Sunday, January 19, 2025

సామాజిక మీడియాకు సంకెళ్ళు

- Advertisement -
- Advertisement -

సామాజిక మాధ్యమాల్లోని ‘నకిలీ వార్తల’ను లేదా ‘అబద్ధపు సమాచారా’న్ని అరికట్టేందుకు సామాజిక సాంకేతిక (ఐటి) చట్టానికి కేంద్రం తీసుకొచ్చిన సవరణ 1975- 77 నాటి చీకటి రోజులను గుర్తుకు తెస్తున్నది. రాచరిక ప్రభుత్వాల అడుగు జాడల్లో నడవడమే ప్రధాని మోడీ మార్కు ప్రజాస్వామ్యమని చాటుతున్నది. తమది అప్రకటిత ఎమెర్జెన్సీ పాలన అని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నది. సామాజిక మాధ్యమాల్లో, ఇంటర్‌నెట్ సమాచార వాహినుల్లో కేంద్రానికి సంబంధించి వచ్చే ‘తప్పుడు వార్తల’ను అరికట్టాలని మోడీ ప్రభుత్వం అకస్మాత్తుగా ఇప్పుడే ఎందుకు సంకల్పించిందో, దాని ఆంతర్యమేమిటో ఐటి చట్టానికి ఈ నెల 6వ తేదీన అది తీసుకు వచ్చిన సవరణ సందేహాతీతంగా తెలియజేస్తున్నది. వాస్తవానికి ఈ సవరణ నకిలీ వార్తలకు తెర దించడానికి బదులు సామాజిక మాధ్యమాల నిర్వాహకులను భయపెట్టి తమ దారికి తీసుకు రావడానికి ఉద్దేశించిందే. కేంద్ర ప్రభుత్వం గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని

తనిఖీ చేసి అందులోని ‘నకిలీ వార్తల’ను గుర్తించడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే అధికారాన్ని ఈ సవరణ కేంద్ర ఎలెక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు కట్టబెడుతున్నది. ఈ చట్టం సెక్షన్ 3 ప్రకారం తమ వేదికలపై కేంద్రానికి సంబంధించి వచ్చే తప్పుడు సమాచారాన్ని తొలగించేలా చేయవలసిన బాధ్యత ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలపై వుంటుంది. అలాంటి వార్తలను తొలగించనట్లయితే ఆ సామాజిక మాధ్యమాలు తమకున్న రక్షణ కవచాన్ని కోల్పోతాయి. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతేక విభాగాన్ని నెలకొల్పడమనేది ఎమెర్జెన్సీలో అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం పత్రికలను అదుపు చేయడానికి తీసుకొన్న చర్యనే గుర్తు చేస్తున్నది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులు పత్రికా కార్యాలయాల్లోకి ప్రవేశించి ఇష్టా రాజ్యంగా సెన్సార్ షిప్‌ను అమలు పరిచేవారు. వార్తా రచన ప్రాథమిక విషయాలు కూడా తెలియని అధికారులు ప్రభుత్వం అనే

మాట వాడిన ప్రతి వార్తను లేదా వ్యాఖ్యను ప్రభుత్వ వ్యతిరేకమైనదిగా పరిగణిస్తూ దానిపై వేటు వేసేవారు. పత్రిక ప్రచురణకు వెళ్ళే సమయం వరకు అనుమతి ఇవ్వకుండా వేధించేవారు. దానితో పాఠకులకు సకాలంలో పత్రికను అందజేయలేని దుస్థితిలో నిర్వాహకులు నానా అగచాట్లు పడేవారు. రాజ్యాంగం 19(1) (ఎ) అధికరణ భారతీయులందరికీ భావ ప్రకటన హక్కును ఇస్తున్నది. అదే సమయంలో 19(2) అధికరణ దానిపై సహేతుకమైన పరిమితులను విధిస్తున్నది. సహేతుకమైన పరిమితులు అనే దానిని పాలకులు మీడియా నోరు నొక్కివేసే దుర్మార్గానికి దుర్వినియోగం చేస్తున్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఎమెర్జెన్సీ ప్రకటించకుండానే ఐటి చట్టానికి తీసుకు వచ్చిన ఈ సవరణ సామాజిక మాధ్యమాలను వినియోగించుకొంటున్న సాధారణ ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను సమూలంగా హరించడానికి ఉద్దేశించినదేనని బల్లగుద్ది చెప్పవచ్చు. భవిష్యత్తులో ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా కంఠాన్ని కూడా నొక్కి వేయడానికి దీనిని ఉపయోగించరనే భరోసా లేదు.

అనేక రాష్ట్రాల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు చేరువలో వున్న సమయంలో ఈ ఐటి చట్ట సవరణను ప్రయోగించడం వెనుక కేంద్ర పాలకుల దురుద్దేశం సుస్పష్టం. ప్రభుత్వ తనిఖీ విభాగం సామాజిక మాధ్యమాల్లోని ఏ వార్తనైనా నకిలీ వార్త అని ముద్ర వేస్తే దానిని వెంటనే తొలగించవలసిన అవసరం వుండదని చెబుతూనే అటువంటి సామాజిక మాధ్యమంపై కోర్టుకు వెళ్ళే అవకాశాన్ని ఈ సవరణ ప్రభుత్వానికి కట్టబెట్టడం గమనించవలసిన విషయం. ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టుకోడానికి! ఎమెర్జెన్సీ కాలంలో విధించిన ఆంక్షల ప్రకారం అప్పట్లో పత్రికలు ఎటువంటి పుకారుకు ప్రాధాన్యం ఇవ్వకుండా చీఫ్ ప్రెస్ అడ్వయిజర్ అనుమతి తీసుకున్న తర్వాతనే ఏ వార్తనైనా ప్రచురించాలనే కఠినమైన నిబంధనను అమలు చేశారు. దీనిని అప్పటి కొన్ని ప్రముఖ ప్రతికలు తీవ్రంగా వ్యతిరేకించి పోరాటం చేశాయి.

ప్రస్తుత ఐటి చట్ట సవరణ నకిలీ వార్త అని ఫిర్యాదు వచ్చిన దానిపై సామాజిక మాధ్యమాలు చర్య తీసుకోడానికి పూర్వమున్న 15 రోజుల వ్యవధిని 72 గం.లకు తగ్గించి వేసింది. తనకు సంబంధించి ఏది అసలు వార్తో ఏది నకిలీ వార్తో నిర్ధారించడానికి ఒక తనిఖీ విభాగాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించడం పట్ల ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సవరణను వాడుకొని విలేకరులను కూడా ఇబ్బందులకు గురిచేసే ప్రమా దం వున్నది. తమకు అప్రతిష్ఠ తెచ్చే తిరుగులేని వాస్తవాలను సైతం నకిలీ వార్తలని ముద్ర వేసి వాటిని నిరోధించే అధికారాన్ని ఈ సవరణ ద్వారా కేంద్ర పాలకులు తమకు తాము కట్టబెట్టుకున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అడుగంటుతున్న చేదు వాస్తవం కళ్ళకు కడుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News