Thursday, January 23, 2025

నకిలీ ఐపిఎస్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

పోలీస్, ఆర్మీ అధికారి పేరు చెప్పి పలు రాష్ట్రాలో మోసాలు
కిడ్నాప్‌లు, బెదిరింపులతో డబ్బులు వసూలు
సైబరాబాద్‌లో కార్యాలయం తెరిచిన నిందితుడు
7.65 కంట్రీమేడ్ పిస్తోల్, తొమ్మిది రౌండ్లు స్వాధీనం
అరెస్టు చేసిన పోలీసులు
సిటిబ్యూరోః ఐపిఎస్, ఆర్మీ అధికారిగా చెప్పుకుంటూ పలువురిని మోసం చేస్తున్న నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 7.65 కంట్రీమేడ్ పిస్తోల్, 9 రౌండ్లను, పోలీస్, ఆర్మీకి అధికారులకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డిసిపి శిల్పవల్లి తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపిలోని వెస్ట్‌గోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం మండలం,అగ్రహారానికి చెందిన నాగరాజు కార్తీక్ రఘు వర్మ అలియాస్ కార్తీక్ ఎపిలోని చిక్కాలా గ్రామంలో ఉంటున్నాడు. నిందితుడు ఇంటర్ వరకు చుదువుకుని మానేశాడు. అప్పటి నుంచే వివిధ నేరాలు చేశాడు. ఐపిఎస్ అధికారినంటు పలువురిని బెదిరిస్తున్నాడు.

ఈ క్రమంలోనే మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులోని ఓయో హోటల్‌లో రూమ్ తీసుకుని పోలీస్ అధికారి పేరుతో సెటిల్‌మెంట్లు చేస్తున్నాడు. నిందితుడు ఓ మహిళను ట్రాప్ చేశాడు, అంతేకాకుండా తక్కువ ధరకు జాగ్వార్ కార్లు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేశాడు. పోలీస్ విచారణ పేరుతో చాలామందిని చిత్రహింసలకు గురిచేశాడు. తుపాకులు, పోలీస్ వాహనాల, సైరన్లను వేసి బెంబేలు సృష్టించాడు. హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి విడుదల చేసేందుకు రూ.14లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. ప్రసాద్ కుటుంబ సభ్యుల నుంచి అడ్వాన్సుగా రూ.30వేలు తీసుకున్నాడు. ఇంటెలీజెన్స్ ఆఫీసర్‌ను అని చెప్పి నాగరాజు అతడి స్నేహితులు శ్రీశైలం, స్వామి కలిసి కిడ్నాప్‌లు చేసి డబ్బులు వసూలు చేశారు.
నిందితుడి నేరాల చిట్టా….
ఆర్మి, ఐపిఎస్ అధికారిగా చెలామణి అవుతున్న నిందితుడి నేరాల చిట్టా భారీగా ఉంది. కాలేజీ రోజుల్లో ఎస్సై, కానిస్టేబుల్ ఎంపిక పరీక్షల రాసిన నిందితుడు వాటికి ఎంపికకాలేదు. దీంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి నకిలీ పోలీస్ అధికారి అవతారం ఎత్తాడు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నిందితుడు 2016లో హైదరాబాద్‌కు వచ్చి సనత్‌నగర్‌లోని గౌస్ పాషా ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా చేరాడు. అక్కడి యజమాని ఇన్నోవా కారును చోరీ చేసి తీసుకుని వెళ్లడంతో సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మహారాష్ట్రకు వెళ్లి అక్కడ నాలుగు నెలలు బోర్‌వెల్స్‌లో పనిచేశాడు. 2018లో తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన నిందితుడు వరిశ్టా ఇన్‌ఫో కాం కంపెనీ ఎండి వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. ఇక్కడ కూడా యజమాని కారును చోరీ చేశాడు, దీంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో ఉన్న ఎక్స్‌పర్ట్ సెక్యూరిటీ సర్వీస్‌లో సూపర్‌వైజర్‌గా చేరాడు.

