న్యూస్‌డెస్క్: ఆదాయం పన్ను శాఖ అధికారినంటూ వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న ఒక ఘరానా మోసగాడిని విజయవాడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఐటి ఇన్‌స్పెక్టర్ పేరుతో తమకు బెదిరింపులు వస్తున్నాయని వ్యాపారులు చేసిన ఫిర్యాదులపై స్పందించిన ఐటి రేంజ్ 1 జాయింట్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యారావుపేట పోలీసులు ఆ నకిలీ ఐటి ఇన్‌స్పెక్టర్‌ను అరెస్టు చేశారు.
గుంటూరుకు చెందిన 29 ఏళ్ల చదలవాడ తిరుమల రెడ్డి 10వ తగతి వరకు చదువుకున్నాడు. అక్కడే ఒక బంగారం దుకాణంలో పనిచేసేవాడని ఎసిపి రవి కిరణ్ విలేకరులకు తెలిపారు. అక్కడ పనిచేస్తున్న కాలంలో ఐటి అధికారుల పనితీరు, వారు ఆడిటింగ్ చేసే విధానాన్ని అతను తెలుసుకున్నాడు. అయితే భారీ నష్టాల కారణంగా బంగారం షాపు మూతపడడంతో తిరుమల రెడ్డి ఉద్యోగం కోల్పోయాడు. గుంటూరు బస్లాండ్ సమీపంలో ఒక గదిని అద్దెకు తీసుకుని తన విలాసాల కోసం అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.
కొద్ది మంది వ్యాపారుల ఫోన్ నంబర్లు సేకరించి వారికి ఫోన్ చేసి తాను ఐటి ఇన్‌స్పెక్ట్‌ర్‌నని, తనకు డబ్బు ఇవ్వకపోతే సోదాలు చేస్తానంటూ బెదిరించి డబ్బు వసూలు చేయసాగాడు. ఇలా చాలా మంది వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేశాడు. అయితే తనకు వచ్చిన బెదిరింపు కాల్‌పై ఒక వ్యాపారి అనుమానించి ఐటి జాయింట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు తిరుమల రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 10వేల నగదు, సెల్‌ఫోన్, విజిటింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఎసిపి తెలిపారు.