Thursday, January 23, 2025

మేడారం హుండీల్లో నకిలీ నోట్ల కలకలం

- Advertisement -
- Advertisement -

వరంగల్  : మేడారం మహా జాతర హుండీల్లో నకిలీ నోట్లు కలకలం రేపాయి. నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన జాతరలో దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన 512 హుండీలను ఇటీవల హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపానికి తరలించారు. హుండీలకు పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. గురువారం నుంచి హుండీల్లో కానుకల లెక్కింపు ప్రక్రియ చేపట్టగానే నకిలీ నోట్లు వెలుగు చూడడంతో అధికారులు ఖంగుతిన్నారు. ఇప్పటిదాకా చూడని నోట్లు రావడం విస్మయానికి గురిచేసింది. 300 మంది సిబ్బందిని నియమించి లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. అధికారుల పర్యవేక్షణలో ఒక్కో హుండీని తెరిచి లెక్కిస్తున్నారు. దాదాపుగా 10 రోజులకు పైగా ఈ లెక్కింపు సాగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే, తొలిరోజు లెక్కింపు ప్రక్రియలో నకిలీ నోట్లు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. హుండీలో ఆరు నకిలీ నోట్లను అధికారులు గుర్తించారు. అన్నీ కూడా వంద రూపాయల నోట్లు కావడం గమనార్హం. తొలి లెక్కింపులో నకిలీ నోట్లు రావడంతో మిగతా హుండీల్లో ఎలాంటివి వస్తాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది.

నకిలీ నోట్లు వేసిన వ్యక్తులు తమ డిమాండ్‌తో కూడిన లేఖను కూడా హుండీలో వేశారు. నకిలీగా గుర్తించిన వంద నోటులో అంబేద్కర్ ఫొటో ముద్రించి ఉంది. మరోవైపు నకిలీ నోట్లు వేసిన వ్యక్తులు మాత్రం వంద నోటుపై అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని డిమాండ్ చేశారు. హుండీల్లో నకిలీ నోట్లు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నకిలీ నోట్లు కేవలం ఒక్క హుండీకే పరిమితం అయిందా లేక ఇంకా చెలామణిలో ఉన్నాయా అనే కోణంలో నిఘా పెట్టారు. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాపై ఫోకస్ పెట్టారు. ఏజెన్సీ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వీటిని చెలామణి చేస్తారేమోనని పోలీసులు భావిస్తున్నారు. కాగా, 512 హుండీల లెక్కింపు 10 నుంచి 15 రోజుల పాటు సాగుతుందని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత తెలిపారు. జాతర పూర్తయినప్పటికీ ఇంకా భక్తులు వస్తున్నందున కొన్ని హుండీలు ఏర్పాటు చేశామని తెలిపారు. సమ్మ సారలమ్మ జాతర ముగిసి, తిరుగువారం కూడా పూర్తయినందున మిగిలిన హుండీలను కూడా లెక్కిస్తామని మేడారం జాతర ఇఒ రాజేంద్రం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News