Sunday, December 22, 2024

విజ్ఞానమా, మత విశ్వాసమా?

- Advertisement -
- Advertisement -

మనిషికి విశ్వాసమే బలం. తన మీద తనకు విశ్వాసం వున్న వాడు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతాడు, పరిశీలిస్తాడు, ప్రయోగాలు చేస్తాడు. అవి విఫలమైతే, అవగాహన పెంచుకుంటాడు. రోజు రోజుకూ పెంచుకుంటున్న జ్ఞాన జ్ఞాన సముపార్జనతో కొత్త దారులు వెతుకుతాడు. కొత్త అన్వషణకు ద్వారాలు తెరుస్తాడు. తను చేసిన ప్రయత్నాలకు, ప్రయోగాలకు ఫలితాలు సాధిస్తాడు. ఫలితాలు విజయవంతమైతే మళ్ళీ అవి మానవాళికి ఉపయోగకరంగా వుంటాయా? వున్నాయా? అని పరీక్షించుకుంటూ వుంటాడు. సంతృప్తి చెందితేనే తన కృషి ఫలితాన్ని మొత్తానికి మొత్తంగా మానవాళికి ధారపోస్తాడు. ప్రతి శాస్త్రవేత్తా చేసే పని ఇదే! వీరు ప్రతి దానికి రుజువులూ, నిరూపణలూ కావాలంటారు. వీరంతా మానవవాదులే!

మరో మనిషి కూడా తన ప్రయాణాన్ని విశ్వాసం లోంచే ప్రారంభిస్తాడు. ఏదో ఓ శక్తిని, దేవుణ్ణి, దేవతను, దేవదూతను చివరకు ఎదురుగా కనిపించే మఠాధిపతినో, సన్యాసినో, బాబానో, గురువునో, మాతాజీనో నమ్ముతుంటాడు. వీళ్ళల్లో ఫాదర్‌లు, ముల్లాలు కూడా వుండొచ్చు. తన మీద తనకు వున్న నమ్మకాన్ని వదిలేసి, తోటివాడి తోడును వదిలేసి, జీవిస్తున్న సమాజాన్ని వదిలేసి, అనుభవిస్తున్న ఆధునిక సౌకర్యాలను గుర్తించకుండా… ఎక్కడా, ఎప్పుడూ, ఎవరికీ కనపడని ఒక శక్తిని గూర్చి మాట్లాడుతూ వుంటాడు. దానితో అంటుకోవాల్సిన జాడ్యాలన్నీ అంటుకుంటాయి. జన్మలు, పునర్జన్మలు, పాప పుణ్యాలు, జాతకాలు, వాస్తు, బల్లి శాస్త్రం వగైరా వగైరా.. అభూత కల్పనల్లో, భ్రమల్లో రూపుదిద్దుకున్న అనేకానేక అంశాల మీద దృష్టి పెట్టి భక్తి పారవశ్యంలో తేలిపోతాడు.

మనం పైన చెప్పుకొన్న ఇద్దరు మనుషులు ‘విశ్వాసం’ లోంచి, బయలుదేరిన వారే. మొదటి వ్యక్తి విశ్వాసం అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ వచ్చింది. రెండో అతనిది మూఢ విశ్వాసంగా మారి వాస్తవాల్ని గ్రహించలేని మానసిక వైకల్య దశకు చేరుకుంది. మొదటి వ్యక్తి నిజంగానే గ్రహాంతర యానం చేస్తున్నాడు. రెండో అతను గ్రహాలు లెక్కబెట్టుకుంటున్నాడు. మొదటి వ్యక్తి జ్ఞానంతో విశ్వ రహస్యాల్ని ఛేదిస్తుంటే, రెండో అతను తనకు ఆత్మ జ్ఞానం కలిగిందని, లోకాలన్నిటినీ తనలోనే చూసుకుంటున్నానని చెపుతున్నాడు. లేదా తను నమ్ముతున్న దేవుడిలో చూసుకున్నానని అంటున్నాడు. మొదటి వ్యక్తి కృషి బహిరంగంగా మొత్తం సమాజానికి అనుభవంలోకి వస్తుంది. ఈ రెండో వ్యక్తి చెప్పే అనుభూతి కేవలం అతనికి మాత్రమే పరిమితమవుతుంది.

