రాజేంద్రనగర్ : అక్కడ రకరకాల పిప్పర్‌మెంట్లు తయారవుతున్నాయి. పిల్లలు ఎంతో ఇష్టపడే లాలీపాప్‌లకు కొదవ లేదు.
విశ్వసనీయ సమాచారంతో దాడి చేసిన ఎస్‌వోటి పోలీసులు ఈ నకిలీ చిన్న పిల్లల తిను బండారాల బండారం బట్టయలు చేశారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసిన ఈ సంఘటన ఎస్‌వోటి పోలీసుల కథనం ప్రకారం…. అత్తాపూర్ సులేమాన్‌నగర్‌లో జనవాసాల నడుమ గుట్టు చప్పుడు కాకుండా పిల్లల తినుబండరాల తయారీ కేంద్రం కొనసాగుతున్నట్లు ఎస్‌వోటి పోలీసుల సమాచారం అందింది. దాంతో పక్కా ప్లాన్ ప్రకారం గోల్డెన్ సిటీ పేరుతో అహ్మద్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న చాకెట్లు, లాలీపాప్‌లు, నిమ్మ బిల్లల తయారీ కేంద్రం పై పోలీసులు దాడి చేశారు.
దాంతో అక్కడ సూపర్ మార్కెట్లు , బస్తీల్లోని చిన్న చిన్న కిరాణా షాపులకు తరలించడానికి సిద్దం చేసి ఉంచి లాలీపాప్‌లు, చాకెట్లు, బిల్లలు కనిపించాయి. అంతే కాదు పెద్ద మొత్తంలో అశుభ్రకర వాతావరణంలో నిల్వ ఉంచిన బెల్ల పానకం, ఇతర ఫుడ్ కెమికల్స్‌ను పోలీసులు గుర్తించారు. బట్టిలపై పాకం తయారు చేసి,వాటిని బిల్లలుగా, చాకెల్లుగా కట్ చేస్తున్న పని వాళ్లను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా గుర్తించారు. ఎలాంటి అనుమతి లేని ఫుడ్ ఐటమ్స్ తయారీ కేంద్రంగా పోలీసులు నిర్ధారించి, నిర్వాహకులు అహ్మద్‌తో పాటు అక్కడ పని చేస్తున్న కొంత మందిని అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈదాడుల్లో సుమారు రూ.3 లక్షల వరకు లాలీపాప్, చాక్లెట్లు, నిమ్మ బిల్లల తయారీకి ఉపయోగించే ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం రాజేంద్రగర్ పోలీసులకు కేసును ఎస్‌ఓటి పోలీసులు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.