Monday, December 23, 2024

గ్యాంగ్ సినిమా తరహాలో దోపిడీ

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గ్యాంగ్ సినిమా తరహాలో నకిలీ ఐటి అధికారులు సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో శనివారం జూవెల్లరీషాపులో బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఐటి అధికారుల పేరు చెప్పి వచ్చిన ఐదుగురు వ్యక్తులు జూవెల్లరీలోని 1,700 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకుని పారిపోయారు. పోలీసుల కథనం ప్రకారం….మహారాష్ట్ర, షోలాపూర్‌కు చెందిన రివెన్ మధుకర్ బవర్ అనే వ్యక్తి మోండా మార్కెట్‌లో బాలాజీ గోల్డ్ షాపు పేరుతో బంగారం షాపు పెట్టాడు. మధుకర్ సొంత గ్రామానికి వెళ్లడంతో అతడి బావమరిది వికాస్ ఖేదకర్ జూవెల్లరీలో ఉంటున్నాడు. వికాస్‌తోపాటు ముగ్గురు వర్కర్లు షాపులో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఐదుగురు వ్యక్తులు షాపుకు వచ్చారు.

బంగారం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారని బెదరించారు. జూవెల్లరీలో మొత్తం బంగారం తనిఖీ చేయాలని సిబ్బందిని, వికాస్‌ను ఒక పక్కకు కూర్చొబెట్టారు. షాపులో ఉన్న 1,700 గ్రాముల బంగారానికి సంబంధించి ఎలాంటి ట్యాక్స్ చెల్లించలేదని, దానిని స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. సిబ్బందికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారిని ఓ రూమ్‌లో వేసి అక్కడి నుంచి పరారయ్యారు. బయటికి వచ్చిన తర్వాత వికాస్ మిగతా బంగారం షాపుల వారికి ఐటి రైడ్స్ గురించి చెప్పాడు. ఐటి అధికారులు రైడ్ చేయరని, నోటీసులు ఇచిస్తారని చెప్పడంతో అనుమానం వచ్చిన వికాస్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వెంటనే సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఐటి అధికారులతో మాట్లాడడంతో ఇది నకిలీ ఐటి అధికారుల పనిఅని తెలిసింది. జూవెల్లరీ షాపులో ఉన్న వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు అందరిని ఒకేచోట ఉంచి తనిఖీలు నిర్వహించారు. సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ఐదుగురిని గుర్తించారు. నిందితులు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

ఐదు బృందాల ఏర్పాటుః డిసిపి
జూవెల్లరీ షాపులో దోపిడీ చేసిన నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశామని నార్త్‌జోన్ డిసిపి దీప్తి చందన తెలిపారు. బాధితులు నాలుగు నెలల క్రితమే షాపు పెట్టారని తెలిపారు. ఇది తెలిసిన వారి పనేనని అనుమానం వ్యక్తం చేశారు. వికాస్ ఖేదకర్ దిల్‌సుఖ్‌నగర్‌లో మరో గోల్డ్ షాపు నిర్వహిస్తున్నాడని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News