“ఇదేమిటీ? నీకు కలిగిన అనుభూతి నాకు ఎందుకు కలగడం లేదూ? అని ఎవరైనా అడిగితే బాబూ! నువ్వు కూడా ఆత్మ దర్శనం చేసుకో సమాధిలోకి పో ఈ బంధాలన్నీ తెంపేసుకో ఆ దేవదేవుణ్ణి నిరంతరం ధ్యానించు అప్పుడు నీకు కూడా ఆ అనుభూతి కలుగుతుంది” అని అంటాడు. నిజానికి మాయ మాటలు చెప్పి, ఈ రెండో మనిషి ఏం చేస్తున్నాడూ? కడుపులో చల్ల కదలకుండా ఎ.సి. రూమ్‌లో కూర్చుని వ్యాపారం చేసుకుంటూ వున్నాడు. వీలైతే సెక్స్‌లో రాకెట్ అవుతున్నాడు. జనాన్ని మానసికంగా దెబ్బ తీస్తూ అతను బలవంతుడవుతున్నాడు. సమకాలీన సమాజంలో చీకటి రాజ్యమేలుతున్న ఏ బాబానైనా, సన్యాసినైనా, మాతాజీనైనా, పీఠాధిపతినైనా తీసుకోండి.

జరుగుతున్నది ఇదే కదా? వీరికి బలం చేకూరుస్తున్నది రాజకీయ నాయకులు, అధికారులు, కొన్ని సంస్థలే కదా? వివాదాస్పదమైపోయి అంతా బహిరంగంగా వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్నా.. కొంత మందికి మాత్రం జ్ఞానోదయం కావడం లేదు. మూఢత్వంలో మునిగిపోయి జనం అలాంటి వారిని ఇంకా ఆదరిస్తూనే వున్నారు. ఈ రెండో మనిషి సంగీతాన్ని, సాహిత్యాన్ని, నాట్యాన్ని అన్ని కళల్ని తెలివిగా వాడుకొని, అందులో దైవభావనను ప్రతిష్ఠస్తూ వస్తున్నాడు. అది అసంబద్ధమని మొదటి మనిషి చెపుతూనే వున్నాడు. అతను ఒంటరివాడు కాదు, అతని వెనక చార్వాకులు, నిరీశ్వరవాదులు, హేతువాదులు, శాస్త్రజ్ఞులు, మా‘నవ’వాదులు ఎందరో వున్నారు. వారంతా ప్రశ్నలు గుప్పిస్తూనే వున్నారు. దేవుళ్ళను, దయ్యాలను పక్కకునెట్టి తమ కృషి తాము చేస్తూనే వచ్చారు. ఇంకా చేస్తూనే వున్నారు కూడా!

ఈ రెండో రకం మనుషులు అప్పనంగా అందుతున్న వైజ్ఞానిక సౌకర్యాలు తమకు ఏ అర్హత వుందని వాడుకుంటున్నారూ? మనిషిని, మనిషి మేధస్సును అభినందించకుండా మనిషి సాధించిన విజయాల్ని ఎందుకు అనుభవిస్తున్నారూ? ఒళ్లు రుద్దుకునే సబ్బు దగ్గర్నుండి, కుక్కర్, గ్యాస్ స్టౌ, కరెంటు, ఎ.సి, కారు, విమానం, ఓడ వంటివి ఏవీ వాడకూడదు గదా? వారి దేవుడు, వారి మాతాజీ, వారి పీఠాధిపతి, వారి అల్లా, వారి తండ్రీ ఏదైనా ఇస్తే వారు వాటిని మాత్రమే వాడుకోవాలి కదా? శాస్త్ర వైజ్ఞానిక అంశాలను కూడా వక్రీకరించి తమ ప్రవచనాలకు, బోధనలకు అనువుగా వాడుకుంటున్నారు కదా! అదంతా ఆత్మద్రోహం, వంచన, మోసం, దగా కాదా? కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచించే వారికి విషయం దానంతట అదే అర్థమవుతుంది.

