తయారు చేసి విక్రస్తున్న ముగ్గురు, పరారీలో ఒకరు
టూవీలర్లకు రూ.500, ఆటోకు రూ.2,500కు విక్రయం
అరెస్టు చేసిన మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు
వివరాలు వెల్లడించిన మాదాపూర్ డిసిపి శిల్పవల్లి
హైదరాబాద్: నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా,మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు, కంప్యూటర్ మానిటర్లు, హార్డ్ డిస్క్‌లు, ప్రింటర్, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.79,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డిసిపి శిల్పవల్లి తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
హఫీజ్ పేటకు చెందిన మహ్మద్ సర్వర్ షరీఫ్, సంఘారెడ్డికి చెందిన మిర్జాఅలియాజ్ బైగ్ ఆటో డ్రైవర్, షేక్ జమీల్ ఆటో డ్రైవర్, అజహార్ కలిసి నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. ముగ్గురు నిందితులను పోలీసులను అరెస్టు చేయగా, అజహర్ పరారీలో ఉన్నాడు. మహ్మద్ సర్వర్ షరీఫ్ హఫీజ్‌పేటలో అమైరా కమ్యూనికేషన్ పేరుతో కస్టమర్ సర్వీస్ పాయింట్‌ను నిర్వహిస్తున్నాడు.
ఇందులో ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో, యునైటెడ్ ఇండియా, భారతీ పేరుతో నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు వాహనదారులకు ఇస్తున్నారు. ప్రధాన నిందితుడు సర్వర్ షరీఫ్ నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లను తయారు చేసి మిగతా వారికి రూ.500, రూ.1,000లకు విక్రయిస్తున్నాడు. ఇతడి వద్ద నకిలీ సర్టిఫికేట్లను కొనుగోల చేస్తున్న మిర్జాఅలియాజ్ బైగ్, షేక్‌జమీల్ అహ్మద్ వాటిని ఎక్కువ డబ్బులకు విక్రయిస్తున్నాడు.