ఎలాంటి అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…కరీంనగర్‌కు చెందిన రాజు గంగారాం అంకలాప్ నగరంలోని రామంతపూర్‌లో శ్రీ సాయి వెంకటేశ్వర క్లినిక్‌ను ఏర్పాటు చేశాడు. ముంబాయికి చెందిన సంస్థ నుంచి డిఎన్‌వైసి, పిజిడిఈఎంఎస్ చేసినట్లు పెట్టుకుని ఫిజీషియన్‌గా చేలామని అవుతున్నాడు.
గతంలో నిందితుడు ఆయుర్వేదిక్, జనరల్ మెడిసిన్ క్లినిక్స్‌లో పనిచేయడంతో వైద్యం గురించి తెలుసుకున్నాడు. నిందితుడికి మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. రోగులను పూర్తిగా పరిశీలించకముందే మందులను రాసేవాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు కోసం అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అంబర్‌పేట పోలీసులు తెలిపారు.