Monday, December 23, 2024

ఆగని ఫేక్ ఆధార్‌కార్డులు !

- Advertisement -
- Advertisement -

తప్పుడు ఆధార్‌తో 455 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్
ఒరిజినల్ డాక్యుమెంట్, ఆధార్ పరిశీలించకుండానే
రిజిస్ట్రేషన్ చేసిన చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్
కేసు నమోదు చేసిన పోలీసులు

మనతెలంగాణ/హైదరాబాద్: కొందరు భూ కబ్జాదారులు ఫేక్ ఆధార్ కార్డులను సృష్టించి ప్లాట్లు, భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్‌లో అధికంగా చోటు చేసుకున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్ పకడ్భందీ చర్యలు చేపట్టినా కొందరు సబ్ రిజిస్ట్రార్‌లు, డాక్యుమెంట్ రైటర్‌ల తప్పిదం వల్ల మళ్లీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.

సబ్ రిజిస్ట్రార్ నిర్లక్షం వల్లే…
సబ్ రిజిస్ట్రార్ నిర్లక్షం వల్ల ప్రస్తుతం చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తానే అసలు యజమానినంటూ ఫేక్ ఆధార్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ వెంకటరమణ ఒరిజినల్ ఆధార్ కార్డు చూడకుండా, ఆ భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్‌లను చూడకుండానే రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ జరగడానికి ముందు ఒక డాక్యుమెంట్ రైటర్‌ను ఈ ఫేక్ ఆధార్ తయారు చేయించిన వ్యక్తి సంప్రదించగా ఇది తన పరిధి కాదనీ, సబ్ రిజిస్ట్రార్‌తో మాట్లాడుకోవాలని పేర్కొనడంతో వారు డైరెక్ట్‌గా సబ్ రిజిస్ట్రార్‌తో మాట్లాడుకొని నకిలీ నరసింహ్మా గౌడ్ వెంటనే ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు అసలు యజమాని నరసింహ్మా గౌడ్ ఆరోపిస్తున్నారు.

సబ్ రిజిస్ట్రార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు
తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు అసలు యజమాని నరసింహ్మా గౌడ్ ఫిర్యాదు చేయడంతో నకిలీ వ్యక్తితో పాటు ప్లాట్‌ను కొనుగోలు చేసిన వ్యక్తులు, సబ్ రిజిస్ట్రార్‌పై ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ విషయమై సబ్ రిజిస్ట్రార్‌ను ఆ శాఖ ఉన్నతాధికారులు వివరాలను అడిగి తెలుసుకున్నట్టుగా తెలిసింది. త్వరలో అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టుగా సమాచారం.

భూమికి సంబంధించిన వివరాలు ఇలా..
మొయినాబాద్ పరిధిలోని ఎన్కేపల్లిలో పిల్లిమడుగు నరసింహ్మా గౌడ్ సర్వే నెంబర్ 215, 216/ఏ, ప్లాట్ నెంబర్ 57,58 నెంబర్‌లోని 455 గజాల స్థలాన్ని 2003లో కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 06వ తేదీన పిల్లిమడుగు నరసింహ్మా గౌడ్ పేరుతో వేరే వ్యక్తి ఫేక్ ఆధార్‌ను తయారు చేసుకొచ్చి 227.5 గజాలను మజార్ అలీకి, మరో 227.5 గజాలను సయ్యద్ ఇర్పాన్‌లకు విక్రయిస్తూ చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ రెండు డాక్యుమెంట్‌లకు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఈ రిజిస్ట్రేషన్‌ల సమయంలో సబ్ రిజిస్ట్రార్‌లు నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ తప్పిదం జరిగినట్టుగా అసలు ప్లాట్ యజమాని ఆరోపించారు.

రూ.5లక్షలు మించిన దస్తావేజులకు పాన్‌కార్డు తీసుకోవాలి
గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొనుగోళ్లు, విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్లు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆధార్‌కార్డుతో పాటు రూ.5లక్షలు మించిన దస్తావేజులకు సంబంధించి కచ్చితంగా పాన్‌కార్డు తీసుకోవాలని, ప్రతి డాక్యుమెంట్ వీడియో రికార్డింగ్ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్లకు సూచించారు. అయినా కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేయకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News