Monday, December 23, 2024

రూ. 27 లక్షల నకిలీ కరెన్సీ జప్తు!

- Advertisement -
- Advertisement -
ఇద్దరు అరెస్టు!

హైదరాబాద్: తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల ముద్రణ, చెలామణిలో ప్రమేయం ఉన్న ఇద్దరిని సోమవారం కమిషనర్ టాస్క్ ఫోర్స్(సౌత్ జోన్), చాంద్రాయణగుట్ట పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి  పట్టుకున్నారు. తమ ఆపరేషన్‌లో రూ. 27 లక్షల విలువ చేసే నకిలీ నోట్లను, ఇతర పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు కస్తూరి రమేశ్ బాబు ఓ కారు మెకానిక్. నారాయణపేట్ జిల్లా కోస్గికి చెందినవాడు. లాక్‌డౌన్‌లో అతడు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. తర్వాత అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.

అతడు నకిలీ కరెన్సీ నోట్లను ఎలా ముద్రించాలన్నది నేర్చుకున్నాడు. చెలామణి చేయడానికి నకిలీ కరెన్సీని ముద్రించి దగ్గరపెట్టుకున్నాడు. ఈ లోగా అతడిని గోపాలపురం పోలీస్ స్టేషన్ పోలీసులు 2022 సెప్టెంబర్‌లో అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలులో ఉండగానే అతడు హస్సన్ బిన్ హమూద్‌తో పరిచయం పెంచుకున్నాడు. హస్సన్ బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హత్య కేసు కింది జైలుపాలయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక రమేశ్ బాబు, ఆయన కుటుంబం తాండూర్‌కు షిఫ్ట్ అయ్యారు. అక్కడ అతడు నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించడానికి ముడి పదార్థాలు సేకరించాడు. రమేశ్ రూ.500 డినామినేషన్ నకిలీ నోట్లను ముద్రించి గుజరాత్‌లో చెలామణి చేసాడు.

రమేశ్‌ను గుజరాత్ పోలీసులు 2023 జనవరిలో అరెస్టు చేశారు. తర్వాత అతడిని జుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. తర్వాత రామేశ్వరి, హస్సన్ బిన్ హమూద్‌ను కాంటాక్ట్ చేసి నకిలీ నోట్ల ముద్రణ సామాగ్రినంతా చాంద్రయణగుట్టకు బదిలీ చేసింది. తర్వాత హస్సన్ బిన్ హమూద్, రామేశ్వరిని అరెస్టు చేశారు. కాగా కస్తూరి రమేశ్ బాబు ప్రస్తుతం పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

‘ఈ ముఠా సమాచారం అందగానే కమిషనర్ టాస్క్ ఫోర్స్, సౌత్ జోన్ టీమ్, చాంద్రాయణగుట్ట పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 27 లక్షలు విలువచేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు’ అని డిసిపి(క్రైమ్స్) పి. శబరీశ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News