రాష్ట్ర సచివాలయంలో మరో నకిలీ ఉద్యోగి పట్టుబడ్డారు. కొంపల్లి అంజయ్య అనే వ్యక్తి తహశీల్దార్ అని చెప్పుకొని గురువారం సచివాలయం లోకి వెళ్లాడు. దీనికి ఆయన ఓ ఫేక్ ఐడీ కార్డును తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతనిపై అనుమానం రావడంతో అధికారులు విచారించి, అతను ఫేక్ ఐడీ కార్డుతో వచ్చాడని గుర్తించారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్న సచివాలయ భద్రతా సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు అంజయ్యను అప్పగించారు. అయితే ఇటీవల కాలంలో రోజుకో నకిలీ ఉద్యోగిని భద్రత సిబ్బంది పట్టుకుంటున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. గత బిఆర్‌ఎస్ హయాంలో రాష్ట్ర సచివాలయాన్ని భారీ ఎత్తున నిర్మించిన విషయం తెలిసిందే.
ప్రారంభోత్సవం అనంతరం దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంగా నాటి ప్రభుత్వం పేరు పెట్టింది. అయితే గత ప్రభుత్వంలో ఈ సచివాలయంలోకి మంత్రులు, అధికారులకు మినహా ఇతరులకు ఎంట్రీ ఉండకపోయేది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాన్యులకు సైతం సచివాలయంలోకి వచ్చే అవకాశం కల్పించారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం కల్పించిన ఈ అనుమతిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారనేందుకు జరుగుతున్న ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయని అంటున్నారు.