Sunday, January 19, 2025

ఇది దేశ ద్రోహమే

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ప్రాంతాల మధ్య చిచ్చు రగిలించి ఆ మంటల్లో చలి కాచుకోడం ఎంత అమానుషమో మానవత్వం వున్నవారికి వివరించవలసిన పని లేదు. గతంలో బొంబాయిలో, గుజరాత్‌లో అన్య రాష్ట్రాల, ప్రాంతాల వలస కార్మికులపై జరిగిన దాడులు దేశ చరిత్రలో చిమ్మ చీకటి అధ్యాయాన్ని లిఖించాయి. మళ్ళీ అటువంటి భయోత్పాతాన్ని సృష్టించి భిన్న ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రగిలించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వారు ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం వల్ల అందివచ్చిన సామాజిక మాధ్యమాలను వాడుకోడం అత్యంత జుగుప్సాకరం. వీరికి తమ దుష్ప్రయోజనాల ముందు జాతి సమైక్యత ఎందుకూ పనికిరానిదని బోధపడుతున్నది. ఈ కల్పిత వార్తల (ఫేక్ న్యూస్) దురాగతాన్ని అందరూ ఒక్క కంఠంతో ఖండించవలసి వుంది. ఉత్తరాది వలస కార్మికులపై తమిళనాడులో దాడులు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన అబద్ధాలు ఉన్నట్టుండి బీహార్ అసెంబ్లీలో పెద్ద దుమారానికి దారి తీశాయి.

అక్కడి ప్రతిపక్షం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ఇటీవల వొంటి కాలు మీద లేచింది. దానితో ఆయన నిజ నిర్ధారణ కోసం నలుగురు అధికారుల బృందాన్ని తమిళనాడుకు పంపిస్తున్నట్టు ప్రకటించారు. హిందీ మాట్లాడినందుకు 12 మంది బీహారీ వలస కార్మికులను తమిళనాడులో ఉరి తీశారంటూ ట్విటర్‌లో పెట్టిన ఫేక్ న్యూస్ సహజంగానే ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. దీనిపై బీహార్ ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేయడం, అటువంటిదేమీ జరగలేదని, ఆందోళన చెందవలసిన పనే లేదని తమిళనాడు సిఎం ప్రకటించడం జరిగిపోయాయి. అటువంటి దాడులేవీ తమ రాష్ట్రంలో చోటు చేసుకోలేదంటూ తమిళనాడు డిజిపి చేసిన ప్రకటనను బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ప్రస్తావించడాన్ని కూడా అక్కడి ప్రతిపక్షం తప్పుపట్టింది. అంతేకాదు తమిళనాడు సిఎం స్టాలిన్ పుట్టిన రోజు ఉత్సవాల్లో తేజస్వి పాల్గొనడాన్ని బీహార్ ప్రతిపక్షాలు ఆక్షేపించాయి.

దాడుల సమాచారంపై స్టాలిన్‌తో నేరుగా మాట్లాడనందుకు నితీశ్ కుమార్‌ని ఆయన ఒకప్పటి సలహాదారు రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ తప్పు పట్టారు. ఏమీ లేని దానికి ఇంత భారీ స్థాయి విష వాతావరణాన్ని సృష్టించిన ఆ ట్వీటర్ ఎవరు, ఇంకెవరవుతారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బిజెపి ప్రతినిధి ప్రశాంత్ ఉమ్రావ్ ఈ ట్వీట్‌ను పోస్టు చేశాడని తేలింది. అయితే ఉమ్రావ్ దేనినైతే ఆశించి ఈ ట్వీట్ చేశాడో అ కల్లోల కాండ తలెత్తకపోడం హర్షించవలసిన విషయం. ఈ ఫేక్ న్యూస్ తమిళనాడులోనూ, ఉత్తరాదిలోనూ పరస్పర దాడులను జరిపించి వుంటే అది ఎంతో హింసాకాండకు, మరెంతో విద్వేష వాతావరణానికి దారి తీసి వుండేది. తమిళనాడు వైపు నుంచి సకాలంలో నష్ట నివారణ చర్యలు తీసుకున్నందున ఆ మహోపద్రవం తప్పిందనుకోవాలి.

తమిళనాడులో ఉత్తరాది కార్మికులు అధిక సంఖ్యలో పని చేస్తున్నారు. ఒక్క అక్కడి జౌళి పరిశ్రమలోనే 10 లక్షల మంది ఉత్తరాది వలస కార్మికులు వున్నారని సమాచారం. తిరుప్పూరు రడీమేడ్ దుస్తుల పరిశ్రమలో పని చేస్తున్న వారిలో దాదాపు నాలుగో వంతు మంది ఉత్తరాదికి చెందిన కార్మికులేనని తెలుస్తున్నది. అలాగే కోయంబత్తూర్‌లోని ఫౌండ్రి పరిశ్రమలో దాదాపు 2 లక్షల మంది ఉత్తరాది కార్మికులు పని చేస్తున్నారు. తమిళనాడులో విద్వేషాగ్నులు రగిలించి అక్కడ బలంగా నాటుకొని వున్న ద్రవిడ రాజకీయ శక్తులను అప్రతిష్ఠ పాలు చేసే కుట్ర వంటిదేదైనా దీని వెనుక వుంటే ఆశ్చర్యపోనక్కర లేదు. కాని ఇటువంటివి అంతిమంగా ఉత్తరాది, దక్షిణాది మధ్య అఖాతాన్ని సృష్టిస్తే అది జాతీయ సమగ్రతకు, సమైక్యతకు హాని చేస్తుంది. బిజెపి వారు ఒక వైపు భారత్ మాతాకి జై అంటూనే ఇంకొక వైపు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తారని తేజిస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యను తప్పుపట్టలేని పరిస్థితి తలెత్తుతున్నది.

గతంలో బొంబాయి నుంచి బీహారీ, యుపి కార్మికులను శివ సైనికులు తరిమివేసిన సందర్భాలున్నాయి. 2008లో బొంబాయిలోని ఈ రెండు రాష్ట్రాల కార్మికులపై అనేక దాడులు జరిగాయి. అలాగే గుజరాత్‌లో 14 మాసాల బాలికపై అత్యాచార ఘటన అక్కడి బీహారీ, యుపి కార్మికులపై స్థానికుల దాడులకు కారణమైంది. దానితో ఆ రెండు రాష్ట్రాల కార్మికులు కట్టుబట్టలతో గుజరాత్‌ను వీడి వెళ్ళిపోయారు. మానవ శ్రమ అంతటికీ వ్యాప్తి చెందుతు న్నప్పుడే అభివృద్ధి సులభసాధ్యమవుతుంది. ఇందుకు వున్న చోట నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం ఎంతగానో తోడ్పడుతుంది. దేశమంతా ఒక్కటి కావడం, సుదూర భవిష్యత్తులోనైనా వసుధైక కుటుంబం సాకారం కావడం మానవాళి మంచికి దోహదం చేస్తాయి. రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు రేపే వారు, వైషమ్యాలు సృష్టించే వారు ఆ మహత్తర పరిణామానికి అవరోధం సృష్టించి విశ్వ వికాసానికి విఘాతం కలిగిస్తారు. మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాల ప్రాతిపదికగా మనుషులను విడదీసే వారి పట్ల అందరూ అప్రమత్తంగా వుండాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News