అక్కడ తనకు పరిచయమైన మాజీ ఆర్మీ ఉద్యోగి నుంచి ఆర్మీ అధికారుల ర్యాంక్‌లు, డ్రెస్, బ్యాచ్‌లు తదితర వివరాలు తెలుసుకున్నాడు. తర్వాత ఆర్మీ యూనిఫాం కొనుగోలు చేసి గ్రామానికి వెళ్లాడు. అక్కడ తాను మేజర్‌గా ఎంపికయ్యానని బంధువులు, స్నేహితులకు చెప్పాడు. నిరుద్యోగ యువకులను పోగు చేసి వారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. స్థానిక పోలీసులకు అనుమానం వచ్చి ఆర్మీ అధికారులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తర్వాత 2020లో మళ్లీ హైదరాబాద్‌కు వచ్చిన నాగరాజు తనకు తెలిసిన వారితో కలిసి ఇంటెలీజెన్స్ అధికారినని చెప్పి మధుసూదన్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించి ఇంట్లోని లక్ష రూపాయలు తీసుకుని వెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత తండ్రి, కుమారుడిని కిడ్నాప్ చేసి రూ.50వేలు వసూలు చేశాడు.

తాను ఆర్మీలో కల్నల్‌గా పనిచేస్తున్నానని చెప్పి మదీనాగూడలోని ఐ హెల్త్ కార్ట్ ఆస్పత్రిని ప్రారంభించాడు. ఆస్పత్రిని ప్రారంభించినందుకు నిర్వాహకుల నుంచి రూ.1,30,000 తీసుకున్నాడు. తర్వాత గ్రామానికి వెళ్లిన నిందితుడిని తన స్నేహితులు అనిల్‌కుమార్, దీపక్ కుమార్ హైదరాబాద్‌కు పిలవడంతో వచ్చాడు. ముగ్గురు కలిసి పైళ్ల స్వామిసత్యనారాయణను కూకట్‌పల్లి వద్ద కిడ్నాప్ చేసి రూ.1,90,000 వసూలు చేశారు. కెపిహెచ్‌బి పోలీసులు అరెస్టు చేసి పిడి యాక్ట్ పెట్టగా మే,17,2022న జైలు నుంచి విడుదలయ్యాడు. సొంత గ్రామానికి వెళ్లిన నిందితుడు అక్కడ సెక్స్ వర్కర్‌ను సిఐగా పనిచేస్తున్నానని బెదిరించి రూ.50వేలు తీసుకున్నాడు. ఏలూరులో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన మేకపాటి రవిశంకర్‌ను కిడ్నాప్ చేసి ఇంటర్ స్టేట్ క్రైం బ్రాంచ్ అనాలిటికల్ ఆఫీసర్ పేరుతో రూ.3.70లక్షలు వసూలు చేశాడు.

తర్వాత రవిశంర్ మోసం చేసిన బాధితులు రైతులని రవిశంకర్‌ను ఎన్‌కౌంటర్ చేశానని అతడి షర్ట్‌పై కోడి రక్తం పూసి తీసిన వీడియోను అతడి కుటుంబసభ్యులకు చూపించాడు. జైలులో పరిచయమైన సైబర్ క్రైం నిందితుడు యశ్వంత్ సాయంతో జార్ఖండ్‌కు వెళ్లి కంట్రీమేడ్ పిస్తోల్ కొనుగోలు చేసి తీసుకుని వచ్చాడు. మార్చిలో పోలీస్ యూనిఫాం, వాకీటాకీ, పోలీస్ ఫ్లాష్ లైట్ తదితరాలను కొనుగోలు చేశాడు. వాటిని చూపిస్తు బాధితులను కిడ్నాప్ చేస్తూ నేరాలు చేస్తున్నాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శంషాబాద్ ఎస్‌ఓటి, మాదాపూర్ పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News