జీవ పరిణామంపై కనీసమైన అవగాహన లేకుండా భూమి గురించి, గ్రహాల గురించి, కనీస పరిజ్ఞానం లేకుండా పర్యావరణం పట్ల, పంటల పట్ల, ఎరువులు, సాగు విధానాలు, నూతన వంగడాలు, మానవ సమస్యల పట్ల ఏ మాత్రమూ కనీస జ్ఞానం లేని ఈ మత గురువులంతా ఏం చెపుతారూ? ఆత్మశుద్ధి గురించి మాట్లాడుతారా? సర్వేశ్వరుడి గురించి మాట్లాడుతారా? ఏదీ ఇన్ని లక్షల సంవత్సరాల కాలంలో ఎవరూ ఎవరి ఆత్మల్ని చూసిన దాఖలాలు లేవే? ఆ సర్వేశ్వరుడెవరో ఆ మత మౌఢ్యాన్ని బద్దలు కొట్టుకుని మరి బయటికి రాడేమీ? గుండు సూది దగ్గర్నుండి, రాకెట్ ప్రయోగం దాకా మనిషి తన మేధస్సుతో సాధించుకుంటూ వస్తూ వుంటే… ఏ ఒక్కడూ, ఏ ఒక్కనాడూ వాటి గురించి మాట్లాడడు కదా? ఎక్కడ వుందండీ పాల సముద్రం? ఎక్కడండీ ఆదిశేషువూ? స్వర్గం, నరకం ఎక్కడ? అగ్నిదేవుడు, వాయుదేవుడూ ఎక్కడ? అన్నీ సింబాలిక్‌గా మనిషి అందంగా రాసుకున్న కథలు కావూ? భ్రమలు, ఊహలు, కల్పితాలు, అబద్ధాలు అన్నీ అందంగా వుండొచ్చు. జనాన్ని కొంత కాలం నమ్మించొచ్చు. కానీ, ఎల్లకాలమూ అవి ఆ పని చేయలేవు. మనిషి నాగరికత సాధించక ముందు, విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధి చేసుకోక ముందు అన్ని మతాల వారు, అన్ని భాషల్లో తమ తమ కల్పనల్ని రాసుకున్నారు. ఆయా కాలాల్లో వున్న జనాన్ని నమ్మించారు. సత్ప్రవర్తనతో మెలగడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అంత వరకు మనం ఒప్పుకోవాల్సిందే! ఇక అదే భావజాలం ఆగామి కాలాలలో కూడా కొనసాగాలనుకుంటే పొరపాటు.

బాలశిక్షతో చదువు ప్రారంభించిన బాలుడు పెరిగి పెద్దవాడై, ఒక వ్యోమగామి అయ్యాడనుకుందాం. అతను తను సాధించిన రాకెట్ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలా? లేక ఇంకా బాలశిక్ష దగ్గరే వుండిపోవాలా? విషయమేమంటే, అని మతాల మతతత్వ వాదులూ మనల్ని బాలశిక్ష దగ్గరే ఆగిపొమ్మని చెపుతున్నారు. వింటూ కూచుందామా? పనికిరాని మాటల్ని పక్కన పెడతామా? విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మనమే! “సైన్సూ మతం: రెండూ సత్యాన్వేషణకు దారి తీసేవే కాబట్టి, రెండూ ఒకటే. సైన్సు కూడా ఒక మతం లాంటిదే” అని కూడా కొందరు తీర్మానించారు. అవి ఒకటేనా? కాదా? అని కొద్దిపాటి మెదడు ఉపయోగించి ఆలోచించినా తెలుస్తుంది. రిచర్డ్ డాకిన్స్ జీవ పరిణామం గురించి రాస్తే, లిసా రాండాల్ భౌతిక శాస్త్రం గురించి రాస్తే కోట్లాది జనం విశ్వసనీయంగా చదువుతున్నారు.

