Monday, July 8, 2024

నకిలీ మందుల తయారీ ముఠా గుట్టురట్టు

- Advertisement -
- Advertisement -

గుట్టు చప్పుడు కాకుండా నకిలీ మందులు తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మూఠాను మేడ్చల్ ఎస్‌ఓటి, పేట్ బషీరాబాద్ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, వారి వద్ద నుంచి రూ.50లక్షల విలువైన నకిలీ మందులు, రూ.25లక్షల విలువైన ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా, వెంకటాపురం మండలానికి చెందిన ముద్దాయి గిరినేని గోపాల్ నిజాంపేట, మధురానగర్‌లో ఉంటున్నాడు, జగద్గిరిగుట్ట, సంజయ్‌పురి కాలనీకి చెందిన బొక్క రామకృష్ణ, ఢిల్లీకి చెందిన నిహాల్ కలిసి నకిలీ మందులు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో మేడ్చల్ డ్రగ్స్ కంట్రోల్, మేడ్చల్ ఎస్‌ఓటి, పేట్‌బషీరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ మందులు పట్టుకున్నారు.

నిందితుల్లో గోపాల్, రామకృష్ణను అరెస్టు చేయగా, నిహాల్ పరారీలో ఉన్నాడు. ఢిల్లీకి చెందిన నిహాల్ నిందితులకు నకిలీ మందులు తయారు చేసేందుకు ముడిసరుకు సరఫరా చేస్తున్నారు. గోపాల్, రామకృష్ణ కలిసి మల్టీనేషనల్ కంపెనీకి చెందిన నకిలీ మందులను తయారు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారు. గోపాల్, నిహాల్ కలిసి కోవిడ్ సమయంలో ప్లాస్టిక్‌కు సంబంధించిన సర్జికల్ వస్తువులు తయారు చేసేవారు. ఇద్దరికి మెడిసిన్‌పై పూర్తి అవగాహన ఉండడంతో నకిలీ మందుల తయారీకి ఫ్లాన్ వేశారు. దీనికి గతంలో ఫార్మాసిటికల్ కంపెనీలో పనిచేసిన రామకృష్ణతోడయ్యాడు. ముగ్గురు కలిసి దూలపల్లి లోని సెంట్ మార్టిన్స్ కాలేజ్ పక్కన ఒక గోడౌన్‌ను అద్దెకు తీసుకుని నకిలీ మందులను తయారు చేస్తున్నారు. వాటిని ఢిల్లీలో ఉండే నిహాల్‌కి చేర్చేవాడు. వీరికి మందులు తయారు చేసేందుకు ఎలాంటి అనుమతి లేదు, దీంతో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితులపై 318, 340(2),277,278, 49 భారతీయ న్యాయ చట్ట సంహిత (బిఎన్‌ఎస్)కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అడిషనల్ డిసిపి శోభన్, ఎస్‌ఓటి డిసిపి రమేష్, మేడ్చల్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News