెల్లడవుతున్నది. పేదలకు భూమి లభించాలన్నా, భూమిపై కౌలు హక్కులు ఏర్పడాలన్నా యావన్మంది గ్రామీణ పేదలు సమైక్యంగా ఉద్యమించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News