విశ్వసిస్తున్నారు. ఎందుకంటే, వారు చిత్తశుద్ధితో కృషి చేసి, విషయ పరిజ్ఞానం సంపాదించి, వారి వారి విశ్లేషణలు జోడించి సామాన్యుడి కోసం సరళంగా చెపుతున్నారు కాబట్టి! విశ్వాసమే నిరూపణ అయితే మానవ జాతికి అదొక బలంగా మారుతుంది. నిరూపణ కాని విశ్వాసానికి విలువ వుండకపోగా, అది మూఢ నమ్మకంగా మిగిలిపోతుంది. ఒక పూజారి తనకు తన ‘స్వామి’ ప్రత్యక్షమయ్యాడని చెపితే, అది అతని “వ్యక్తిగత అభిప్రాయం” అని అనుకోవాలి! అతను చదువుకున్నది లేదు, ప్రపంచ జ్ఞానం సంపాదించి లేదు. తాత తండ్రులు నేర్పిన నాలుగు పురాణ కథలు, పది సంస్కృత శ్లోకాలతో పూట గడుపుకునేవాడు. నిరూపణల దాకా రాలేదు కదా? నిజానికి తప్పు అలాంటి వారికి కాదు జనానిదే! తమ శక్తియుక్తులను, పనికిరాని పరిజ్ఞానానికి పరిమితం చేస్తున్న వారి మోసాల్ని గ్రహించలేకపోతున్నారు. కోడి కూతలను, బాతు అరుపులను, బల్లి అరుపులను ‘దైవవాక్యం’గా భావించాలని చెపితే నమ్మేస్తున్నారు. మాయను వాస్తవం అనుకుంటున్నారు. తమ తమ మెదడ్లను ఏ మాత్రం ఉపయోగించకుండా వుంటున్నారు ఇక చాలు!

అమాయక జనం ఇక ఆలోచించడం మొదలు పెట్టాలి. మత బోధలు చేసేవారిని, ప్రవచనాలు చెప్పే వారిని ప్రశ్నించాల్సిన రోజులు వచ్చేశాయి. “అయ్యా! వేల సంవత్సరాలుగా మీ ఊకదంపుడు వింటూనే వున్నాం. ఇక చాలు ఆధునిక వైజ్ఞానిక విశేషాలేమైనా తెలిస్తే చెప్పండి” అని నిర్భయంగా నిలదీయాల్సిన రోజులు వచ్చేశాయి. నికొలస్ కోపర్నికస్, గియార్డనో బ్రూనో, గెలీలియో, ఫ్రాన్సిస్ బేకన్ లాంటి వారు మతాన్ని, అంధ విశ్వాసాల్ని వీరోచితంగా ఎదిరించి, సత్యాన్వేషణకు కట్టుబడిన వారు. వారు శాస్త్రవేత్తలే కాదు, మానవవాదులు కూడా! ఆధునిక భౌతిక వాదానికి పునాదులు వేసింది వీరు మాత్రమే కాదు. ఇంకా ఎంతో మంది అలాంటి మహనీయులు వున్నారు చేతనైతే, వారి గురించి చెప్పండని అడగాలి!
అసలు తొలిసారి ప్రపంచానికి భౌతికవాదం గురించి బోధించింది ఈ భారత దేశమే అన్నది మరవకూడదు.

చార్వాకులు చెప్పింది. బుద్ధుడు బోధించింది ఎందుకు నాశనం చేసుకున్నాం? నాశనం చేసి ఏం సాధించాం? విశ్లేషించుకోవాలి!ఇప్పుడు వాటిని పునరుద్ధరించుకోవడమే కాదు, వాటిని వైజ్ఞానిక దృష్టికోణంలో మళ్ళీ రాసుకోవాలి!కొన్ని శతాబ్దాలుగా మనువాదులు కుట్రలకు అన్యాయంగా బలైపోయి నాశనమైపోయాయి. సమాజాన్ని మూఢ విశ్వాసాల్లో పూర్తిగా ముంచేశాం. ఇప్పటికైనా తేరుకొని బయటపడాలి. మనిషి స్థాయిని తగ్గించే అహేతుకమైన అంశాలను త్యజించాలి. సహేతుకమైన వాటినే స్వీకరించాలి. మానవవాద కోణంలో విశాల దృక్పథాన్ని అలవరుచుకుంటూ ప్రత్యామ్నాయ సంస్కృతిని అభివృద్ధి చేసుకోవాలి. లైటు వేస్తే చీకట్లు పగిలినట్లు, వైజ్ఞానిక స్పృహతోనే మతమౌఢ్యం పగిలిపోవాలి! సామాన్య జనం మేలుకుంటే వైజ్ఞానిక మా‘నవ’వాద ప్రజాస్వామ్యాన్ని ఎవరూ అడ్డుకోలేరు. కళ్లు మూసుకుని దైవశక్తికి దాసోహమనకుండా, కళ్ళు తెరచి మానవ శక్తిని ఎలుగెత్తి చాటే కార్యక్రమాలకు రూపకల్పన చేసుకోవాలి! నవీన మానవ ఆవిర్భావానికి దారులు వేయాలి!!

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News