సిటిబ్యూరోః హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నకిలీ సర్టిఫికేట్లు జారీ చేస్తున్న ముగ్గురు నిందితులను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, సరూర్‌నగర్ పోలీసులు కలిసి సోమవారం పట్టుకున్నారు. ముగ్గురు నిందితులు పట్టుబడగా, మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 39 నకిలీ సర్టిఫికేట్లు, 486హోటోగ్రాములు, స్టాంపులు, ఎనిమిది మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మేడ్చెల్ జిల్లా, కొంపల్లికి చెందిన గొట్టుముక్కల రోహిత్ వర్మ వ్యాపారం చేస్తున్నాడు. ఎపిలోని వెస్ట్‌గోదావరి, తణుకుకు చెందిన తాడిషెట్టి రేణుకేష్, గొల్లపల్లి శ్రావణ్, రావిపల్లి రాంభద్రారావు, అన్నం దినేష్,
రాహుల్ దీక్షిత్ కలిసి నకిలీ సర్టిఫికేట్లు విక్రయిస్తున్నారు. ఇందులో రాంభద్రారావు, దినేష్, రాహుల్ దీక్షిత్ పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు తాడిషెట్టి రేణుకేష్ ఎంఎస్సీ జూవాలజీ చదివాడు. ప్రైవేట్ పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. జీతం తక్కువగా వస్తుండడంతో కన్సల్‌టెన్సీలో పనిచేసేవాడు, ఈ సమయంలోనే రాహుల్ దీక్షిత్ పరిచయమయ్యాడు. దీక్షిత్ అవసరం ఉన్న వారికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంటర్, డిగ్రీ, బి. టెక్ నకిలీ సర్టిఫికేట్లు సరఫరా చేస్తున్నాడు. తర్వాత నకిలీ సర్టిఫికేట్లు సరఫరా చేస్తున్న రాంభద్రారావు, దినేష్‌తో పరిచయం ఏర్పడింది. అందరు కలిసి లక్ష రూపాయలు తీసుకుని అవసరం ఉన్న వారికి నకిలీ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. గొట్టిముక్కల రోహిత్‌వర్మ ఇంజనీరింగ్ మధ్యలో ఆపివేశాడు.
తనకు బి. టెక్ సర్టిఫికేట్ కోసం తాడిషెట్టి రేణుకేష్‌ను సంప్రదించారు. రూ.1,00,000 తీసుకుని రేణుకేష్ నకిలీ సర్టిఫికేట్‌ను ఇచ్చాడు. నకిలీ సర్టిఫికేట్ల విషయం పోలీసులకు తెలియడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ సుధాకర్, ఎస్సై ఎఎ రాజు నిందితులను పట్టుకున్నారు.